CM Revanth Reddy: దేశవ్యాప్తంగా కులగణనకు మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి రియాక్ట్ అయ్యారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. చాన్నాళ్లుగా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దీనిపై పోరాటం చేస్తున్నారని, దాని ఫలితం వచ్చిందన్నారు. ఇటీవల తెలంగాణలో చేపట్టిన కులగణన మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
గురువారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కులగణన కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో జాతీయ పార్టీలతో కలిసి ధర్నా చేశామన్నారు. చాలా పార్టీలు దీనికి మద్దతు పలికాయని గుర్తు చేశారు. ఈ ఒత్తిడి నేపథ్యంలో జనగణనలో కులగణనను చేరుస్తామని కేంద్రం ప్రకటనపై తాము స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో రాజకీయాలకు ఏ మాత్రం తావు లేకుండా కేంద్రప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు.
ఏడాదిలో పూర్తి కావాలి?
కులగణన అమలు చేసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా సమయం అత్యంత కీలకమన్నారు ముఖ్యమంత్రి. ఎప్పుడు మొదలు పెట్టి, ఎప్పటిలోగా పూర్తి చేస్తారనే తేదీలను నిర్ణయించాలన్నారు. అమలు చేసే ముందు వచ్చే సవాళ్లను, సమస్యలను ఏ విధంగా అధిగమించదలచుకున్నారో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలన్నారు. ఇదేమీ సీక్రెట్ డాక్యుమెంట్ కాదని, ప్రభుత్వ బాధ్యతన్నారు.
దేశవ్యాప్తంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు పార్లమెంటరీ వ్యవస్థలో భాగస్వామిలైన పార్టీలతో చర్చించి వారి సూచనలు తీసుకోవాలన్నారు తెలంగాణ సీఎం. ఈ విషయంలో ప్రధాని మోదీకి ఓ సూచన చేశారు. కులగణనపై మంత్రులతో కూడిన కమిటీ వేయాలన్నారు. అలాగే అధికారులతో కూడిన ఎక్స్‌ఫర్ట్ కమిటీ వేయాలన్నారు.
ALSO READ: పదో తరగతిలో టాప్.. రిజల్ట్ కంటే ముందే
స్టేక్ హోల్డర్స్, సివిల్ సొసైటీ సంఘాలతో చర్చించాలన్నారు. వారి నుంచి వచ్చిన సూచనలు, ఉత్పన్నమయ్యే ప్రశ్నలు ప్రభుత్వం వివరణ ఇవ్వడమేకాదు పారదర్శకంగా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లవచ్చన్నారు.
ప్రజల నుంచి సలహాలు, సూచనలు
కులగణన విధి విధానాలు రెడీ చేసి, వాటిని పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలన్నారు. ఎలాంటి విషయాలు సేకరించబోతున్నాం అనేది అందులో ప్రస్తావించాలన్నారు. తెలంగాణలో కులగణన చేసినప్పుడు 57 ప్రశ్నలను ప్రజల ముందు పెట్టామన్నారు. సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచామన్నారు. తాము చేపట్టిన దానిపై సభలో సుధీర్ఘ చర్చ సందర్భంగా అన్ని పార్టీలను భాగస్వామి చేశామన్నారు.
ఎక్కడా మా పార్టీ విధానంగా అమలు చేయలేదన్నారు సీఎం. తెలంగాణ మోడల్ దేశానికి రోల్ మోడల్ అని రాహుల్‌గాంధీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై కేంద్రంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మా అనుభవాన్ని కేంద్రంతో పంచుకోవడానికి ఎలాంటి బేషజాలు లేవన్నారు.
కేవలం నివేదికతో బాధ్యత పూర్తి కాలేదని, ఆ నివేదిక ద్వారా నిజమైన పేద, బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్నారు. 50 శాతం దాటి రిజర్వేషన్ల పరిధి పెంచాలని, అందులో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు.
బడుగు, బలహీన వర్గాల వారికి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో సముచితమైన స్థానం కల్పించాలన్నది రాహుల్‌గాంధీ ఆలోచనగా చెప్పారు. దీన్ని అమలు చేయడానికి ఎవరితోనైనా కలిసి పని చేయడానికి మా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. తాము ఒత్తిడి చేయడంతో ఈ వ్యవహారాన్ని కేంద్రం ముందుకు తీసుకొచ్చిందన్నారు. స్థానిక బీజేపీ నాయకులకు కొంత అసూయ, అసంతృప్తి ఉందన్నారు. రేవంత్ ప్రభుత్వ విధానాలను మోదీ సర్కార్ అనుకరిస్తున్నారంటూ దుఃఖంతో ఉన్నారన్నారు. దీనివల్ల దేశ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.