Ajwain Health Benefits: జలుబు అనగానే మనకి మొదట గుర్తుకు వచ్చేది తలనొప్పి, ముక్కు కారడం, గొంతు నొప్పి, దగ్గు. ఒక్కసారి ఈ సమస్యలు మొదలైతే రోజువారీ పనులు చేయడమే కష్టమైపోతుంది. సాధారణంగా చాలామంది వెంటనే మందుల కోసం వెతుకుతారు. కానీ ప్రతి చిన్న సమస్యకీ మందులు వేసుకోవడం అవసరం లేదు. మన ఇంట్లోనే తేలికగా చేసుకునే కొన్ని సహజ చికిత్సలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా వాము–బెల్లం కషాయం ఒకటి. ఈ కషాయం మన పాతకాలం నుండి ఉపయోగిస్తున్న ఇంటి వైద్యపద్ధతులలో ఒకటిగా పేరుగాంచింది.
ఎలా తయారు చేసుకోవాలి?
ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా యాభై గ్రాముల బెల్లం తీసుకోవాలి. దానికి ఒకటిన్నర టీ స్పూన్ వామును వేసి రోకలిబండపై బాగా నూరాలి. ఈ మిశ్రమాన్ని రెండు గ్లాసుల నీటిలో వేసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి. నీరు మరిగి సగం అయ్యే వరకు ఉంచాలి. తరువాత దించేసి చల్లారనివ్వాలి. చల్లారిన తరువాత వడగట్టి గ్లాస్‌లోకి తీసుకుంటే కషాయం సిద్ధమవుతుంది. చాలా తక్కువ సేపులో ఇంట్లోనే ఈ ఔషధాన్ని సిద్ధం చేసుకోవచ్చు.
ఇప్పుడు దీని ప్రయోజనాల గురించి చెప్పుకుంటే
వాములో ఉండే సహజ నూనెలు శ్వాసనాళాల్లోని దప్పికను తగ్గిస్తాయి. జలుబు వల్ల ముక్కు బ్లాక్ అవుతుంది, శ్వాస తీసుకోవడమే కష్టమవుతుంది. ఈ కషాయం తాగితే ముక్కు బ్లాక్ తొలగిపోతుంది. గొంతులోని మలినాలు కరిగి దగ్గు తగ్గుతుంది. బెల్లం శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. జలుబుతో వచ్చే అలసట, బలహీనతలు పోతాయి. అంతేకాదు, ఇది జీర్ణక్రియను మెరుగుపరచి ఆకలిని కూడా పెంచుతుంది.
Also Read:Sreemukhi: కాటుక కళ్ళతో ఆకట్టుకుంటున్న శ్రీముఖి.. అందానికి ఫిదా!
రోజుకు రెండు సార్లు
రోజుకు రెండు సార్లు ఈ కషాయం తాగితే జలుబు బాగా తగ్గిపోతుంది. పెద్దవారు ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాస్, రాత్రి పడుకునే ముందు మరో గ్లాస్ తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. చిన్న పిల్లలకు అయితే తక్కువ పరిమాణంలో ఇవ్వాలి. ఎందుకంటే పిల్లల శరీరానికి సరిపడే మోతాదే మంచిది. ఈ కషాయం ప్రతిసారి తాజాగానే తయారు చేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచితే దాని ప్రభావం తగ్గిపోతుంది. అందుకే ఉదయం, రాత్రి విడివిడిగా కొత్తగా చేసుకోవడం మంచిది.
జలుబుకే కాదు అనారోగ్య సమస్యలకు ఉపయోగం
వాము కేవలం జలుబుకే కాదు, ఇతర అనారోగ్య సమస్యలకు కూడా ఉపయోగపడుతుంది. గ్యాస్, అజీర్తి, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలకు వాము చాలా మంచి ఔషధం. అలాగే బెల్లం శరీరానికి ఐరన్‌ను అందించి రక్తాన్ని పెంచుతుంది. అందువల్ల ఈ కషాయం తాగడం వల్ల ఒకేసారి అనేక లాభాలు కలుగుతాయి. మందులు వాడకుండా సహజమైన పద్ధతిలోనే జలుబు తగ్గించే అద్భుతమైన పరిష్కారం ఇది. ఈ కషాయం శరీరానికి శక్తినిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే జలుబు మొదలైన వెంటనే ఈ కషాయం ప్రయత్నిస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది.