TS Assembly: హైవోల్టేజ్ అసెంబ్లీ వార్ కు రంగం సిద్ధమైంది. ఓవైపు కాళేశ్వరం రిపోర్ట్ హీట్.. ఇంకోవైపు ఫాంహౌజ్ లో ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీట్.., ఇటు వర్షాలు, అటు యూరియా ఎఫెక్ట్.., మరోవైపు బీసీ కోటా ఫైట్.., లోకల్ వార్ ముందు అసెంబ్లీ వార్ ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు కీలకంగా మారుతోంది. సభలో ఏం జరగబోతోంది? ఏ పార్టీ వ్యూహమేంటి? కేసీఆర్ సభకు వస్తారా? సైడైపోతారా? కాళేశ్వరం రిపోర్ట్ పై ప్రకంపనలు ఖాయమేనా?
కాళేశ్వరం రిపోర్ట్ పై తాడో పేడో..
శనివారం నుంచి జరిగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ఈసారి ఓ లెక్క ఉంది. అలా ఇలా కాదు.. ఈసారి హైవోల్టేజ్ వార్ ఖాయమే. ఎందుకంటే అక్కడ చర్చించబోయేది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైనే. 2023 అక్టోబర్ లో మేడిగడ్డ కుంగడంతో మొదలైన కాళేశ్వరం హీట్.. తాజాగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ స్టడీ చేయడం, ఓపెన్ కోర్టు విచారణ తర్వాత 650 పేజీల రిపోర్ట్ రెడీ చేయడం.. ఇందులో కేసీఆర్ నిర్ణయాలే శాపంగా మారాయని తేల్చడంతో హైవోల్టేజ్ పొలిటికల్ హీట్ ఖాయమే. సభ సాక్షిగానే బీఆర్ఎస్ అవినీతి బయటపెడతామని కాంగ్రెస్ అంటుంటే.. అదే సభలో ప్రభుత్వం కుట్రలను తిప్పికొడతామంటోంది గులాబీదళం. మరి ఏం జరగబోతోంది? ఎవరి వ్యూహమేంటి?
ఎంత నష్టం జరిగిందో వివరించే ప్లాన్
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ మాట మాట్లాడితే కాళేశ్వరం గొప్పతనం గురించి మాట్లాడేవారు. కాళేశ్వరం కట్టాకే వరి సాగు పెరిగిందని, రైతులంతా సంతోషంగా ఉన్నారన్న మాట వినిపించే వారు. ఎప్పుడైతే కాళేశ్వరానికి గుండెకాయ మాదిరిగా ఉన్న మేడిగడ్డ కుంగిందో అప్పటి నుంచి డైలాగ్ బంద్ అయింది. ప్రభుత్వం మారడం, కాంగ్రెస్ రావడంతో అసలు ఈ కాళేశ్వరం ఎవరు కట్టారు.. ఐడియాలు చెప్పింది ఎవరు.. ఎవరి నిర్ణయాలతో ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగింది.. ఎంత నష్టం జరిగింది.. రిపేర్లు సాధ్యమేనా.. ఇలాంటివాటిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ విచారణ జరిపి ఇటీవలే 650 పేజీల రిపోర్ట్ ను ప్రభుత్వానికి సమర్పించింది.
కాళేశ్వరం రిపోర్టే అజెండాగా సభా సమరం
సో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు మెయిన్ గా కాళేశ్వరం రిపోర్టే అజెండాగా జరగబోతోంది. అందుకే ఈసారి అసెంబ్లీ సమావేశాలు వెరీవెరీ స్పెషల్ గా మారాయి. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరంలో ఎలా అవినీతి జరిగింది.. ఎలా కూలిపోయిందో ఇప్పటికే చాలా సార్లు పవర్ పాయింట్ ప్రెజంటేషన్లు.. పర్యటనలు జరిగాయి. కాంగ్రెస్ ఎటాక్స్ పెంచేసింది. ఇంకోవైపు కమిషన్ రిపోర్ట్ అంతా జూటా అని హరీష్ రావు కూడా కౌంటర్ పీపీటీ ఇచ్చారు. డైలాగ్ వార్ జరుగుతూనే ఉంది. మరోవైపు ఫాంహౌజ్ లో కేసీఆర్ కూడా పలు దఫాలుగా హరీష్ రావు, కేటీఆర్ తో భేటీలు నిర్వహించారు. అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్ పై ఎలా ముందుకు వెళ్లాలో మంతనాలు జరుపుతున్నారు.
