⦿ పవర్ పోయినా పొగరు తగ్గలే.. !
⦿ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వీరంగం
⦿ వారికి కేటీఆర్ బహిరంగ మద్దతు
⦿ సందర్భం లేకుండా రెచ్చిపోతున్న నేతలు
⦿ మాటతీరు, వ్యవహార శైలిలో విపరీత పోకడలు
⦿ జనం ఛీ కొడుతున్నా మారని లీడర్ల వైఖరి
⦿ అత్యంత వివాదాస్పదమైన కౌశిక్ రెడ్డి తీరు
⦿ మందలించాల్సిన పార్టీ పెద్దలే మద్దతు ఇస్తున్న వైనం
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: BRS on Kaushik Reddy: చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా ఉంది బీఆర్ఎస్ నేతల వ్యవహారం. అధికారం పోయాక కూడా ఆ మత్తు ఆ పార్టీ నేతలను వీడటం లేదు. సీనియర్లు, జూనియర్ నేతలంటూ తేడా లేకుండా అందరూ ఒకే తీరుగా దిగజారుడు రాజకీయం చేస్తున్నారు. ఆదర్శంగా ఉండాల్సిన సీనియర్ నేతలే కట్టు తప్పుతూ, జూనియర్లనూ అదే రొంపిలోకి లాగుతున్నారు.. నిన్న మొన్నటి దాకా అధికారంలో ఉండి తమను మించిన వారు లేరు, తెలంగాణకు తామే దిక్కు అన్నట్లు వ్యవహరించిన బీఆర్ఎస్ నేతలు, అధికారం పోయి ఏడాది అయినా ఆ మదం వీడలేదన్న విమర్శలు వస్తున్నాయి.
రోజుకో తీరు, పూటకో వ్యవహారంతో బీఆర్ఎస్ నేతల ప్రవర్తన విపరీత పోకడలకు దారితీస్తోంది. తాజాగా కరీంనగర్ కలెక్టరేట్ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వీరంగం మరోసారి వివాదాస్పదమైంది. గతంలోనూ ఈయన సవాళ్ల తీరు, చేసిన వీరంగం అనేక సార్లు బీఆర్ఎస్‌ను అపహాస్యం చేసింది. అయినా కౌశిక్‌ను కట్టడి చేయకపోగా ప్రోత్సహిస్తున్న తీరుపై జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలోని సీనియర్ల పోకడలను అనుసరిస్తూ కౌశిక్ రెడ్డి తాజాగా రెచ్చిపోయిన వైనం ఇటీవల జరిగిన అనేక సంఘటనలను గుర్తుచేస్తోంది.
కేటీఆర్ తీరు అంతే..
ఏకంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మధ్య వాడుతున్న భాష, పదజాలం, విసురుతున్న సవాళ్లు కూడా వివాదాస్పదం అవుతున్నాయి. ఫార్ములా కేసులో ప్రాథమిక ఆధారాలతో కేసు బుక్ అయితే, దానిని ఎదుర్కొని తన తప్పులేకపోతే వాస్తవాలతో నిరూపించుకోవాల్సింది పోయి, పూటకో ప్రకటన, మాటకో సవాల్ విసురుతూ కేటీఆర్ తనకు తానే కౌంటర్లు వేసుకుంటున్నాడు. పైగా సీఎంను పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న తీరును సామాన్యజనం తప్పుపడుతున్నారు. అటు సోషల్ మీడియాలోనూ విపరీతంగా కేటీఆర్‌కు కౌంటర్లు పడుతున్నాయి. ఇక ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మరో సీనియర్ నాయకుడు హరీశ్ రావు వ్యవహరించిన తీరు కూడా అందరినీ అవాక్కయ్యేలా చేసింది.
నిరసన పేరుతో నిండు సభలో సొంత పార్టీ ఎమ్మెల్యేలనే హరీశ్ రావు తోసేసిన తీరు వీడియోల్లో చూసిన జనం ముక్కున వేలేసుకున్నారు. అరే హరీశ్ లాంటి సీనియర్ లీడర్లు కూడా ఇలా దిగజారుతారా అనే చర్చ జరిగింది. బీఆర్ఎస్‌లో సీనియర్లుగా ఉంటూ కొత్తగా ఎన్నికైన వారికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి మరింత దిగజారుతున్నారనే విమర్శలు పెరిగాయి. వీటన్నింటికి తోడు ఏడాది దాటినా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటు ఫామ్ హౌజ్, ఇటు మౌనం వీడకపోవటం బీఆర్ఎస్ నేతల కట్టు తప్పుతున్నవైనానికి పరాకాష్టగా నిలుస్తోంది. పదేళ్ల అధికారం తర్వాత మీ పాలనకో దండం అంటూ ప్రజలు బైబై బీఆర్ఎస్, సైసై కాంగ్రెస్ అంటూ ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే కేసీఆర్ మాత్రం జనం పై అలిగి రెస్ట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. దీంతో పార్టీ కాస్తా డైరెక్షన్ లెస్ అయిపోయింది.
ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా కేటీఆర్, హరీశ్, కవిత పార్టీని తలా ఓవైపు లాగుతూ గందరగోళం సృష్టిస్తున్నారు. నిజామాబాద్ టూర్‌లో కవిత కూడా బాధ్యతారాహిత్యమైన ఆరోపణలు చేశారు. పదేళ్లు లేని మతకలహాలు, గత యేడాదిలో జరిగాయంటూ వివాదాస్పదమైన విమర్శలు చేశారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అనుమానాలు సృష్టించే విధంగా మాట్లాడిన తీరు కూడా వివాదాస్పదమైంది. ఇలా బీఆర్ఎస్ నేతలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్న తీరు, నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న వైనం జనంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. జనం ప్రతిపక్షంలో కూర్చోపెడితే బాధ్యతగా మెలగాల్సిందిపోయి, బరితెగింపు ప్రదర్శిస్తున్ననేతల వైఖరిపై జనం ఛీ కొడుతున్నారు.