Jubilee Hills by election: జూబ్లీహిల్స్ నకిలీ ఓట్ల అంశంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలు.. వాటిపై కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఆరోపణలు రాజకీయ దుమారాన్ని సృష్టించాయి. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నకిలీ ఓటర్లను నమోదు చేస్తోందని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.. అయితే, ఆయన లేవనెత్తిన నకిలీ ఓటర్లలో కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలేనని తేలడంతో పాటు వారి ఓట్లు 2023, 2024 ఓటర్ల జాబితాలోనే ఉన్నాయని తేలింది.
కాంగ్రెస్‌ను నిందించే ప్రయత్నం ఇది..
కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్‌లో వేలాది నకిలీ ఓటర్లను నమోదు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. శ్రీనివాస్ రెడ్డి గోగూరి పేరు రెండు చోట్ల ఉందని పేర్కొన్నారు. మిరియాల అశోక్, కొవ్వూరి కార్తీక్, గొడ్డేటి మాధవి వంటి పేర్లతో కొత్తగా నకిలీ ఓటర్లను చేర్చారని ఆరోపించారు. కేటీఆర్ ప్రస్తావించిన శ్రీనివాస్ రెడ్డి గోగూరి సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ అని కాంగ్రెస్ వెల్లడించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో (2023, 2024 ఎన్నికల ఓటర్ల జాబితాలో) చేర్చబడిన ఓట్లనే చూపిస్తూ కేటీఆర్ కాంగ్రెస్‌ను నిందించే ప్రయత్నం చేస్తున్నారని ఈసీ ధృవీకరించినట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
ALSO READ: Minister Seethakka: తల్లిదండ్రులపై ప్రమాణం చేస్తూ హరీష్ రావుకు మంత్రి సీతక్క సవాల్
కేటీఆర్ నకిలీ ఓటర్లని చెప్పిన వ్యక్తులందరి ఓట్లు కూడా 2023, 2024 లోక్‌సభ ఎన్నికల ఓటర్ల జాబితాలో ఉన్నాయని ఈసీ తేల్చింది. అంటే ఈ నకిలీ ఓట్ల వ్యవహారం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని స్పష్టమవుతోందని, అందులో కేటీఆర్ పాత్ర లేకుండా ఉండదనేది కాంగ్రెస్ నేతల ప్రశ్న. నకిలీ ఓటర్ల విషయంలో కేటీఆర్ వాదన ‘దొంగే దొంగ’ అన్నట్లుగా ఉందని కాంగ్రెస్ విమర్శించింది. గతంలో జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీలే గెలిచాయని.. ఆ ఎన్నికల్లో ఈ నకిలీ ఓటర్ల ద్వారా ఆ రెండు పార్టీలే లబ్ధి పొందాయని ఆరోపించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 30 లక్షల ఓటర్లను తొలగించడంలో బీఆర్ఎస్‌కు బీజేపీ సహకరించిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. జూబ్లీహిల్స్‌లో స్థానికుల ఓట్లు తొలగించి దొంగ ఓటర్లను నమోదు చేయడం కేటీఆర్‌కు తెలుసని.. ఇప్పుడు బీఆర్ఎస్ ఓటమి ఖాయమవడంతోనే ఓట్ చోరీపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.
ALSO READ: HYDRA: కబ్జాలకు చెక్.. రూ. 110 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా