 
					Hydra: మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలోని పోచారం మున్సిపాలిటీ పరిధిలో.. హైడ్రా అధికారులు మరోసారి దూకుడుగా వ్యవహరించారు. చౌదరిగూడ, డాక్టర్స్ కాలనీలో కబ్జాలకు గురైన రూ.30 కోట్ల విలువైన 4 వేల గజాల ప్రభుత్వ పార్కు.. భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. లేఔట్ వేయించిన వారు స్వయంగా అక్రమ విక్రయాలకు పాల్పడడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది.
1985లో 26.9 ఎకరాల భూభాగంలో 500 ప్లాట్లతో లేఔట్ రూపొందించారు. ఆ సమయంలో 4 వేల గజాలను పార్కుగా చూపించారు. అయితే, ఈ లేఔట్ వేసిన భూ యజమానుల కుటుంబ సభ్యుల్లో.. ఆముదాల నరసింహ కుమారుడు రమేష్ ఆ స్థలాన్ని తప్పుడు పత్రాలతో.. 800 గజాల చొప్పున ఐదు ప్లాట్లుగా విభజించి కులకర్ణి అనే వ్యక్తికి విక్రయించాడు. కులకర్ణి ఆ స్థలాన్ని మళ్లీ 200 గజాల చొప్పున 20 ప్లాట్లుగా విడదీసి రాజేష్, సోమాని, ఇతరులకు విక్రయించాడు.
ఇంత పెద్ద స్థాయిలో జరిగిన ఈ కబ్జాలు కాలనీవాసుల దృష్టికి రావడంతో.. డాక్టర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ తక్షణమే విచారణ ఆదేశాలు జారీ చేశారు. హైడ్రా అధికారులు, రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు.
దీంతో పార్కు భూమిపై కబ్జా జరిగినట్లు నిర్ధారించబడింది. తప్పుడు పత్రాలతో భూమి విక్రయం జరిగినట్లు ధృవీకరించడంతో, హైడ్రా చర్యలకు దిగింది. గత నెల సెప్టెంబరులో కాలనీ ప్రతినిధులు హైడ్రాను ఆశ్రయించగా, విచారణ పూర్తి చేసి ఈ భూమి నిజానికి పార్కు స్థలమేనని అధికారికంగా నిర్ధారించారు.
Also Read: ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకల్లోపూల దండా లొల్లి..!! స్వర్ణ VS కొండా
తాజాగా శుక్రవారం ఉదయం హైడ్రా అధికారులు స్థానిక పోలీసుల సాయంతో ఆక్రమణలను తొలగించారు. బుల్డోజర్ల సాయంతో కట్టడాలను కూల్చివేసి, పార్కు స్థలాన్ని పూర్తిగా క్లియర్ చేశారు. అనంతరం 4 వేల గజాల స్థల చుట్టూ ఫెన్సింగ్ వేసి, హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ చర్యతో డాక్టర్స్ కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. కబ్జా భూమిని తిరిగి సాధించినందుకు కాలనీవాసులు.. హైడ్రా అధికారులను అభినందించారు.