BigTV English

Congress Party: అతి చేస్తున్న ఆ బ్యాచ్.. సీఎం పేరు చెప్పి బిల్డప్!

Congress Party: అతి చేస్తున్న ఆ బ్యాచ్.. సీఎం పేరు చెప్పి బిల్డప్!

హైదరాబాద్, స్వేచ్ఛ: పదేళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నల్లేరు మీద నడకలా పాలన చేసుకుంటూ పోతోంది. విపక్ష పార్టీల నుంచి వస్తున్న విమర్శలను అటు సీఎం, ఇటు పీసీసీ చీఫ్ గట్టిగానే కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తూ, వాస్తవిక తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా పాలనా పరమైన నిర్ణయాలు తీసుకుంటూ ముఖ్యమంత్రి పాలనను సాగిస్తున్నారు. అయితే, ఈ క్రమంలో కొందరు సొంత పార్టీ నేతల అత్యుత్సాహం ముఖ్యమంత్రి ఇమేజ్‌ను దెబ్బ తీసుకొస్తోంది. టీడీపీలో ఉన్నకాలంలో రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసి, కాంగ్రెస్‌లో చేరిన కొందరు సీనియర్ నేతలు అధికారుల సమక్షంలో, ప్రజలలోనూ సీఎం విషయంలో చూపుతున్న అతి చనువు, అత్యుత్సాహం.. గీత దాటటంతో క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి ప్రతిష్ట పలుచబడుతోందనే వాదన వినిపిస్తోంది.


Also Read: కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ పై దాడి.. పోలీస్ అలర్ట్..

ఎవరా నేతలు?


గతంలో టీడీపీలో రేవంత్ రెడ్డికి సమకాలీన నేతలుగా ఉంటూ, తర్వాతి రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేలుగా, నియోజక వర్గాల ఇన్‌ఛార్జ్‌లుగా, నామినేటెడ్ పోస్టులలో స్థిరపడిన అర డజను సీనియర్ నేతల వ్యవహార శైలి ప్రస్తుతం పార్టీ అంతర్గత శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్‌కు కొన్ని పరిమితులున్నప్పటికీ, నాడు రేవంత్ రెడ్డి పరపతి కారణంగా వీరందరికీ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం దక్కింది. అంతేకాదు.. తర్వాతి రోజుల్లో ఎమ్మెల్యే టికెట్లు కూడా సాధించుకుని రేవంత్ చరిష్మాతో గెలిచి చట్ట సభ ప్రతినిధులుగా, పార్టీ ప్రముఖులుగా కీలక స్థానాలలో నిలదొక్కుకున్నారు. అయితే, తమకు రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యాన్ని బహిరంగంగా ప్రదర్శించే క్రమంలో అది పార్టీకి, వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టకు ఇబ్బందిగా మారుతోంది.

ఇదీ సమస్య..

సాధారణంగా ప్రజా ప్రతినిధుల వద్దకు అనేక సమస్యలతో ప్రజలు, కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు రోజూ వస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఈ నేతలు ఆయా శాఖల అధికారులకు ఫోన్లలో ఆదేశాలిస్తూ.. ‘నేను రేవంత్‌ని కలిశా’, ‘నేను రేవంత్‌తో మాట్లాడి చెప్తా’ ‘నేను చెబుతే రేవంత్ కాదనడు’, ‘రేవంత్ చెప్పినా చేయరా?’ అంటూ ఏకవచనంలో మాట్లాడటంపై క్షేత్రస్థాయి కార్యకర్తలకు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక, జిల్లా స్థాయిలో సమీక్షా కార్యక్రమాల్లో పదుల సంఖ్యలో సీనియర్ అధికారుల సమక్షంలోనూ ఇదే రీతిలో మాట్లాడటంపై సదరు అధికార యంత్రాంగంలోనూ ముఖ్యమంత్రి పట్ల ఒక చులకన భావం ఏర్పడుతోందని కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అటు, ఆది నుంచి కాంగ్రెస్‌లో పనిచేస్తూ, ఆయా నియోజక వర్గాల్లో తాము తప్పుకుని, తర్వాత వచ్చిన వలస నేతలను స్వాగతించిన నేతలకు ఇది మరీ విచిత్రంగా, ఆశ్చర్యంగా ఉంటోంది. ఈ విషయాన్ని వారు పాత సీనియర్ నేతలతో చెప్పి వాపోయినట్లు సమాచారం.

Also Read: హైడ్రాకు కేటీఆర్ కౌంటర్.. ఇంత పెద్ద లాజిక్ ఎలా మిస్సయ్యారో..