కాళేశ్వరం రిపోర్ట్ పై హైకోర్టుకు కేసీఆర్
కాళేశ్వరంపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీశ్ రావ్ హైకోర్టులో వేర్వురుగా పిటిషన్లు ఇటీవలే దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఉందని న్యాయవాదులు వాదించారు. కేసీఆర్ కు నోటీసు ఇవ్వకుండా ఆయనకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చారని చెప్పారు. మరోవైపు ఈ కేసులో సాక్షిగా విచారణకు పిలిచి రిపోర్ట్ ఇవ్వలేదని హరీష్ తరఫు లాయర్ వాదించారు. రిపోర్ట్ లోని అంశాలు వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా ఉన్నాయని.. లేఖ రాసినా ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. స్వయంగా సీఎం ప్రెస్‌మీట్ పెట్టి నివేదికను బయటకు చెప్పారన్నారు.
అసెంబ్లీలో చర్చించాకే రిపోర్ట్ ఇస్తామన్న ప్రభుత్వం..
అటు ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేశామని, అయితే ప్రస్తుతం ఘోష్ కమిషన్ రిపోర్టు పబ్లిక్ డొమైన్‌లో లేదని, రిపోర్ట్ పై అసెంబ్లీలో చర్చించాల్సి ఉందన్నారు. అసెంబ్లీలో చర్చించాకే పబ్లిక్ డొమైన్‌లో పెడతామన్నారు. కౌంటర్ లో మరిన్ని వివరాలు పొందుపరుస్తామని చెప్పారు. అసెంబ్లీలో కమిషన్ రిపోర్ట్ పై చర్చించాకే తదుపరి విచారణ చేయాలన్నారు. సో ఆ మ్యాటర్ కోర్టులో అక్కడి వరకు ఆగిపోయింది. ఇక నెక్ట్స్ సీన్ తెలంగాణ అసెంబ్లీలోనే ఉండబోతోంది.
సభలో PPTకి ఛాన్స్ ఇవ్వాలంటున్ బీఆర్ఎస్
ఈనెల 30 నుంచి అసెంబ్లీ నేపథ్యంలో తమకు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆధారాలు, వివరాలతో చెప్పేలా సభలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ కు అనుమతివ్వాలని BRS ఎమ్మెల్యేలు అంటున్నారు. అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగానే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ను తమ పార్టీకి ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేలు ప్రశాంత్‌రెడ్డి, వివేకానంద, ముఠా గోపాల్, సుధీర్‌రెడ్డి స్పీకర్ ను కోరేందుకు సిద్ధమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పై ఉందని, కాంగ్రెస్, బీజేపీ రెండూ కలిసి కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు బీఆర్ఎస్ బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదంటున్నారని, అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాదాపు 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిందన్నారు. PPTకి ఛాన్స్ ఇస్తే కంప్లీట్ గా ప్రెజంటేషన్ ఇస్తామంటున్నారు.
ఫేస్ టూ ఫేస్ డిబేట్ ఎలా ఉండబోతోంది?
సో కాళేశ్వరంపై నివేదిక వచ్చినప్పుడే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఇక ఆ రిపోర్ట్ పై ఫేస్ టూ ఫేస్ డిబేట్ అంటే అది ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అసెంబ్లీ వార్ ఖాయం అవడంతో కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో ఎర్రవల్లి ఫాంహౌజ్ లో మీటింగ్ పెట్టారు. స్ట్రాటజీపై దిశానిర్దేశం చేశారు. అటు కాంగ్రెస్ కూడా అన్ని అస్త్రాలతో రెడీగా ఉంది. భారీ వర్షాల్లో పొలిటికల్ హీట్ ఖాయంగానే కనిపిస్తోంది. బీసీ కోటా విషయంలో ముదిరిన వార్, ఓవైపు లోకల్ ఫైట్ దగ్గరపడుతుండడం, అటు జూబ్లీహిల్స్ బైపోల్ వ్యవహారం.. ఇలా అన్ని విషయాలూ అసెంబ్లీ సమావేశాల చుట్టూనే తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వం కాళేశ్వరం రిపోర్ట్ పై గట్టిగా ఉంటే.. యూరియా కొరతపై బీఆర్ఎస్ పకడ్బందీ వ్యూహాలతో కౌంటర్ చేసేందుకు సిద్ధమవుతోంది. వర్షాలు, వరదలు, సహాయాలపైనా వాడివేడిగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది.
బీసీలకు 42 శాతం కోటా చుట్టూ మ్యాటర్
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయ్. అటు బీసీ కోటా అఫీషియల్ గా ఫైనలైజ్ అయితే ముందుకెళ్లే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అదే సమయంలో ఢిల్లీ స్థాయిలో న్యాయనిపుణులతో చర్చలు కూడా జరుపుతున్నారు. మరోవైపు సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆర్డర్ ఉంది. అటు బిల్లు, ఆర్డినెన్స్ తెచ్చినా వాటికి రాష్ట్రపతి ఆమోదం లభించకుండా కేంద్రం అడ్డుకుందని, జీవో ద్వారా కూడా ఇచ్చి ప్రయత్నం చేద్దామన్న ఆలోచనను కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. 50 శాతానికి మించి రిజర్వేషన్ కల్పిస్తూ జీవో ఇచ్చినా కోర్టులో నిలవదని, ఎన్నికలు జాప్యమయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు. సో చివరకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే బీసీలను కులగణన, 42 శాతం రిజర్వేషన్లు, కమిషన్లు, బిల్లులు, ఆర్డినెన్సులతో మోసం చేసిందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. వీటిపై కాంగ్రెస్ కౌంటర్లు కూడా ఇస్తోంది. మరి పార్టీ పరంగా బీఆర్ఎస్ ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదో చెప్పాలన్న ప్రశ్నలు వస్తున్నాయ్.
