CM Revanth Reddy: మీరేమో ఫామ్ హౌస్ లు కట్టుకోవాలి, పేద ప్రజలు మురికివాడల్లో నివసించాలా.. ఇదేనా మీకు ప్రజలపై ఉన్న చిత్తశుద్ధి.. ఇప్పటికైనా మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకునే ప్రయత్నాలను ఆపండి.. అందరూ దీపావళికి చిచ్చుబుడ్లు చూస్తారు.. కానీ కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్ లో సారా బుడ్లు చూస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం మీడియా చిట్ చాట్ లో పలు అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా మూసీ నది పునరుజ్జీవంపై వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్న సీఎం, ఇటీవల మోకీలా కేసు గురించి కూడా కామెంట్స్ చేశారు.
నాదంతా రాజమౌళి స్టైల్.. ఆర్జీవీ స్టైల్ కాదు
తనదంతా రాజమౌళి స్టైల్ లో వర్క్ సాగుతుందని, రాంగోపాల్ వర్మ స్టైల్ లో వెళ్లమంటే వెళ్లే వ్యక్తిని కాదంటూ సీఎం రేవంత్ అన్నారు. మూసీ పునరుజ్జీవంపై సీఎం మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. ప్రతిరోజూ 8 గంటల పాటు మూసీ నది ప్రక్షాళనపై దృష్టి సారించి, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూసీ పునరుజ్జీవంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ఇప్పటికే 33 బృందాలతో సర్వే చేయించామన్నారు. మూసీ నిర్వాసితులకు ఉచిత విద్య అందిస్తామని,మూసీ చుట్టూ నైట్ సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే మూసీ వెంట రాత్రి 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మార్కెట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సీఎం తెలిపారు. అలాగే బాపు ఘాట్ ను అభివృద్ధి చేయడం తమ ధ్యేయమని, మొదటి దశలో కేబుల్ బ్రిడ్జి, బ్యారేజీ ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాకుండా మహాత్మా గాంధీ భారీ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే అఖిలపక్ష సమావేశం నిర్వహించి, మూసీ నది పునరుజ్జీవంపై చర్చిస్తామన్నారు.
నేనే ఏఐసీసీ..
తనకు ఏఐసీసీ పెద్దలతో విభేదాలు ఉన్నాయన్న వార్తలపై సీఎం స్పందించారు. తమకు ఎటువంటి విభేదాలు లేవని, రాష్ట్రంలో తానే ఏఐసీసీ అంటూ సీఎం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు తమకు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రజా సంక్షేమం కోసం పాటుపడడమే తన ముందున్న లక్ష్యమన్నారు. మహారాష్ట్ర ఎన్నికల అనంతరం కేబినెట్ విస్తరణ ఉంటుందని సీఎం ప్రకటించగా, రేపు మాపో ఉంటుందనుకుంటున్న కేబినెట్ విస్తరణ వార్తలకు పుల్ స్టాప్ పడింది.
దీపావళికి సారా బుడ్లు చూపించారు
సాధారణంగా దీపావళి అంటే చిచ్చుబుడ్లు మనకు కనిపిస్తుంటాయని, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్ లో మనకు సారా బుడ్లు చూపించారంటూ సీఎం రేవంత్ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. మోకీలా కేసు పై స్పందించిన సీఎం మాట్లాడుతూ.. దీపావళికి దావత్ ఇలా నిర్వహిస్తారన్న విషయం తనకు ఇప్పుడే తెలిసిందని, గతంలో దావత్ ఇలా చేయాలని తమకు ఎవరూ చెప్పలేదన్నారు. రాజ్ పాకాల ఎటువంటి తప్పు చేయని పరిస్థితుల్లో ఎందుకు పారిపోయారని, అలాగే ముందస్తు బెయిల్ కోసం ఎందుకు ప్రయత్నించారో సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ అన్నారు. అంతేకాదు కేటీఆర్ ఇంటి ప్రవేశం అంటూ చేసిన వ్యాఖ్యలపై, ఇంటి దావత్ ఇస్తే పోలీసుల దాడుల సమయంలో క్యాసినో కాయిన్స్ ఎలా దొరికాయన్నారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడే నైజం తనది కాదన్నారు.
సవాల్ విసిరిన సీఎం రేవంత్..
మూసీ నది పునరుజ్జీవంపై విమర్శలు చేస్తున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. వాడపల్లి నుండి వికారాబాద్ కు పాదయాత్ర చేసేందుకు తాను సిద్ధమని, ఈ పాదయాత్రలో కేటీఆర్, హరీష్ రావు కూడా పాల్గొనాలన్నారు. పాదయాత్ర ద్వారా వారి ముందే, స్థానిక ప్రజలను మూసీని బాగు చేయాలో వద్దో అడుగుదామంటూ.. మీరు పాదయాత్రకు సిద్ధమేనా.. నేను రెడీ అన్నారు సీఎం రేవంత్. తాను ఎప్పుడూ వ్యవస్థలను దుర్వినియోగం చేయనని, ఇప్పటికైనా విమర్శలు చేసే ముందు ఒకసారి ఆలోచించి విమర్శలు చేయాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు.