రాష్ట్ర రాజకీయాల్లో సిట్ విచారణపై గందరగోళం నెలకొన్నది.మున్సిపల్ ఎన్నికలు అయిపోయే వరకు బీఆర్ఎస్ నేతలను ఇలాగే విచారణకు పిలుస్తూ కాలయాపన చేసి ఎన్నికల్లో లబ్ది పొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నదని పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఇతర పార్టీల నేతలు సైతం ఇంకెంతకాలం విచారణ పేరుతో టైంపాస్ చేస్తారని..త్వరగా ఆ కేసును ముగించి నిందితులు ఎవరో తేల్చి వారికి చట్టప్రకారం శిక్ష విధించాలని సైతం డిమాండ్ చేస్తున్నారు. ఇదిలాఉండగా, కాంగ్రెస్ మాత్రం చట్టం తనపని తాను చేసుకుని పోతుందని, ఎవరు ఏమనుకున్నా దోషులను ప్రజాకోర్టులో నిలబెడతామని చెబుతోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ అమెరికా టూర్ అనంతరం నిన్న సిట్ విచారణపై తొలిసారి స్పందించారు.
తప్పు చేసిన వాళ్లు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిస్తే తెలంగాణ జాతిపితను అవమానిస్తారా? కక్ష కడతారా? అంటున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ జాతిపిత అని కొందరు వాళ్లకు వాళ్లే రాసుకుంటున్నారని, ఉద్యమకారులమని వాళ్లే చెప్పుకుంటున్నారని విమర్శించారు. విచారణలో భాగంగా నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులు ఇస్తారా? అని అంటున్నారని, తెలంగాణ సమాజానికి అవమానం జరిగిందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆనాడు జాతిపిత గాంధీజీ పదవులను త్యాగం చేశారని, దుర్మార్గుల తూటాలకు ప్రాణాలు వదిలారని, మరి ఇప్పుడు జాతిపిత అని చెప్పుకుంటున్న వాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేసి ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా? ప్రశ్నించారు. ఆనాడు తలుపులు బద్దలు కొట్టి కోదండరాంను అరెస్టు చేసినప్పుడు ఉద్యమకారులు గుర్తుకురాలేదా? బీఆర్ఎస్ పార్టీని నిలదీశారు. పదవులు, రూ. వేలకోట్ల ఆస్తులు సంపాదించుకున్నవాళ్లు ఉద్యమకారులు ఎలా అవుతారని సీఎం ప్రశ్నించారు.ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినప్పుడు అర్థం చేసుకుని.. హుందాగా తప్పుకుంటే కొంతైనా గౌరవం నిలబడేదన్నారు. ప్రజలే తప్పు చేశారని చెప్పడం.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం, ఇదెక్కడి ఉద్యమకారుడి లక్షణం, ఇదెక్కడి జాతిపిత లక్షణం? అని పేర్కొన్నారు.
OLA Shakti 9.1kWh: ఓలా ఎలక్ట్రిక్ సంచలనం, పోర్టబుల్ పవర్ స్టోరేజ్ వచ్చేసింది!
అక్రమ మార్గం ఎంచుకున్నవారు ప్రజాస్వామ్యంలో విచారణ ఎదుర్కోవాల్సిందే అని అంబేడ్కర్ చెప్పారని, శిబు సోరెన్ లాంటి వాళ్లు విచారణ ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఇది ప్రజాస్వామ్య యుగమని, చక్రవర్తులకు కాలం చెల్లిందని గుర్తుచేశారు.ఇకమీదట కూడా విచారణలు కొనసాగుతాయని.. తప్పు చేశారని అనుమానం వస్తే పోలీసులు విచారణకు పిలుస్తారని.. అక్కడ హోదాలు, గత చరిత్రలను పరిగణలోకి తీసుకోవడం వంటివి ఉండవని సీఎం అన్నారు. కాగా, రెండ్రోజుల కిందట మాజీ సీఎం కేసీఆర్‌ను ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావులు రాష్ట్ర ప్రభుత్వం మీద చేస్తున్న తీవ్ర విమర్శలకు సీఎం రేవంత్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అయితే, రేవంత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ శ్రేణులు సమర్థిస్తుండగా.. బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.