Voter Registration: స్వేచ్ఛ బ్యూరో: ఓటు హక్కు ప్రతీ పౌరుడి ప్రాథమిక హక్కు మాత్రమే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే అత్యంత శక్తివంతమైన సాధనం. అయితే ఎన్నికల సమయానికి ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యకు చెక్ పెడుతూ, ఓటర్లు తమ నమోదు వివరాలను ఇంట్లోనే ఉండి అత్యంత సులభంగా తెలుసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతిమా సింగ్ శుక్రవారం వెల్లడించారు.
ఈ ప్రక్రియ చాలా సరళంగా ఉంటుందని కలెక్టర్ వివరించారు. ఓటర్లు తమ వద్ద ఉన్న గుర్తింపు కార్డుపై ఉండే ECI నంబర్‌ను టైప్ చేసి, మొబైల్ ఫోన్ నుంచి 1950 అనే నంబర్‌కు SMS పంపితే సరిపోతుంది. వెంటనే మీ ఓటు నమోదు వివరాలన్నీ ఒక సందేశం రూపంలో మీ ఫోన్‌కు వచ్చేస్తాయి. దీనివల్ల మీ ఓటు ఎక్కడ ఉంది, వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది క్షణాల్లో తెలిసిపోతుంది.
ప్రస్తుత సర్ ప్రక్రియ ముగింపు ఆగస్టు 3వ తేదీతో పూర్తి కానుందని కలెక్టర్ గుర్తుచేశారు. మనకు కేవలం మూడు రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉన్నందున, ప్రతీ ఒక్కరూ తక్షణమే తమ వివరాలను పునఃపరిశీలించుకోవడం ఎంతో అవసరం. ఒకవేళ జాబితాలో పేరు లేకపోయినా, లేదా పేర్లు, చిరునామాల్లో ఏవైనా తప్పులు ఉండి సవరణలు చేసుకోవాలనుకున్నా వెంటనే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఎంతో అమూల్యమైనదని, ప్రతీ పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించి తమ ఓటు హక్కును నిర్ధారించుకోవాలని పిలుపునిచ్చారు.
Also Read: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై బొత్స హాట్ కామెంట్స్.. చంద్రబాబుకు నేరుగా సవాల్!