Big Stories

CM Revanth Reddy : సీఎం రేవంత్‌రెడ్డి మార్క్ పాలన.. విప్లవాత్మక మార్పులకు శ్రీకారం..

CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రెండు రోజుల్లోనే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వానికి భిన్నంగా ప్రజా సమస్యలు వింటూ, వాటిని పరిష్కరిస్తూ.. ప్రజా క్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారు.

- Advertisement -

మాట ఇచ్చామంటే.. మడమ తిప్పం అనే విధంగా తన విధానాలు కొనసాగిస్తున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే తొలి ఆరు గ్యారెంటీలపై సంతకంపెట్టారు. అదే వేదికపై నిరుద్యోగ దివ్యాంగురాలైన రజినీకి ఉద్యోగం ఇస్తూ నియామక పత్రాన్ని అందించారు.

- Advertisement -

ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రగ‌తి భ‌వ‌న్‌ను ప్ర‌జాభ‌వ‌న్‌గా మార్చేశారు రేవంత్ రెడ్డి. ప్ర‌జల‌కు ప్ర‌వేశం కల్పించి.. వారి స‌మ‌స్య‌లు వినేందుకు ప్ర‌జాద‌ర్బార్ కూడా నిర్వ‌హించారు. ఇది తెలంగాణ స‌మాజంలో మంచి పేరు తెచ్చింది. రాష్ట్రం నలుమూలల నుంచి జనం హాజరై సీఎంకు తమ సమస్యలు చెప్పుకున్నారు. వారికి తగిన విధంగా ఆదుకుంటామని రేవంత్‌ భరోసా ఇచ్చారు. ఇక‌, అదే రోజు రాత్రికి ఉద్య‌మ కాలం నాటి కేసుల‌ను ఎత్తేస్తున్నామ‌న్న సంకేతాలు ఇచ్చారు. ఈ క్ర‌మంలో తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఎవ‌రెవ‌రిపై కేసులు న‌మోద‌య్యాయో వివ‌రాలు సేక‌రిస్తున్నారు.

తొలి కేబినెట్‌ సమావేశంలోనే విద్యుత్ శాఖ అధికారులపై చాలా సీరియస్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టడంపై మండిపడ్డారు. విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించొద్దని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాతి రోజే విద్యుత్‌ రంగంపై సమీక్ష నిర్వహించి…రాష్ట్రంలో విద్యుత్‌ సంస్థల స్థితిగతులు, డిమాండ్‌, కొనుగోళ్లు, బకాయిలు వంటి అంశాలపై అధికారులతో చర్చించారు.

ఇటు పరిపాలనలో తనదైన శైలిని చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు రేవంత్‌ రెడ్డి. ఇప్పటికే తన కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రిని, తెలంగాణ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డిని నియమించారు. భవిష్యత్తులో మరికొన్ని నియామకాలు చేపట్టడంద్వారా తన టీంను సిద్ధం చేసుకుంటున్నారు. అనుభవజ్ఞులైన అధికారులకు ప్రభుత్వంలో పెద్దపీట వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఎవరినైతే లూప్ లైన్‌లో ఉంచిందో వారికి పెద్దపీట వేసే అవకాశం కనపడుతోంది.

మరోవైపు తెలంగాణలో గత ప్రభుత్వం నియమించిన సలహాదారులకు ఉద్వాసన పలికారు. వారి నియామకాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈమేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఏడుగురిని తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పదవులు కోల్పోయిన వారిలో.. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ , మాజీ సీఎస్‌లు సోమేష్ కుమార్, రాజీవ్‌శర్మ, మాజీ డీజీపీ అనురాగ్ శర్మ, మాజీ సీపీ ఏకే ఖాన్, శోభ, జి.ఆర్.రెడ్డి ఉన్నారు. వీరిలో వ్యవసాయ శాఖకు చీఫ్ అడ్వైజర్‌గా చెన్నమనేని రమేష్ పనిచేస్తున్నారు. వేములవాడ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనకు.. మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. ఆయన ప్లేస్‌లో మరొకరిని ఎన్నికల బరిలో నిలిపి.. చెన్నమనేని రమేష్‌కు వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారుగా నియమించారు. ఐదేళ్ల పదవీకాలం ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆయన పదవికి శుభంకార్డు పడింది.

ఇటు సోనియాగాంధీ బర్త్‌ డే రోజునే ఆరు గ్యారంటీల్లో రెండింటిని అమల్లోకి తెచ్చారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అనంతరం అసెంబ్లీ ఆవరణలో తొలుత రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షలకు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. అనంతరం అక్కడే.. జీరో టికెట్లను ఆవిష్కరించి మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు.

మంత్రులు సీతక్క, కొండా సురేఖ జెండా ఊపి మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారు. ఆడబిడ్డలతో పాటు మహిళా మంత్రులు, శాసనసభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి బస్సులో ప్రయాణించారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకూ వెళ్లి అక్కడ నివాళులు అర్పించారు. ఇలా అధికారంలోకి వచ్చిన రెండు,మూడు రోజుల్లోనే తన మార్క్ పరిపాలనతో దూసుకుపోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆయన పేరే మారుమ్రోగుతోంది. తెలంగాణ పొలిటికల్ బ్రాండ్ అంబాడిసిడర్ గా మారిపోయారు సీఎం రేవంత్ రెడ్డి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News