ఆర్డినెన్స్ అంటూ మోసమన్న బీఆర్ఎస్
మరోవైపు భారీ వర్షాలు, నష్టాలపైనా సభలో వాడి వేడి చర్చ జరిగే అవకాశాలున్నాయ్. వర్షాలు, పంట నష్టాలు, యూరియా కొరత వీటిపైనే విపక్షాలు వాయిదా తీర్మానాలు ఇచ్చే ఛాన్స్ ఉంది. అతి భారీ వర్షాలు కురుస్తాయని 72 గంటల ముందే భారత వాతావరణ శాఖ హెచ్చరించినా కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో స్పందించలేదన్న వాదనను బీఆర్ఎస్ వినిపిస్తోంది. వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడి, సహాయం కోసం ఆర్తనాదాలు చేసినా.., కాంగ్రెస్ నాయకులు మాత్రం ప్రజల గోడు పట్టించుకోకుండా తమ ఇళ్లకే పరిమితమయ్యారంటున్నారు. వరద సహాయక చర్యల్లో పూర్తిగా రేవంత్ సర్కార్ విఫలమైందన్న వాదనను బీఆర్ఎస్ వినిపిస్తోంది. ఓవైపు వర్షాలు ఉంటే మరోవైపు సీఎం రేవంత్ మూసీ బ్యూటిఫికేషన్ పై సమీక్షించడమేంటని కేటీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు. దీన్నే సభలోనూ ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే వర్షాలు, వరదలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు అలర్ట్ గానే ఉందని, సీఎం రేవంత్ స్వయంగా ఏరియల్ సర్వే చేశారన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రస్తావిస్తోంది. అటు మెదక్, కామారెడ్డి కలెక్టర్లకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడం, కామారెడ్డి ఇంఛార్జ్ మంత్రి సీతక్క పర్యవేక్షించడం ఇవన్ని కనిపించట్లేదా అని కాంగ్రెస్ క్వశ్చన్ చేస్తోంది.
యూరియా కొరతపై బీఆర్ఎస్ కౌంటర్లు
మరోవైపు తెలంగాణలో యూరియా కొరతతో పలు చోట్ల రైతులు ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై కూడా సభలో చర్చించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ గత కొన్ని రోజులుగా మ్యాటర్ ను మొత్తం యూరియా చుట్టూనే తిప్పుతోంది. అయితే యూరియా ఆలస్యం అవడం, కొరతకు కారణాలపై రైతులకు ప్రభుత్వం క్లియర్ గా చెప్పింది. అలాగే కేంద్రానికి చాలాసార్లు విన్నవించిన విషయాన్ని రైతుల దృష్టికి తీసుకెళ్లింది. అటు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో సమస్యతో ఉత్పత్తి ఆగడం దాన్ని రిపేర్ చేసే విషయంలో ఫోకస్ పెంచడం ఇవన్నీ జరుగుతున్నాయి. మరోవైపు వివిధ పోర్టుల ద్వారా తెలంగాణకు యూరియా చేరుకుంటోంది. ఏపీ, చెన్నై పోర్టులకు 21వేల 860 మెట్రిక్ టన్నుల యూరియా చేరిందని, 38వేల మెట్రిక్ టన్నుల యూరియా సప్లైకి కేంద్రం అంగీకరించడం ఇలాంటి విషయాలను ప్రభుత్వం సభలో ప్రస్తావించే అవకాశం ఉంది.
వర్షాల్లో ఓటరు లిస్టు చెకింగ్ సమస్యలని వాదన
ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సెప్టెంబర్ 2న తుది ఓటర్ల జాబితాను విడుదల చేసేందుకు రాష్ట్ర ఈసీ షెడ్యూల్ ఖరారు చేసింది. అయితే బీఆర్ఎస్ మాత్రం ఈ వర్షాల్లో జనం తమను కాపాడుకోవాలా? లేదా ఓటర్ల జాబితా కోసం పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరగలా? అని ప్రశ్నిస్తోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియను రీషెడ్యూల్ చేయాలంటున్నారు. అటు ఓటరు జాబితాల తయారీలో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీటిపై కాంగ్రెస్ సర్కార్ కౌంటర్ ఇస్తోంది. మరి సభలో ఏం జరుగుతుందన్నది కీలకంగా మారింది.
Story By Vidya Sagar, Bigtv