VH On BJP: బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ సీనియర్ వి. హనుమంతరావు. బీజేపీ వ్యవహారశైలిపై మండిపడ్డారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీపై అస్సాంలో కేసు నమోదు చేయడాన్ని తప్పుబట్టారు. స్వాతంత్య్రం గురించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాటలపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. మీకో న్యాయం.. మాకు మరొకటా అని ప్రశ్నించారు.
సమాజాన్ని, పిల్లలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై కేసు పెట్టాలన్నది ఆయన డిమాండ్. ఇంతకీ మోహన్ భగవత్ ఏమన్నారంటే.. అయోధ్యలో రాముడి గుడి కట్టినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వస్తుందని, 1947 ఆగస్టు 15న రాలేదని అన్నట్లు వీహెచ్ మాట. ఆయనపై కేసు నమోదు చేయకుంటే ఉద్యమాన్ని చేపడుతామన్నారు.
ఈ నెల 15న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లతోపాటు భారతరాజ్యంపై పోరాడుతోందన్నారు. ఆయన వ్యాఖ్యలపై అస్సాంలో కేసు నమోదు అయిన విషయం తెల్సిందే. అలాగే అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి అమిత్ షాపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.