ఎప్పుడెప్పుడా అని ఆశావహులు ఎదురు చూస్తున్న మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఉగాది పండగ వేళ విస్తరణ దిశగా మరో ముందడుగు పడుతోంది. ఈరోజు తెలంగాణ గవర్నర్ ను జిష్ణు దేవ్ వర్మను సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడంతోపాటు మంత్రి వర్గ విస్తరణపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ తేదీని తెలియజేయడంతోపాటు లాంఛనంగా కొత్త మంత్రుల లిస్ట్ ని గవర్నర్ కి అందిస్తారని అంటున్నారు.
గవర్నర్ తో భేటీ..
రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, అనంతరం గవర్నర్ తో భేటీ అవుతారు. అయితే ఈ భేటీలో కొత్త మంత్రుల పేర్లు కూడా చర్చకు వస్తాయా, లేక కేవలం ముహూర్తం గురించి మాత్రమే చర్చిస్తారా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికయితే నలుగురు ఆశావహుల పేర్లు బలంగా వినపడుతున్నాయి. వివేక్ వెంకట స్వామి, సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వాకిటి శ్రీహరికి మంత్రి వర్గంలో ఛాన్స్ లభిస్తుందని అంటున్నారు. వీరితోపాటు మరికొందరి పేర్లు కూడా ప్రచారంలో ఉండటం గమనార్హం.
అధిష్టానం ఆశీర్వాదం ఎవరికి..?
తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణలో నలుగురికి చోటు లభిస్తుందనే విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డితో అధిష్టానం చర్చలు జరిపింది. సీఎం ఢిల్లీ పర్యటనలో దాదాపుగా లిస్ట్ కూడా ఖరారైపోయిందని అంటున్నారు. అయితే ఆ లిస్ట్ లోని పేర్లు మాత్రం ఇంకా బయటకు రాలేదు. దీంతో ఆశావహులు, వారి అనుచరులు, అభిమానులు విస్తరణ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
శాఖల్లో మార్పు..?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో కూడా మంత్రి వర్గ కూర్పు విషయంలో పెద్ద కసరత్తే జరిగింది. సీఎం, డిప్యూటీ సీఎం పోస్ట్ లతోపాటు మంత్రి పదవుల కేటాయింపులో అధిష్టానం ఆచితూచి నిర్ణయం తీసుకుంది. సీనియర్లకు అవకాశం ఇస్తూనే పార్టీకోసం పనిచేసిన వారికి పదవులు అప్పజెప్పారు. తాజా విస్తరణలో కొత్తవారికి పదవులివ్వడంతోపాటు, పాతవారి శాఖల్లో మార్పులు కూడా ఉండే అవకాశం ఉంది.
ఏప్రిల్ 3న విస్తరణ..?
మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని అంటున్నారు. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. ఈరోజు సీఎం, గవర్నర్ భేటీ తర్వాత మంత్రి వర్గ విస్తరణ తేదీపై మరింత క్లారిటీ వస్తుంది. సీఎం, గవర్నర్ భేటీ కేవలం ఉగాది సందర్భంగా లాంఛనంగా జరుగుతుందా, లేక మంత్రి వర్గ విస్తరణపై చర్చలు జరుగుతాయా అనేది కూడా వేచి చూడాలి.
తెలంగాణలో కొన్ని సామాజిక వర్గాలకు ప్రస్తుత మంత్రి వర్గంలో చోటు దక్కలేదని, వారికి విస్తరణలో అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటికే అధిష్టానానికి ప్రతిపాదనలు అందాయి. సామాజిక సర్దుబాట్లకు ఈ విస్తరణలో చోటు దక్కే అవకాశం ఉంది. అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని అంటున్నారు నేతలు. ఉన్న సీట్లు 4, ఆశావహుల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంది. మరి వీరిలో ఎవరెవరికి అదృష్టం వరిస్తుందో, ఎవర్ని అధిష్టానం బుజ్జగిస్తుందో చూడాలి.