Rice Distribution In TG: తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలను వరుసగా నెరవేరుస్తున్న ప్రభుత్వం.. తాజాగా చెప్పిన గుడ్ న్యూస్, పేద ప్రజలందరికీ గొప్పవరమనే చెప్పవచ్చు.
మధ్య తరగతి, ధనిక కుటుంబాలలో కనిపించే సన్నబియ్యం ఇక పేదలకు కూడా అందనున్నాయి. సూపర్ సిక్స్ పథకాల హామీతో అధికారం చేజిక్కించుకున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, వాటిని అమలు పరచడంలో ఏమాత్రం వెనకడుగు వేసేది లేదని ఈ ప్రకటనతో మరోమారు నిరూపితమైంది.
ఇప్పటికే పేదల స్వంత ఇంటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో, ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. మళ్లీ అదే పేదలకు జనవరి నుండి రేషన్ షాపుల ద్వారా, సన్న బియ్యం సరఫరా సాగిస్తామంటూ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన జారీ చేశారు.
రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు, ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ప్రభుత్వం రూ.20వేల కోట్లతో ధాన్యం సేకరణ లక్ష్యంగా ఎంచుకోగా, ఈ సీజన్ లో 150 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నిర్ణయంతో పేద ప్రజల మద్దతు కూడగట్టుకోవాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా కనిపిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన సమయం నుండి నిరుద్యోగ సమస్యకు శుభం కార్డు వేసే ప్రయత్నాలకు సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారు. ఇటీవల ఎన్నో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం, పలు ఉద్యోగాలను కూడా భర్తీ చేసింది. అలాగే వృత్తి విద్యా కోర్సులలో రాణించే వారి కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తోంది. ఈ యూనివర్సిటీ ప్రధాన లక్ష్యం వృత్తి నైపుణ్యత పెంచి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే. అంతేకాదు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను కూడా అన్ని జిల్లాలలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్‌తో పెండ్యాల హరికృష్ణ, కిదాంబి శ్రీకాంత్ భేటీ
ఒకటి కాదు రెండు కాదు.. ఇచ్చిన, ఇవ్వని హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తూ.. తమ కోసం సన్నబియ్యం అందించేందుకు చర్యలు తీసుకోనుండగా, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సన్న బియ్యం పంపిణీపై మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేసి, మా ప్రభుత్వం.. అందరి ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వం అంటూ కొనియాడారు.