Telangana : లేటైనా.. లేటెస్ట్‌గా.. తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగింది. ఐదుగురు అన్న చోట ముగ్గురితో సరిపెట్టారు. సామాజిక సమతుల్యంతో కేబినెట్ పోస్టులు భర్తీ చేశారు. రాజగోపాల్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్ రావులు అలకబూనినా.. కాంగ్రెస్ పెద్దలు నచ్చజెప్పడంతో కూల్ అయ్యారు. సుదర్శన్‌రెడ్డి మాత్రం ఇంకా ఫైర్ మీదే ఉన్నారు. ఆయన వర్గీయులు రాజీనామాలతో రచ్చ రాజేస్తున్నారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లారు. రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలను కలిశారు. కేబినెట్ విస్తరణ, ఆ తర్వాత జరిగిన పరిణామాలను అధిష్టానానికి వివరించారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుత మంత్రుల శాఖల మార్పులపై కూడా చర్చిస్తున్నారు. హైకమాండ్ నుంచి మంత్రులు ఉత్తమ్, భట్టిలకు పిలుపు వచ్చింది. వాళ్లు హుటాహుటినా ఢిల్లీ తరలి వెళ్లారు. ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీపైనా చర్చించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
ఎవరికి ఏ శాఖ అంటే..!
కొత్త మంత్రుల్లో వివేక్ వెంకటస్వామి కీలకమైన విద్యుత్ శాఖ కావాలని కోరుతున్నట్టు సమాచారం. వాకిటి శ్రీహరికి క్రీడ, యువజన, న్యాయ శాఖలు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. అడ్లూరి లక్ష్మణ్‌కి ఎస్సీ వెల్ఫేర్ శాఖ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు దాదాపు ఫైనల్ అయ్యాయని అంటున్నారు. అయితే, ఇప్పటికే ఉన్న పలువురు మంత్రుల శాఖల మార్పులపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది.
హోంమంత్రిగా భట్టి?
హోం శాఖ ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. లా అండ్ ఆర్డర్‌కు ప్రత్యేకంగా ఓ మంత్రి ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అందుకే, హోంశాఖను భట్టి విక్రమార్కకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. ఆర్థిక శాఖను కూడా భట్టి దగ్గరే ఉంచుతారా? మరొకరికి బదలాయిస్తారా? అనేది ఆసక్తికరం. మిగతా మంత్రుల శాఖలోనూ స్వల్ప మార్పులు జరుగుతాయని ఢిల్లీ వర్గాల సమాచారం.
సుదర్శన్‌రెడ్డి కోసం..
మరోవైపు, సుదర్శన్‌రెడ్డికి కేబినెట్‌లో చోటు కల్పించకపోవడంపై బోధన్ కాంగ్రెస్ నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే 31 మంది నాయకులు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల లోపు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేబినెట్‌లో మరో ఇద్దరికి ఛాన్స్ ఉండటంతో ఇప్పుడు పోరాడితే.. అప్పటి వరకైనా వస్తుందనే ధీమాతో తగ్గేదేలే అంటున్నారు. బీటీ నగర్‌లో వాటర్ ట్యాంక్ ఎక్కి ఓ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. స్థానిక బస్ స్టాండ్ దగ్గర బోధన్ పట్టణ కాంగ్రెస్ నేతల నిరసన నిర్వహించారు. అటు, కేబినెట్ బెర్త్‌పై ఆశలు పెట్టుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాజిటివ్‌గా స్పందించారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు వేములవాడ ఎమ్మెల్యే.
కాంగ్రెస్‌లో ఆ మార్పు మంచిదే..
గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే అలకలు, గొడవలకు కేరాఫ్‌గా ఉండేది. రేవంత్ వచ్చాక అలాంటి వాటికి చెక్ పడింది. కేబినెట్ విస్తరణలో అసంతృప్తులను బుజ్జగించిన విధానం బాగుంది. ఇలా మంత్రుల పదవీ స్వీకారం ముగిసిందో లేదో.. అలా ఇంఛార్జ్ మీనాక్షి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆశావహుల ఇంటికి వెళ్లి కలిశారు. వారికి ఈసారి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేకపోయారో వివరంగా చెప్పారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నచ్చజెప్పారు. ఆ చర్చలు ఫలించి ఎలాంటి అసంతృప్తులు లేకుండా కేబినెట్ కథ సుఖాంతం అయింది. కాంగ్రెస్‌లో ఇలాంటి మార్పు మంచిదే.