 
					Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. ప్రచారం జోరు పెంచిన ప్రధాన పార్టీలు.. గెలుపు మాదంటే మాదని ధీమా వ్యక్తం.. అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలందరూ జూబ్లీలో డోర్ టూ డోర్ ప్రచారం.. బీఆర్ఎస్ మాజీ మంత్రులు, కీలక నేతలు గల్లి గల్లీ ప్రచారం.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వినిపిస్తున్న మాట ఒక్కటే.. జూబ్లీ కింగ్ ఎవరు..? గెలిచేది అధికార కాంగ్రెస్ పార్టీనా..! బీఆర్ఎస్ పార్టీనా..! అనే అంశం గురించే జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.. ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉందని బయట టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ఎట్లా అయిన జూబ్లీలో పాగా వేయాలని కాంగ్రెస్ పార్టీ.. ఉపఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో మళ్లీ పట్టు బిగించాలని బీఆర్ఎస్.. ఇలా రెండు పార్టీలు ప్రచార జోరును పెంచాయి. అయితే.. ఎవరికి ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది..? బయట జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు..? ప్రస్తుతం ఈక్వెషన్స్ ఎలా ఉన్నాయో క్లియర్ కట్ గా ఈ స్టోరీలో తెలుసుకుందాం..
⦿ ఈక్వెషన్స్ తారుమారు.. నిజమేనా?
సరిగ్గా నెల క్రితం.. జూబ్లీ ఉపఎన్నికల్లో ఈ సారి బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఎక్కువ ఉందని అటు బయట.. ఇటు సోషల్ మీడియాలో ఎక్కువగా మాట్లాడుకున్నారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరు ప్రకటించక ముందు.. ప్రకటించిన తర్వాత ఈక్వేషన్స్ లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ హై కమాండ్ నవీన్ పేరును ప్రకటించన ఒకటి, రెండు రోజుల్లోనే గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది.. అసలు ఎవరీ నవీన్ యాదవ్..? ఇంతకు ముందు ఎన్ని సార్లు పోటీ చేశారు..? అనే విషయాల గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా సెర్చ్ చేశారు. అయితే.. సానుభూతి అనే అంశం గురించి మాట్లాడితే.. చాలా మంది మాగంటి సునీతపై ఓటర్లు సింపతీ చూపించబోతున్నారనే టాక్ ఎక్కువగా నడిచింది.. కానీ అదే సింపతీ ఇప్పుడు రివర్స్ అయ్యింది.. నవీన్ కుమార్ యాదవ్ 2014, 2019, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా జూబ్లీ నుంచి పోటీచేయడం.. ఓడిపోవడం ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే ఓటర్లు ఈసారి నవీన్ యాదవ్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
⦿ నవీన్ యాదవ్‌కు కలిసి వచ్చే అంశాలివే..
అలాగే.. అధికార కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతు తెలపడం, గత కొన్నేళ్లుగా నవీన్ యాదవ్ నియోజకవర్గంలోనే ఉంటూ పేదలకు ఆసరగా నిలబడడం, కొన్ని రోజుల క్రితం సామూహిక సీమంతాలు చేయడం, బీసీ ప్రజల గురించి రేవంత్ సర్కార్ కీలక ఆలోచనలు చేయడం.. ఇవన్నీ నవీన్ యాదవ్ కు కలిసి వచ్చే అంశాలని రాజకీయ పండితులు భావిస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న కీలక నిర్ణయం ఎమ్మెల్యే అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ప్రకటించడమే అని మాట్లాడుకుంటున్నారు. ఈ అంశంతోనే ఒక్కసారిగా జూబ్లీలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందని తెగ మాట్లాడుకుంటున్నారు. అలాగే రాష్ట్ర మంత్రులందరూ జూబ్లీ లో డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహించండం.. గడిచిన రెండేళ్ల నుంచి విజయవంతంగా అమలు అవుతోన్న సంక్షేమ పథకాల గురించి పూస గుచ్చినట్టు వివరించి చెప్పడం కూడా హస్తం పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
⦿ కాంగ్రెస్ కొంత ఇది మైనస్.. ఎలా అంటే?
అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని మైనస్ ల గురించి అక్కడక్కడ మాట్లాడుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయ్యింది.. మామూలుగా ఏ ప్రభుత్వం అయినా ఏర్పడిన రెండు, మూడేళ్ల తర్వాత కొంత వ్యతిరేకత రావడం కామన్.. దీన్ని బీఆర్ఎస్ ప్రధాన అస్త్రంగా వాడుకుంటుంది. అలాగే రెండు రోజుల క్రితం నవీన్ యాదవ్ మాట్లాడే విధానం కూడా జనాలు గమనిస్తున్నారు. ‘బీఆర్ఎస్ వాళ్లు ఎక్కువగా మాట్లాడితే.. జూబ్లీహిల్స్ గల్లీల నుంచి ఇంటికి కూడా వెళ్లలేరు’ అని నవీన్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కొంత నెగిటివ్ గా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే.. ఇంకో రెండు వారాల్లో ఎన్నికల పోలింగ్ పెట్టుకుని.. కాంగ్రెస్ సీనియర్ నేత అజారుద్దీన్ కు సీఎం రేవంత్ కేబినెట్ లో చోటు ఇవ్వడం.. వీటి గురించి జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో దాదాపు లక్షకు పైగా మైనార్టీ ఓట్ల కోసమే కేబినెట్ విస్తరణ చేస్తున్నారా..? ఎన్నికల కోడ్ సమయంలోనే మంత్రి పదవి ఇవ్వాళా..? అనే అంశం గురించి కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు. ఈ అంశాలన్ని కొంత నెగిటివ్ అయినప్పటికీ.. కాంగ్రెస్ కు పెద్దగా ఫరక్ పడకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
⦿ బీఆర్ఎస్ కు ప్లస్ పాయింట్ ఇది.. మరి గెలిచేది ఎవరో..?
నవీన్ యాదవ్ వ్యక్తిగత బలం ఉన్నప్పటికీ, కొన్ని పార్టీ పరమైన, రాజకీయపరమైన సవాళ్లను అధిగమించాల్సి ఉంది. దివంగత నేత మాగంటి గోపీనాథ్ సెంటిమెంట్ బీఆర్ఎస్ కు కొంత ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక గెలిచినంత సులభంగా ఇది ఉండకపోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సుమారు రెండేళ్లు కావడంతో, ప్రభుత్వంపై సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతను నవీన్ యాదవ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. నవీన్ యాదవ్ తన వ్యక్తిగత బలం, యువత మద్దతు, బీసీ కోటా వంటి సానుకూల అంశాలతో బరిలోకి దిగుతున్నప్పటికీ.. మాగంటి గోపీనాథ్ సెంటిమెంట్, మైనార్టీ ఓటర్ల సమీకరణ, బీఆర్‌ఎస్ నగర ప్రాబల్యం వంటి ప్రధాన సవాళ్లను అధిగమించగలిగితేనే నవీన్ యాదవ్ జూబ్లీ కింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ అంశాల ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది నవంబర్ 14న ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలి.
ALSO READ: జూబ్లీలో ఎవరి గెలుపు శాతమెంత..?