ప్రయాణీకులతో రైల్వే క్యాటరింగ్ సిబ్బంది గొడవపడటం, రైల్వే సిబ్బందితో ప్రయాణీకులు గొడవపడటం తరచుగా చూస్తుంటాం.. కానీ, తాజాగా రైల్వే క్యాటరింగ్ సిబ్బంది రెండు వర్గాలుగా ఏర్పడి కొట్లాడుకోవడం అందరినీ షాక్ కు గురి చేసింది. ఈ ఘటన ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన లో జరిగింది. ఎప్పుడు జరిగింది అనేది స్పష్టంగా తెలియకపోయినా, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఒకరిపై మరొకరు డస్ట్ బిన్ లు విసిరేసుకోవడం, బెల్టులతో కొట్లాడుకోవడం అందినీ షాక్ కు గురి చేసింది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో వందే భారత్ రైలులో పనిచేస్తున్న ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) క్యాటరింగ్ సిబ్బంది ప్లాట్ ఫారమ్ మీదే ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకోవడంతో పాటు తన్నుకున్నారు. చెత్త బుట్టలు విసురుకున్నారు. వీడియోలో ఒక ఉద్యోగి మరొకరిపై డస్ట్ బిన్ తో దాడి చేసిన తర్వాత ఈ గొడవ మరింత పెద్దదిగా మారింది. ఘర్షణ హింసాత్మకం అయ్యింది. రెండు వర్గాలుగా విడిపోయిన సిబ్బంది ఒకరిపై మరొకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. కొంత మంది ఉద్యోగులు ఏకంగా తమ బెల్టులు తీసి కొట్టుకున్నారు. ప్రయాణీకులు వారి కొట్లాటను చూసి షాకయ్యారు. కొంత మంది ప్లాట్ ఫారమ్ మీది నుంచి దూరం జరిగే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న రైల్వే కార్మికులు, పోలీసులు జోక్యం చేసుకుని ఈ గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. మొత్తంగా ఈ గొవడతో ప్లాట్ ఫారమ్ పెద్ద రచ్చ జరిగినట్లు అయ్యింది.
IRCTC staffers serving onboard Vande Bharat settle an altercation with dustbin, belt and punches at Nizamuddin station in Delhi. pic.twitter.com/tldenRsRMz
— Piyush Rai (@Benarasiyaa) October 17, 2025
Read Also: రైల్లో సీటు కోసం అన్నాదమ్ముల కంత్రీ ఐడియా.. చివరికి కటకటాల్లోకి..
అటు ఈ గొడవపై రైల్వే అధికారులు స్పందించారు. బాధ్యులను అరెస్టు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. “హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో జరిగిన సంఘటనను రైల్వే పరిపాలన వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకుంది. దోషులందరినీ రైల్వే రక్షణ దళం (RPF) అరెస్టు చేసింది” అని ఉత్తర రైల్వే అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, సంబంధిత కాంట్రాక్టర్‌కు రూ. 5 లక్షల జరిమానా విధించినట్లు తెలిపింది. క్యాటరింగ్ ఒప్పందాన్ని కూడా రద్దు చేయాలని నోటీసులు జారీ చేసింది. “ఈ గొడవకు కారణం అయిన నలుగురు విక్రేతల గుర్తింపు కార్డులు స్వాధీనం చేసుకున్నాము. వారిని కూడా RPF అదుపులోకి తీసుకుంది” అని రైల్వే అధికారులు వెల్లడించారు. రైల్వే సిబ్బంది ప్రయాణీకులకు ఇబ్బంది కలించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. రైల్వే ప్రయాణీకుల భద్రత, సౌలభ్యం రైల్వేకు అత్యంత ప్రాధాన్యం అనేది రైల్వే సిబ్బంది మర్చిపోకూడదని గుర్తు చేసింది.
Read Also: ప్రతిష్టాత్మక కాలేజీలో అమ్మాయిల ఫైటింగ్, నెట్టింట వీడియో వైరల్.. యాజమాన్యం ఏం చేసిందంటే?