Telangana Congress: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది. రెండువారాల్లో నోటిఫికేషన్ వస్తుందన్న వార్తలు హంగామా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వేగంగా అడుగులు వేస్తోంది. గురువారం ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని పార్టీ నిర్ణయించింది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ కూడా హాజరుకానున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసింది అధికార కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ నేతలు భావించిన మాదిరిగానే ముందుగా కులగణన రిపోర్టును అసెంబ్లీ పెట్టి చర్చించింది ప్రభుత్వం. రాజ్యాంగం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని కేంద్రం ఆమోద ముద్ర వేయాలి. లేకుంటే పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో కేటాయిస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌రెడ్డి, ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశం కానున్నారు. ఎమ్మల్యేలను జిల్లాల వారీగా నాలుగు గ్రూపులుగా విభజించనున్నారు. ఆ తర్వాత వారితో సమావేశం కానున్నారు. వీలైతే ఒక్కొక్కరితో ఇండివిడ్యువల్‌గా మాట్లాడే అవకాశమున్నట్లు గాంధీ భవన్ వర్గాల మాట.
తొలుత జిల్లాలు, నియోజకవర్గాల వారీగావున్న సమస్యలపై తొలుత చర్చించనున్నారు. ఎమ్మెల్యేల సమస్యలను తెలుసుకోనున్నారు. ఇదిలావుండగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది ఎమ్మెల్యేలు దానం ఇంట్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దానిపై కూడా చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వీలైతే బుధవారం లేదంటే గురువారం దీపాదాస్ మున్షీ హైదరాబాద్‌కు రానున్నట్లు పార్టీ వర్గాల మాట.
ALSO READ: దానం నాగేందర్ ఇంట్లో ఆ MLAలు భేటీ.. తెలంగాణలో అసలేం జరుగుతుంది..?
ఎమ్మెల్యేలతో సమావేశం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ రావచ్చని అంటున్నారు కొందరు నేతలు. అదే జరిగితే రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలపై నగారా మోగడం ఖాయమని అంటున్నారు. ఇవేకాకుండా పార్టీ పరంగా ఉన్న అంశాలను సైతం చర్చించనున్నట్లు అంతర్గత సమాచారం.