Fake Gold in Vizag: నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి పెద్ద మొత్తంలో డబ్బును కాజేసిన ఘటన వైజాగ్‌లో చోటు చేసుకుంది. ఎకంగా బ్యాంక్ సిబ్బందే స్కాం చేయడంతో వైజాగ్‌లో ఈ ఘటన సంచలనంగా మారింది. బ్యాంక్‌లలో తాకట్టు పెట్టిన బంగారం విడిపించి కమిషన్ వ్యాపారం చేసే జగదీశ్వర్ రావు అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో నకిలీ బంగారం వ్యవహారం బయటకు వచ్చిందని ద్వారకా నగర్ పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. జగదీశ్వర్ రావు, అవినాష్ అనే ఇద్దరు స్నేహితులు కొంతకాలం క్రితం రూపిక్ బ్యాంక్‌లో 2.2 కేజీల బంగారాన్ని తాకట్టు పెట్టారు. తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇటీవల విడిపించుకునేందుకు బ్యాంక్‌కు వెళ్లారు. బ్యాంక్‌లో రూ.68 లక్షల 31 వేలు కట్టి బంగారాన్ని తిరిగి తీసుకున్నారు. అయితే ఇంటికి వెళ్లి పరిశీలిస్తే బంగారం తేడాగా అనిపించిదని జగదీశ్వర్ తెలిపారు. గోల్డ్‌ను తనిఖీ చేసి నకిలీ బంగారంగా అఫ్రైజర్ గుర్తించారు.
దీంతో జగదీశ్, అవినాశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీళ్ల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. రూపిక్ బ్యాంక్‌లో పని చేస్తున్న ఈశ్వరరావు, రాఘవేంద్రరావు, మోహన్ రావు, సుబ్బారావు నకిలీ బంగారాన్ని పెట్టినట్లుగా గుర్తించామని పోలీసులు వెల్లడించారు. మోసం చేసిన నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
విచారణ తర్వాత ఇప్పటి వరకు వీళ్లు ఎన్ని మోసాలు చేశారు. దీని వల్ల ఇంకా ఎంత మంది నష్టపోయారు అనే వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. పూర్తి దర్యాప్తు తర్వాత నిందితులు కాజేసిన నగదు, బంగారం వివరాలు వెల్లడిస్తామన్నారు.