కనీస మర్యాద పాటించరా?

ఒక వ్యక్తిగా రేవంత్ రెడ్డితో సదరు నేతలకు ఉన్న సాన్నిహిత్యం, చనువు, చొరవను ఎవరూ కాదనరు. కానీ, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాజ్యాంగ బద్ధమైన పదవిలో అందునా.. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా ఆ పదవిని గౌరవించి తీరాల్సిందే అనేది ప్రజాస్వామ్యంలో ఒక మౌలిక సూత్రంగా ఉంది. ఈ ప్రాథమిక అంశాన్ని గుర్తించకుండా, గౌరవించకుండా బాధ్యతగల ప్రజా ప్రతినిధులు, నేతలు సీనియారిటీ పేరుతో లేదా తమకు గతంలో ముఖ్యమంత్రితో ఉన్న సాన్నిహిత్యంతోనో బహిరంగంగా చూపిస్తున్న ఈ అతి ఉత్సాహం పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. పైగా, సీఎంగా ఉన్న వ్యక్తితో గతంలో వీరు అదే స్థాయిగల పార్టీలో పనిచేసినంత మాత్రాన, ఇక్కడా తాము అదే స్థాయి నేతలమనే ధోరణిని ప్రదర్శించటం మూలంగా క్షేత్రస్థాయి కాంగ్రెస్ కార్యకర్తలకు, స్థానిక అధికారులకు తప్పుడు సందేశం పంపినట్లే అవుతోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రే స్వయంగా చొరవ తీసుకుని ఈ ధోరణికి అడ్డుకట్ట వేయాలని కేడర్ కోరుతోంది.

పొరుగు ఉదాహరణే సాక్ష్యం..

గత ఐదేళ్ల కాలంలో ఏపీలో వైసీపీ హయాంలో అధినేత విషయంలో అనేక మంది నేతలు ఇలాగే క్షేత్రస్థాయిలో తమదైన శైలిలో చెలరేగిపోయారు. ఆదిలోనే అక్కడి నాయకత్వం దీనిని అడ్డుకట్ట వేయకపోవటంతో వారి నోటి దురుసు అంతిమంగా పార్టీ పుట్టిముంచిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లో ఒక పరిమితికి మించిన చనువు.. చులకనకు దారితీస్తుందని, అది సదరు నాయకుడి విలువను తగ్గించటమే గాక అతడికి ఆ చనువిచ్చిన అధినేతకూ అప్రతిష్ఠ తెచ్చిపెడుతుందని, దీనిని అలాగే కొనసాగిస్తే.. కొన్నాళ్లకు ఆ నేతలే పార్టీకి గుదిబండలుగా మారతారని కాంగ్రెస్ కార్యకర్తలు వాపోతున్నారు. కనుక ఇకనైనా, ఆ పరిమితిని సదరు నేతలు గుర్తెరిగితే అది పార్టీకి, వ్యక్తులుగా వారికి, వారు అభిమానించే ముఖ్యమంత్రికి కూడా మంచిది. లేకపోతే తిప్పలు తప్పవని వారు చెబుతున్నారు. కనుక, ఈ విషయంలో ఇకనైనా ఈ నేతల వ్యవహార శైలికి చెక్ పెట్టేందుకు పార్టీ నాయకత్వం, ముఖ్యంగా సీఎం కార్యాలయం చొరవ తీసుకోవాల్సిన అవసరముందనే వాదన క్షేత్రస్థాయిలో బలంగా వినిపిస్తోంది.

Related News

Telangana Farmers: అక్టోబర్ తొలి వారంలోనే.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ!

TGPSC Group 2: టీజీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. మరో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ ఇదే

Kalvakuntla Kavitha: కేసీఆర్ అడ్డాలో కవిత.. సీఎం , సీఎం అంటూ అరుపులు

Medaram Festival: మేడారం జాతరకు సీఎం రేవంత్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

TG Number Plates: ఇకపై ఆ వాహనాలపై ‘తెలంగాణ పోలీస్’ స్టిక్కర్లు.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు

Union Bank Manager Fraud: 10 నకిలీ గోల్డ్ లోన్ అకౌంట్స్.. రూ.75 లక్షలు.. బయటపడ్డ యూనియన్ బ్యాంకు మేనేజర్ బాగోతం

Hyderabad News: అడ్డంగా దొరికిపోయిన కేఏ పాల్‌.. పోలీసుల చేతుల్లో ఆయన గుట్టు

Hyderabad: ఘనంగా సెలబ్రిటీ డాండియా నైట్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?

Big Stories

×