Kamal Haasan:లోకనాయకుడు కమల్ హాసన్ కు ఇప్పుడు సారీ విలువ తెలుస్తుందని చెప్పొచ్చు. తాజాగా ఆయన నటించిన థగ్ లైఫ్ భారీ నష్టాలను చవిచూస్తోంది. స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కమల్ నటించిన చిత్రం థగ్ లైఫ్. నాయకుడు లాంటి హిట్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా కావడంతో దీనిపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి సినిమా రిలీజ్ అయ్యే వరకు అభిమానులు తోపాటు ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూసారు. దానికి తోడు సినిమా మొత్తాన్ని స్టార్ క్యాస్టింగ్ తో నింపేశాడు మణిరత్నం. శింబు, త్రిష, అశోక్ సెల్వన్, జోజు జార్జ్ ఇలా స్టార్స్ అందరూ నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
ఇంకో వారం రోజుల్లో సినిమా ఉంది అనగా.. కమల్ చేసిన వ్యాఖ్యలు పరిస్థితి మొత్తాన్ని తారుమారు చేశాయి. కన్నడ తమిళం నుంచి పుట్టింది అంటూ కమల్ చేసిన ఒక్క వ్యాఖ్య థగ్ లైఫ్ ను పరాజయం పాలయ్యేలా చేసింది. భాషాభిమానం ఎక్కువ ఉన్న కన్నడిగులు.. కమల్ పై కన్నెర్ర చేయడం, సారీ చెప్పమని అడగడం.. అసలు నేనెందుకు సారీ చెప్పాలి. నా తప్పేమి లేదని కమల్ వాదించడం.. అయితే ఈ సినిమాను కర్ణాటకలో రిలీజ్ చేయమని వారు మండిపడడం.. నష్టమేమి లేదు.. ఎన్ని కోట్లు నష్టపోయినా కర్ణాటకలో రిలీజ్ చేయకపోయినా.. నేను సారీ చెప్పేది లేదని కమల్ భీష్మించుకుని కూర్చోడంతో రిలీజ్ డేట్ రానే వచ్చేసింది.
కన్నడలో రిలీజ్ కాకుండా మిగతా అన్ని భాషల్లో రిలీజ్ అయిన థగ్ లైఫ్.. ఆశలన్నీ కూల్చేసింది. కన్నడలో రిలీజ్ అయినా కూడా ఈ సినిమాకు కొద్దోగొప్పో కలక్షన్స్ వచ్చేవేమో. కానీ, అన్ని భాషల్లో వచ్చిన కలక్షన్స్ చూస్తే అసలు ఇది కమల్ – మణిరత్నం సినిమానేనా అనే డౌట్ రాకుండా పోదు. అంత దారుణంగా కలక్షన్స్ వచ్చాయి. కథలో పట్టు లేదు.. కమల్ లో ఎక్స్ ప్రెషన్స్ లేవు. శింబు ఎందుకు ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడో తెలియదు. ఇక త్రిష.. అసలు ఆమె పాత్ర గురించి చెప్పడం కూడా వేస్ట్ అని ప్రేక్షకులు పెదవి విరిచారు. కనీసం సారీ చెప్పి ఉంటే.. ఏ వివాదాన్ని ముగింపు అయినా వచ్చేది. ఆ సానుభూతి అయినా వర్ అవుట్ అయ్యేది.
గత పదేళ్లలో భారీ డిజాస్టర్స్ గా నిలిచిన ఇండియన్ 2, కంగువా కంటే తక్కువ కలక్షన్స్ ను రాబట్టింది. ఇక దీంతో చేసేదేమి లేక కమల్.. ఓటీటీలోనైనా రిలీజ్ చేయడానికి సిద్దమయ్యాడు. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసింది. 8 వారాల తరువాత ఓటీటీ రిలీజ్ కు ఒప్పందం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ ను కమల్ కాళ్ల బేరాలు ఆడి నెలలోపే రిలీజ్ చేయదానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి కూడా కమల్ ఎక్కువ మొత్తాన్నే అందుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే నెట్ ఫ్లిక్స్.. కమల్ మాటలు విని డీల్ ను క్లోజ్ చేస్తుందా.. ? లేక బయట టాక్ కూడా పరిగణలోకి తీసుకుందా..? అనేది తెలియదు. కానీ, దీనివలన నెట్ ఫ్లిక్స్ కూడా లాభపడే అవకాశాలు ఉన్నాయి. థియేటర్ లో సరిగ్గా ఆడని సినిమాలు ఓటీటీలో మంచి హిట్ టాక్ ను అందుకుంటున్నాయి. మరి ఈ మ్యాజిక్ థగ్ లైఫ్ విషయంలో జరుగుతుందో లేదో చూడాలి.