Rajanna Sircilla News: విధి.. ఎప్పుడు, ఎలా కాటేస్తుందో తెలీదు. అప్పటివరకు బాగా ఉన్నవారు ఒక్కసారిగా కుప్పకూలి చనిపోతున్న దృశ్యాలు కళ్ల ముందు కనిపిస్తూనే ఉంటాయి. ఆ చిన్నారికి ఏం కష్టం వచ్చిందో తెలీదు. పదో తరగతిలో స్కూల్ టాపర్. కాకపోతే ఆ బాలిక ఈ లోకంలో లేదు. ఫలితాలు రాకముందే మరణించింది. అదేంటి అనుకుంటున్నారా? అక్కడికి వచ్చేద్దాం.
తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఎస్సీ-2025 ఫలితాలు బుధవారం విడుదల చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.ఈ ఫలితాల్లో బాలుర కంటే బాలికలకే పైచేయి సాధించారు. ఇక బాలికల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఓ విద్యార్థి మృతి చెందింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.
ఏం జరిగింది?
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల రవి-రజిత దంపతులకు ముగ్గురు పిల్లలు. అందరూ అమ్మాయిలు. అందులో చిన్న కూతురు నాగ చైతన్య వయసు 15 ఏళ్లు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివింది, ఆపై పరీక్షలు రాసింది.బాలిక ఆలోచనలకు తగ్గట్టుగానే కష్టపడి చదివింది. ఫస్ట్ క్లాస్ మార్కులతో తప్పకుండా పాసవుతానని పేరెంట్స్‌కి చెప్పింది.
పేరెంట్స్ కన్నీరు మున్నీరు
ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది ఆ బాలిక. పరిస్థితి మరింత శృతి మించడంతో ఏప్రిల్ 17న ఆసుపత్రిలో జాయిన్ అయ్యింది. ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయింది. బుధవారం వెల్లడైన పరీక్షా ఫలితాల్లో 510 మార్కులతో స్కూల్ ఫస్ట్ క్లాస్ సాధించింది. కుమార్తె మెరుగైన ఫలితాలు సాధించింది కానీ బాలిక లేదు. ఫలితాలు చూసి యువతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తోటి విద్యార్థులు నాగచైతన్య మార్కులు చూసి షాకయ్యారు. బాగా రాసినా మాకు ఈ స్థాయి మార్కులు రాలేదని అంటున్నారు.
ALSO READ: వాతావరణంలో మార్పులు, తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు
ఈ ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 92.78 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాదితో పోల్చితే ఇదే అత్యధికం. ఈసారి 1.47 శాతం ఉత్తీర్ణత శాతం పెరిగింది. బాలికల 94.26 శాతం మంది పాసయ్యారు. బాలుర 91.32 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ స్థానంలో మహబూబాబాద్ జిల్లా నిలవగా, అట్టడుగున వికారాబాద్ జిల్లా 73.97 శాతంతో సరిపెట్టుకుంది.