CM Revanth Reddy : కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద వైభవంగా జరుగుతున్న సరస్వతీ పుష్కరాలను సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. 10 అడుగుల సరస్వతీ ఏకశిలా విగ్రహాన్ని ఆవిష్కరించారు. మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్‌బాబు, పొంగులేటి, పొన్నం ప్రభాకరఱ్ తదితరులతో కలిసి సీఎం రేవంత్ పుష్కర స్నానం ఆచరించారు. నదికి మంగళ హారతి ఇచ్చారు. కాళేశ్వరంలోని ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. భక్తుల కోసం నిర్మించిన 86 వసతి గదులను ఆరంభించారు. మే 15 నుంచి 26 వరకు.. 12 రోజుల పాటు సరస్వతీ పుష్కరాలు ఘనంగా జరగనున్నాయి.
భక్తుల కోసం భారీ ఏర్పాట్లు..
పుష్కరాల నిర్వహణ కోసం రూ.35 కోట్లతో ఘనమైన ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. పుష్కర ఘాట్లు, మంచినీటి వసతి, రోడ్ల మరమ్మతులు, పార్కింగ్, పారిశుధ్యానికి దేవాదాయశాఖ అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఎండల తీవ్రత ఉన్నందున టెంట్లు, పందిర్లతో భక్తులకు సకల ఏర్పాట్లు చేసింది.
సరస్వతి నవరత్న మాల హారతి..
సరస్వతీ పుష్కరాలతో కాళేశ్వరం త్రివేణి సంగమ శోభ సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత తొలిసారి సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. ప్రతీరోజూ సాయంత్రం సరస్వతి ఘాట్‌లో సాయంత్రం సమయంలో.. సరస్వతి నవరత్న మాల హారతి ఉంటుంది. పుష్కరాలకు ప్రతీరోజు లక్షకు పైగా భక్తులు వస్తారని అంచనా.
మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం పర్యటనలో కాస్త గందరగోళం ఏర్పడింది. స్థానిక పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీని పుష్కరాలకు ఆహ్వానించలేదని, ఫ్లెక్సీల్లో ఫోటో పెట్టలేదని ఆయన అనుచరులు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని కంట్రోల్ చేశారు.