Revanth Reddy: ముంబయిలో నిర్వహించిన ‘క్లైమేట్ వీక్’ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గ్రీన్ ఎనర్జీ వినియోగంతోనే ప్రపంచ పరిరక్షణ సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని ప్రకటించారు. ఈ క్రమంలో పర్యావరణ హితమైన అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రాన్ని క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) అనే మూడు వ్యూహాత్మక జోన్లుగా విభజించినట్లు వెల్లడించారు.
హైదరాబాద్ నగరాన్ని 2034 నాటికి నెట్ జీరో నగరంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ పరిధిని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE)గా ప్రకటించి ఈ ప్రాంతంలో కార్బన్ ఫుట్‌ప్రింట్ ఆడిట్ చేపట్టనున్నట్లు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ఈ కోర్ అర్బన్ రీజియన్‌లో పరిశ్రమలు ఉండవని వాటిని పెరి అర్బన్ జోన్‌లకు తరలిస్తామని చెప్పారు. పట్టణాభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని పెంచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి ఈ సందర్బంగా వివరించారు. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిలో 25 శాతం గ్రీన్ సోర్సుల నుంచే వస్తోందని, తెలంగాణలో ఉన్న 30 లక్షల పంప్‌సెట్లు దాదాపు 50 లక్షల గృహాలకు బొగ్గు ఆధారిత విద్యుత్ బదులు సోలార్ గ్రీన్ ఎనర్జీని అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ (ORR), 360 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్ (RRR) మధ్య ప్రాంతాన్ని ప్యూర్ (PURE) జోన్‌గా రూపొందించి దీనిని దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా మారుస్తామని వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీ ఆధారిత తయారీ రంగంతో చైనా +1 వ్యూహానికి తెలంగాణను ప్రత్యామ్నాయంగా నిలబెడతామని స్పష్టం చేశారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని, ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నులు తొలగించడంతో హైదరాబాద్‌లో ఈవీల వాడకం గణనీయంగా పెరిగిందన్నారు. 3,500 కంటే ఎక్కువ ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తుండగా 2 లక్షల ఆటోరిక్షాలను రీట్రోఫిట్ చేస్తున్నట్లు వివరించారు. మెట్రో రైలు వ్యవస్థను 200 కిలోమీటర్ల మేర విస్తరించనున్నట్లు చెప్పారు. మూసీ నది పునరుద్ధరణతో పాటు చెరువుల సంరక్షణ కోసం హైడ్రా (HYDRAA) పేరిట ప్రత్యేక పోలీసు దళాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ప్రస్తుత పరిస్థితిని ముఖ్యమంత్రి ‘క్లైమేట్ ఎమర్జెన్సీ’గా అభివర్ణించారు. అభివృద్ధి పెట్టుబడులతో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఆకాంక్షించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నుంచి పట్టణ మౌలిక సదుపాయాల వరకు ప్రతి రంగంలోనూ సుస్థిర పద్ధతులను అవలంబిస్తామని భరోసా ఇచ్చారు.
Read Also: తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయమే లేదు.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకే మా ప్రాధాన్యత..