మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద సీబీఐ విచారణ జరిపిస్తామని గతంలో ప్రకటించిన బీజేపీ.. ఇంతవరకూ ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో కర్త, కర్మ, క్రియ అంతా కేసీఆర్ అని పలుమార్లు ఆరోపించింది. ఎన్నికల ముందు సైతం ప్రచారంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టును కల్వకుంట్ల ఫ్యామిలీ ఏటీఎంలా వాడుకున్నదని ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలుమార్లు ఆరోపించారు.కానీ,కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉన్నప్పటికీ.. కేసీఆర్ కుటుంబం మీద ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలను కమలం పార్టీ నేతలు బయటకు వెల్లడించడం లేదు. దీనిపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపిస్తున్నారు.
గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య సైలెంట్ పొత్తు పొడిచిందని ప్రచారం జరిగింది.ఎందుకంటే ఉత్తరాన బీజేపీ బలంగా ఉన్న చోట్ల బీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని టాక్ నడిచింది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం తమ అభ్యర్థులు ఓడిపోతారని ముందే గ్రహించిన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులు గెలవకుండా.. బీఆర్ఎస్ కేడర్ అంతా గుట్టుగా బీజేపీకి ఓట్లు వేసినట్టు తెలిసింది. ఫలితంగా బీజేపీ 8 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది.పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు జోరో స్థానాలు వచ్చాయి. అయితే, రెండోసారి కేంద్రమంత్రి అయ్యాక కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు మీద సీబీఐ విచారణకు సిద్ధమని పలుమార్లు ప్రకటించారు.
గత వింటర్ అసెంబ్లీ సెషన్స్‌లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటనపై స్పందించారు. సీబీఐ, ఈడీ వంటి సంస్థలు కేంద్రం పరిధిలోనే ఉన్నాయని.. విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరాల్సిన అవసరం ఏముందని కుండబద్దలు కొట్టారు. అందుకు ప్రతిగా గతంలో కేసీఆర్ సీబీఐకి రాష్ట్రంలో అనుమతి నిరాకరించారని కేంద్రమంత్రి గుర్తుచేయగా.. కాళేశ్వరం మీద సీబీఐ విచారణ జరిపించాలని తాను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరుతున్నట్టు రేవంత్ డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆరు నెలలు గడిచినా కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ ఎంక్వయిరీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేటివరకు స్పందించ లేదు. కానీ, నిన్న లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. గత కేసీఆర్ సర్కార్ కాళేశ్వరం పేరిట రూ.లక్ష కోట్లు వృథా చేసిందని ప్రసంగించారు.
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. ఈ నెల 13న బీఆర్ఎస్‌లో చేరనున్న జీవన్ రెడ్డి
ఇంకా ఎంతకాలం కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వం మీద నెపం నెడుతుందని కాంగ్రెస్ శ్రేణులు విమర్శిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ సైతం తప్పు కేసీఆర్‌దే అని తేల్చినప్పుడు సీబీఐ విచారణకు ఆదేశించడానికి ఆలస్యం ఎందుకు? అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఆలస్యం అయ్యిందని గుర్తుచేస్తున్నారు.కేసీఆర్, ఆయన కుటుంబాన్ని కాపాడాలనే ఉద్దేశం కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేకపోతే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని హస్తం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆలస్యం చేయడం వెనుక ఉన్న కారణాలను వెల్లడించాలని కోరుతున్నారు.
కనీసం కేసీఆర్ మీద సీబీఐ విచారణ ఉంటుందా? ఉండదా? అదైనా చెప్పాలని డిమాండ్ చేశారు.