Big Stories

CM Revanth Reddy: కేసీఆర్, హరీష్‌కు సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి.. ‘రుణమాఫీ చేసి నీ సంగతి తెలుస్తాం’

CM Revanth Reddy: కేసీఆర్, హరీష్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై చర్చకు రావాలంటూ కేసీఆర్ కు, రుణమాఫీ చేస్తే రాజీనామా చేయాలంటూ హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. వరంగల్ ప్రజల అండతో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, వరంగల్ ను అభివృద్ధి చేసే బాధ్యత తనదంటూ సీఎం ప్రజలకు హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతీ గ్రామానికి నీళ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు.

- Advertisement -

వరంగల్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ ప్రజల అండతో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని వెల్లడించారు. ఇండస్ట్రియల్ కారిడార్ ను నెలకొల్పి నిరుద్యోగ యువకులకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతీ గ్రామానికి నీళ్లు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదని వెల్లడించారు. వరంగల్ లో టెక్స్టైల్స్ పార్కును అభివుద్ది చేస్తామని తెలిపారు.

- Advertisement -

‘వరంగల్ లో ఎయిర్ పోర్ట్ అభివృద్ధి చేసి మహర్దశ కల్పిస్తాం.. వరంగల్ నగరాన్ని పట్టి పీడిస్తున్న చెత్త సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. నేనే స్వయంగా వచ్చి వరంగల్ లో కూర్చుని నగర సమస్యలను పరిష్కరిస్తా.. కాకతీయ యూనివర్సిటీకి కొత్త వీసీని నియమించి యూనివర్సిటీని ప్రక్షాళన చేస్తాం. ఉత్తర తెలంగాణ అంతా వరంగల్ వైపుచూసేలా నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది’ అని అంటూ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ ప్రజలకు హామీల వర్షం కురిపించారు.

‘మామా అల్లుళ్లు తోక తెగిన బల్లుల్లా ఎగిరిపడుతున్నారు. అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. నిన్న 4 గంటలు టీవీ స్టుడియోలో కూర్చున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మందేసి గీశాడో.. దిగాక గేసాడోగానీ కూలిపోయింది. కేసీఆర్ కు నేను సవాల్ విసురుతున్నా… నువు కట్టిన కాళేశ్వరం అద్భుతమైతే చర్చకు రా.. నీకు దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరంపై చర్చకు రా.

హరీష్ రావు… రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని రెడీగా ఉండు. రామప్ప శివుడి సాక్షిగా, వేయి స్తంభాల గుడి సాక్షిగా, భద్రకాళి అమ్మవారి సాక్షిగా మాట ఇస్తున్నా.. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తా.. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి నీ సంగతి తెలుస్తాం. ఆనాడు పెట్రోల్ పోసుకున్న నీకు అగ్గిపెట్టే దొరకలేదని చెప్పినట్లు కాదు’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి వారిద్దరికీ సవాల్ విసిరారు.

రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసి ఆత్మహత్యలు ఆపుతానని మోదీ హామీ ఇచ్చారని సీఎం ప్రజలకు గుర్తు చేశారు. కానీ ఆత్మహత్యలు ఆగలేదని.. రైతుల ఆదాయం కూడా పెరగలేదని వెల్లడించారు. జన్ ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానంటూ తెలంగాణ ప్రజలను మోదీ మోసం చేశారన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయకుండా ఈ ప్రాంతానికి మోదీ మోసం చేశారంటూ ఫైర్ అయ్యారు. కాజీపేటకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తరలించుకుపోయారంటూ బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

బీజేపీ నేతలకు మత పిచ్చి పట్టుకుందని విమర్శించారు. భూములు ఆక్రమించుకున్న ఆరూరి రమేష్ అంగీ మార్చి, రంగు మార్చి వస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఏ రూపంలో వచ్చినా.. ఏ వేషంలో వచ్చినా ఆరూరి రమేష్ ను ప్రజలు బండకేసి కొట్టడం మాత్రం తప్పదని జోష్యం చెప్పారు. భూములు ఆక్రమించుకునే ఆరూరి రమేష్ కావాలో.. పేదలకు వైద్యం అందించే కడియం కావ్య కావాలో తెల్చుకోవాలంటూ వరంగల్ ప్రజలకు కోరారు.

Also Read: నేను పదవికి రాజీనామా చేస్తా.. నువ్వు కూడా రెడీనా ? : సీఎంకు హరీశ్ రావు సవాల్

కడియం శ్రీహరి నిజాయితీ చూసి పార్టీలో చేర్చుకున్నామన్నారు. వరంగల్ ప్రాంతం నుంచి మరొక ఆడబిడ్డ కావ్యను ఆశీర్వదించాలంటూ సీఎం ప్రజలను కోరారు. ఆరూరి రమేష్ కు ఓటు వేస్తే.. అనకొండగా మారి ప్రజల భూములను మింగేస్తాడని ఆరోపించారు. నిజాయితీని వారసత్వంగా తీసుకుని ప్రజల కోసం పాటుపడే కావ్యను గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News