Jubilee Hills byElection: తెలంగాణలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నికలు నవంబర్ 11వ తేదీన జరగనున్న నేపథ్యంలో.. ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో పోలింగ్ రోజున నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలన్నింటినీ మూసివేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
మఖ్యంగా ఓటర్లు ఎటువంటి ఆటంకం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవడాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా, పారదర్శకంగా జరగడానికి వీలుగా పోలింగ్ కేంద్రాలుగా ఉపయోగించే సంస్థలు సహా అన్ని కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
ALSO READ: HYDRA: కబ్జాలకు చెక్.. రూ. 110 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు (అదే నియోజకవర్గంలో పనిచేస్తున్నా లేదా వేరే ప్రాంతంలో పనిచేస్తున్నా) ప్రత్యేకంగా సాధారణ సెలవు దినాన్ని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రత్యేక సెలవు ప్రకటన ఉద్యోగులు తమ రాజ్యాంగ హక్కును వినియోగించుకోవడానికి ప్రోత్సాహాన్ని ఇస్తోంది. సెలవు కారణంగా.. ఓటు వేసేందుకు దూర ప్రాంతాల నుండి కూడా ఉద్యోగులు తమ సొంత నియోజకవర్గానికి వచ్చి తమ బాధ్యతను నిర్వర్తించడానికి అవకాశం లభిస్తుంది.
ALSO READ: Telangana Bandh: రేపు తెలంగాణ బంద్.. డీజీపీ శివధర్ రెడ్డి కీలక ఆదేశాలు
బీఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం కారణంగా ఉపఎన్నిక వచ్చింది. ఈ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగి ఉంది. అధికార పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఈ స్థానాన్ని గెలుచుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ సెలవు నిర్ణయం.. ఎన్నికల రోజున అధిక సంఖ్యలో ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనేలా చేసి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పవచ్చు.