Mahesh Kumar Goud: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయమే లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో ఎంత బలంగా ఉందో నిరూపించాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 94 మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ప్రజలకు ఉన్న సానుకూలతకు నిదర్శనమని స్పష్టం చేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 87.5 శాతం టికెట్లను ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకే కేటాయించిందని తెలిపారు. ఫలితంగా 67 శాతం బీసీ వార్డు మెంబర్లు ఘన విజయం సాధించారని వివరించారు. నిజామాబాద్ కొత్తగూడెం వంటి ప్రాంతాల్లో సాధారణ కార్యకర్తలకు కూడా పదవులు దక్కడం ద్వారా పార్టీలో కష్టపడే వారికి లభించే గుర్తింపు మరోసారి రుజువైందని ఆయన పేర్కొన్నారు.
మంత్రివర్గ విస్తరణ లేదా మార్పుల విషయంలో పీసీసీ జోక్యం ఉండదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తిగా సర్వేలు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్ల అభిప్రాయాల ఆధారంగానే జరిగిందని సీనియర్ నేత జీవన్ రెడ్డి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. నిజామాబాద్‌లో ఐదు సీట్లలో ఎంఐఎం అభ్యర్థులపై విజయం సాధించామని అతి తక్కువ ఓట్ల తేడాతో ఆరు సీట్లు కోల్పోయామని చెప్పారు. ఓటమి చెందిన ప్రాంతాలపై ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మొసలి కన్నీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఏఐసీసీ ఆధ్వర్యంలో రేపు అన్ని రాష్ట్రాల పార్టీ పరిస్థితిపై కీలక సమీక్ష జరగనుందని తెలిపారు. ఇప్పటికే 11 రాష్ట్రాలపై సమీక్ష పూర్తయిందని పార్టీ నిర్మాణం సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేందుకు వికారాబాద్‌లోని హరిత రిసార్ట్‌లో ఈ నెల 21 నుంచి పది రోజుల పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డీసీసీ అధ్యక్షులకు ప్రత్యేక ట్రైనింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. మేయర్ పదవి దక్కితే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో కార్పొరేటర్లు సానుకూల నిర్ణయాలు తీసుకున్నారని ఆయన వివరించారు.