Big Stories

CM Revanth Reddy : ఫోకస్ ఆన్ హైవేస్.. భూసేకరణపై సీఎం దిశానిర్దేశం

  • రైతులకు న్యాయం చేసేలా చర్యలు
  • కలెక్టర్లే నేరుగా మాట్లాడాలి
  • అన్నదాతలకు గరిష్ట పరిహారం అందించాలి
  • రైతుల పట్ల మానవీయ కోణంలో నిర్ణయాలు
  • రీజినల్ రింగ్‌ రోడ్డుకు ఒకే నెంబర్
  • శాఖల సమన్వయం కీలకం
  • హైవేల నిర్మాణంపై సమీక్షలో సీఎం రేవంత్

CM Revanth Reddy Focus on Highways(Telangana today news): తెలంగాణలో నిర్మితమవుతున్న రహదారుల నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న హైవేల పురోగతిని జాతీయ రహదారుల సంస్థ అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైవేల నిర్మాణం జరుగుతున్న జిల్లాల కలెక్టర్లు, అటవీ, విద్యుత్, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, రోడ్ల నిర్మాణంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని, ఈ విషయంలో జాతీయ రహదారుల సంస్థ అధికారులతో అందరూ సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. పలువురు మంత్రులు, పలు జిల్లాల కలెక్టర్లు ఉన్నతాధికారులు, ఎన్‌హెచ్ఏఐ ప్రతినిధులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

- Advertisement -
రైతులను ఒప్పించే పనులు..

రహదారుల నిర్మాణం కోసం జరిపే భూసేకరణ కార్యక్రమం పారదర్శకంగా జరగాలని, కలెక్టర్లు నేరుగా దీనిపై రైతులతో మాట్లాడాలని సీఎం అధికారులకు సూచించారు. రైతులకు గరిష్ట పరిహారం అందేలా చూడాలని, ఈ విషయంలో అధికారులు మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రీజినల రింగ్ రోడ్లు అలైన్‌మెంట్ విషయంలో అపోహల కారణంగా కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారనీ, దానిపై హైకోర్టు ఇచ్చిందని యాదాద్రి జిల్లా కలెక్టర్ చెప్పగా, శుక్రవారం నాటికి స్టే తొలగింపుకు కౌంటర్ దాఖలు చేయాలని సూచించారు.

- Advertisement -
నాగపూర్ – విజయవాడపై..

నాగపూర్ – విజయవాడ కారిడార్‌లో ఖమ్మం జిల్లాలో భూ సేకరణ పరిస్థితి గురించి ముఖ్యమంత్రి ఆరా తీయగా, ఆ రోడ్ ఖమ్మం సమీపంలోని విలువైన భూముల గుండా పోతుందని, పరిహారం విషయంలో రైతులను ఒప్పిస్తున్నామని ఖమ్మం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ హైవే నిర్మాణ మార్గంలో పెద్ద గ్రామాల వద్ద రైతులు పొలాలకు వెళ్లేందుకు అండర్ పాస్‌లు ఉండేలా చూడాలని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. అలాగే హైవేకి రెండువైపులా గ్రావెల్ రోడ్లు నిర్మిస్తే.. భవిష్యత్‌లో రహదారి విస్తరణ సులభమవుతుందనే సీఎం సూచననూ తాము పరిశీలిస్తామని ఎన్‌హెచ్ఏఐ సభ్యుడు అనిల్ చౌదరి హామీ ఇచ్చారు. తల్లాడ – దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తున్నందున, ఖమ్మం – అశ్వారావుపేట హైవేను రాష్ట్ర రహదారిగా మార్చుకోవాలని ఎన్‌హెచ్ఏఐ అధికారులు సూచిస్తున్నారని, దానికి అంగీకరించవద్దని మంత్రి తుమ్మల.. సీఎంకు సూచించారు.

రీజినల్ రింగ్ రోడ్‌పై..

రీజినల్ రింగు రోడ్డు దక్షిణ, ఉత్తర భాగాలకు ఒకే నంబరు కేటాయించాలని తాను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరగా, ఆయన సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారని, ఆ ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాగా.. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్‌హెచ్ఏఐ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పగా, వెంటనే ఆ ప్రక్రియ మొదలు పెట్టాలని సీఎం ఆదేశించారు.

అటవీ భూములపై..

ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల, విజయవాడ – నాగపూర్ కారిడార్ హైవే నిర్మాణానికి భూసేకరణ సమస్యగా ఉందని కలెక్టర్లు చెప్పగా, ప్రభుత్వ భూములు.. అటవీ శాఖకు శాఖకు బదిలీ చేసి, ఆపై అటవీ శాఖ భూములను హైవేల నిర్మాణానికి బదలాయించాలని సీఎం సూచించారు. ఈ విషయంలో నిజామాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లతో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ – విజయవాడ ఆరు వరుసల హైవే పనులు పూర్తయినందున, వెంటనే పనులు ప్రారంభించాలని రహదారుల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎన్‌హెచ్ఏఐ ప్రతినిధులను కోరగా.. 2 నెలల్లోనే పనులు ప్రారంభిస్తామని వారు బదులిచ్చారు.

సమన్వయమే కీలకం

హైవేల నిర్మాణంలో జాతీయ రహదారుల సంస్థ ప్రతినిధులు, ఏపీ ప్రభుత్వంతో బాటు ఆయా జిల్లాల రెవెన్యూ, విద్యుత్, పోలీసు యంత్రాంగాలు సమన్వయంతో పనిచేయాలని అప్పుడే వీలున్నంత త్వరగా పనులు పూర్తవుతాయని సీఎం సూచించారు. ఖమ్మం – దేవరపల్లి, ఖమ్మం – కోదాడ రహదారుల నిర్మాణ పనుల వద్ద పోలీస్ భద్రత పనులు చూడాలని సంబంధిత ఎస్పీలకు సీఎం సూచించారు. తెలంగాణ తలపెట్టిన డ్రై పోర్ట్‌ను బందరు పోర్టుతో లింక్ చేసే హై స్పీడ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం గురించి కూడా అధికారులతో చర్చించారు. హైదరాబాద్ – మన్నెగూడ, హైదరాబాద్ -కల్వకుర్తి జాతీయ రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని, ఈ నెలాఖారు నాటికి మొత్తం రహదారుల పూర్తి వివరాలు, ప్రపోజల్స్‌ను అధికారులు సమర్పించేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News