మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టు ఫలితాలు వచ్చాయి. అంచనాలకు మించి పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిందని పార్టీలో చర్చ జరుగుతున్నది. ఎన్నికల పోరులో కాంగ్రెస్ పార్టీ అత్యధిక చైర్మన్,మేయర్ పీఠాలను కైవసం చేసుకున్నది. 86 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్‌లు కలుపుకుని పురపోరులో మొత్తం 92 స్థానాలను దక్కించుకుంది. ఇక బీఆర్ఎస్ 17, బీజేపీ 3 స్థానాల్లో విజయం సాధించాయి. 11 మున్సిపాలిటీలకు కోరం లేక ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటడంతో ఆ పార్టీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. సంబురాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా చోట్ల మున్సిపల్, కార్పొరేషన్లలో పాలకవర్గాలు కొలువుదీరాయి.
మున్సిపల్ పోరు ముగియడంతో త్వరలోనే రాష్ట్రంలో మరో ఎన్నికల జరగనున్నట్టు సమాచారం. దీనిపై అధికార పార్టీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈనెలాఖరు లేదా మార్చి తొలివారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు లేదా జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీ చూస్తున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువాడాల్సి ఉన్నది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక ఆలస్యం అయితే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయే అవకాశం ఉన్నది. అందుకే మార్చి 10లోపు ఈ ఎన్నికను పూర్తి చేయాలని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. మున్సిపల్ విజయంతో మరో ఎన్నిక కోసం పార్టీ నేతలు, కేడర్ సైతం ఆత్రుతతో ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది.
సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఇదే జోష్‌ను గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ చూపించాలని ఆ పార్టీ భావిస్తున్నది. ఇప్పటికే కేడర్‌కు సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు పార్టీ పట్ల, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై సానుకూలంగా ఉన్నట్టు ప్రభుత్వం భావిస్తోంది. మున్సిపల్ ఫలితాలను అందుకు ఉదాహరణగా చూపిస్తోంది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు సైతం నిర్వహించి ఇదే ఊపుతో గ్రేటర్ కార్పొరేషన్ మీద జెండా ఎగురవేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్‌లో పెద్దగా పట్టులేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో గ్రేటర్ పరిసర ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలే విజయం సాధించారు. అందుకే ఈసారి గ్రేటర్ లో పట్టుపెంచుకోవాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే, ఏ ఎన్నిక ముందు ఉంటుందని అనేదానిపై సర్కారు క్లారిటీ ఇవ్వాల్సి ఉన్నది.
గత పదేండ్లు అధికార కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉన్నది. ఈ సారి పవర్ రావడంతో పదేండ్లుగా పార్టీలో కొనసాగిన వారంతా ఈసారి ఎలాగైనా పదవి దక్కించుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో అవకాశం దక్కని వారికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. అందుకే వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించి పదవులు భర్తీ చేస్తే.. ఇంకా ఎవరికైనా పదవులు రాకపోతే నామినేటెడ్ పోస్టుల రూపంలో వారికి చాన్స్ ఇవ్వాలని పార్టీ ఆలోచన చేసినట్టు సమాచారం.ఆలస్యం అయితే మరల ప్రతిపక్షాలు సర్కారుపై చెడు ప్రచారం చేసే అవకాశం ఉన్నది. అందుకే ఇదే విజయపరంపరను మున్ముందు కొనసాగించేందుకు ఆలస్యం చేయొద్దని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయాలనికి వచ్చినట్టు తెలుస్తోంది.