Nizamabad: సహాయం చేయాలంటే పెద్ద వయస్సు అవసరం లేదు, పెద్ద స్థాయి అవసరం లేదు. ఒక మంచి మనసు ఉంటే చాలు. దానికి నిదర్శనంగా నిలిచాడు నిజామాబాద్‌కు చెందిన ఓ 11 ఏళ్ల బాలుడు. పాలిసెట్ ప్రవేశ పరీక్ష సందర్భంగా ఈ చిన్నారి చేసిన పని ఇప్పుడు అందరి హృదయాలను హత్తుకుంటోంది. సహాయం చిన్నదైనా, చేసిన విధానం మాత్రం ఎంతో గొప్పగా మిగిలిపోయింది.
ఉదయం పాలిసెట్ పరీక్షల కేంద్రాల వద్ద గందరగోళం మధ్య చోటుచేసుకున్న ఓ అరుదైన దృశ్యం ఇది. నిజామాబాద్‌లోని ఉమెన్స్ డిగ్రీ కాలేజ్‌లో నిర్వహించిన పాలిసెట్ పరీక్షకు అనేక మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ ఆందోళనతో తమ హాల్ టికెట్లు, పేపర్లు, పెన్సిళ్లు చూసుకుంటూ, చివరి నిమిషంలో కంగారు పడుతూ కేంద్రానికి చేరుకుంటున్నారు. అలాంటి సమయంలో కొందరు విద్యార్థులు పెన్సిల్ మర్చిపోయిన విషయాన్ని గమనించారు.
అయితే అదే సమయంలో అక్కడే ఉన్న ఓ చిన్నారి వారి బాధను గమనించాడు. అతడు రుద్ర. వయస్సు కేవలం 11 సంవత్సరాలు మాత్రమే. కానీ ఆ వయస్సులోనే పెద్ద మనసు పెట్టాడు. తన అన్న శ్రీనివాస్ కూడా పాలిసెట్‌కు వచ్చారు. బోధన్ ప్రాంతానికి చెందిన ఈ అన్నదమ్ములు కలిసి పరీక్ష కేంద్రానికి వచ్చారు. అన్న లోపలికి వెళ్ళిన తరువాత, తమ్ముడు రుద్ర పరీక్షకేంద్రం వద్ద ఉండిపోయాడు. ఆ సమయంలో అక్కడ పెన్సిల్ మర్చిపోయిన విద్యార్థుల ఇబ్బంది గమనించిన రుద్ర వెంటనే స్పందించాడు.
తన దగ్గర ఉన్న పెన్సిల్ ఇచ్చి ఆగిపోలేదు. ఇంకా కొంతమందికి అవసరం ఉండవచ్చునని ఊహించి వెంటనే బయటకి వెళ్లి సమీప దుకాణానికి వెళ్ళాడు. అక్కడ కొన్ని పెన్సిళ్లు కొనుగోలు చేసి తిరిగి వచ్చి, అవసరమైన విద్యార్థులకు అందజేశాడు. ఒక్కొక్కరికీ పెన్సిల్ ఇస్తూ, బెస్ట్ ఆఫ్ లక్ అంటూ నవ్వుతూ పంపించాడు. ఈ చిన్న పనికి తల్లిదండ్రులు, ఇతర విద్యార్థుల కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. పలువురు అక్కడే నిలబడి రుద్రను అభినందించారు.
పరీక్షల సమయంలో చిన్న తప్పు విద్యార్థులకు మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు. అలాంటి సమయంలో ఒక చిన్నారి ఇలా స్పందించడం నిజంగా చాలా గొప్ప విషయం. ఒక చిన్న సహాయంతో ఎంతో మందికి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన రుద్రను చూసి, చాలా మంది పెద్దలు కూడా ఆశ్చర్యపోయారు. ‘ఇలాంటి మనసు పిల్లల్లో ఉండడం చూసి మంచి సమాజం ఎదుగుతుందనిపిస్తోందంటూ పలువురు అభిప్రాయపడ్డారు.
Also Read: Viral Video: బస్సులో సీటు కోసం.. పొట్టుపొట్టు కొట్టుకున్నారు.. వీడియో వైరల్
సామాన్యంగా చిన్నారులు పరీక్ష కేంద్రాల వద్ద ఉండగా ఆటలతో, మొబైల్‌ఫోన్‌లో మునిగిపోతుంటారు. కానీ రుద్ర మాత్రం అక్కడ ఉన్న పరిస్థితిని గమనించి, తన పరిధిలో ఉన్న సాయాన్ని అందించడం నిజంగా ప్రశంసనీయం. ఈ సంఘటన ఒక చిన్న సహాయం ఎంత పెద్ద గుణాన్ని చూపించగలదో మనకు గుర్తు చేస్తుంది.