Ram Pothineni: రామ్ పోతినేని(Ram Pothineni) .. చాక్లెట్ బాయ్ గా ఇండస్ట్రీలో పేరు సొంతం చేసుకున్న ఈయన.. చివరిగా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన రెడ్, రొమాంటిక్, ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ ఇలా ఏ చిత్రం కూడా ఈయనకు మంచి విజయాన్ని అందించలేదు. దీంతో ఇప్పుడు ఎలాగైనా సరే సక్సెస్ అందుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు రామ్ పోతినేని. అందులో భాగంగానే తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. మహేష్ బాబు పి (Maheshbabu P) దర్శకత్వంలో భాగ్యశ్రీ బోర్సే (Bhagya Sri borse) హీరోయిన్గా వస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అన్ని కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వచ్చేనెల విడుదలకు సిద్ధమవుతోంది ఈ సినిమా.
ఇకపోతే విడుదలకు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను అప్పుడే మొదలు పెట్టేశారు హీరో రామ్. అందులో భాగంగానే తాజాగా ప్రముఖ విలక్షణ నటుడు జగపతిబాబు (Jagapathi Babu) హోస్ట్గా నిర్వహిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. అందులో భాగంగానే తన లవ్ మేటర్ తో పాటు తాను చిన్నప్పుడు తమ కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి .. తన తండ్రిపై పెరిగిన ప్రేమ గురించి వెల్లడించి అందరిని ఆశ్చర్యపరిచారు.
also read:K-Ramp: ఓటీటీ హక్కులు వారికే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ క్రమంలోనే రామ్ కుటుంబం గురించి కూడా ప్రశ్నలు అడగగా దీనిపై రామ్ మాట్లాడుతూ.. “నేను పుట్టిన తర్వాత విజయవాడలో కుల అల్లర్లు చెలరేగిపోయాయి. కుల పిచ్చి ఎక్కువైపోయి గొడవలు జరిగాయి. దాంతో మా కుటుంబం రాత్రికి రాత్రే అన్ని కోల్పోయింది. ఏం చేయాలో దిక్కు తెలియక రోడ్డున పడ్డాము. ఇక దాంతో అక్కడి నుంచి మేము చెన్నైకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడే మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టాము ఆ మార్పు నాకు పూర్తి దిగ్భ్రాంతిని కలిగించింది. అందుకే నాకు మా నాన్న అంటే ప్రేమ మాత్రమే కాదు గౌరవం కూడా” అంటూ రామ్ పోతినేని తెలిపారు. మొత్తానికి అయితే రామ్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి
రామ్ ఎవరో కాదు ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిషోర్ తమ్ముడైన మురళి పోతినేని కొడుకు. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుండి వచ్చిన ఈయన బాల్యంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఆ తర్వాత చెన్నైకి షిఫ్ట్ అయినట్లు తెలిపారు.
ప్రముఖ నట శిక్షకుడు ఎన్ జే భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్న రామ్..తొలిసారి దేవదాసు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలియానా హీరోయిన్గా ఇదే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2006 జనవరి 11న విడుదలై మంచి విజయం అందుకుంది.