Dhanteras 2025: ఐదు రోజుల దీపావళి వేడుకలకు నాంది పలికే పండగే ధన త్రయోదశి లేదా ధంతేరాస్. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని, సంపదకు అధిపతి అయిన కుబేరుడిని.. అలాగే ఆరోగ్యానికి అధిదేవత అయిన ధన్వంతరిని పూజించే ఈ పర్వదినం అత్యంత విశిష్టమైంది. ఈ రోజున బంగారం, వెండి లేదా కొత్త పాత్రలు కొనుగోలు చేయడం వల్ల ఆ ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయిని, సంవత్సరం పొడవునా సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని హిందువులు నమ్ముతారు. ఇంతకీ ధన త్రయోదశి రోజు ఏ సమయంలో బంగారం, వెండి కొంటే మంచిదనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ధన త్రయోదశి:
హిందూ పంచాంగం ప్రకారం.. కార్తీక మాసం కృష్ణ పక్షంలో వచ్చే త్రయోదశి తిథి రోజున ధన త్రయోదశి పండగను జరుపుకుంటారు.
ధన త్రయోదశి 2025 తేదీ: శనివారం, అక్టోబర్ 18
త్రయోదశి తిథి ప్రారంభం: అక్టోబర్ 18 న మధ్యాహ్నం 12:18 గంటలకు త్రయోదశి తిథి ప్రారంభం అవుతుంది.
త్రయోదశి తిథి ముగింపు: అక్టోబర్ 19 మధ్యాహ్నం 01:51 గంటలకు తిథి ముగుస్తుంది.
లక్ష్మీ పూజకు శుభ సమయం:
ధన త్రయోదశి రోజున సాయంత్రం సమయంలో , ప్రదోష కాలంలో లక్ష్మీ పూజ చేయడం అత్యంత శ్రేయస్కరం. ఈ సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే సంపద స్థిరంగా ఉంటుందని నమ్మకం.
ధన త్రయోదశి పూజ ముహూర్తం: అక్టోబర్ 18 సాయంత్రం 07:15 నుంచి రాత్రి 08:19 గంటల వరకు పూజ చేయవచ్చు.
ప్రదోష కాలం: అక్టోబర్ 18 న సాయంత్రం 05:48 నుంచి రాత్రి 08:19 గంటల వరకు ప్రదోష కాలంగా చెబుతారు.
వృషభ కాలం: అక్టోబర్ 18న సాయంత్రం 07:15 నుంచి రాత్రి 09:11 గంటల వరకు వృషభ కాలం.
ఈ పూజా సమయాన్ని అనుసరించి శ్రీ మహాలక్ష్మి, కుబేరుడు, ధన్వంతరి దేవుడిని పూజించడం వల్ల అదృష్టం, ఆరోగ్యం, సంపద లభిస్తాయి.
బంగారం, వెండి కొనుగోలుకు మంచి సమయాలు:
సాధారణంగా త్రయోదశి తిథి ప్రారంభం అయినప్పటి నుంచి ముగిసే వరకు బంగారం, వెండి కొనుగోలు చేయవచ్చు. అయితే.. కొన్ని నిర్దిష్ట శుభ ముహూర్తాలు మరింత అనుకూలమైనవిగా పండితులు సూచిస్తున్నారు.
మొదటి ముఖ్య శుభ సమయం: అక్టోబర్ 18 మధ్యాహ్నం 12:18 నుంచి అక్టోబర్ 19 ఉదయం 06:24 గంటల వరకు బంగారం, వెండి వస్తువులను కొనొచ్చు.
Also Read: దీపావళి రోజు.. లక్ష్మీ దేవిని పూజించే సరైన పద్ధతి ఏంటో తెలుసా ?
మధ్యాహ్నం ముహూర్తం: అక్టోబర్ 18 న మధ్యాహ్నం 12:18 నుంచి సాయంత్రం 04:23 గంటల వరకు బంగారం, వెండి నగలు, వస్తువులు కొనుగోలు చేయవచ్చు.
సాయంత్రం ముహూర్తం : అక్టోబర్ 18న సాయంత్రం 05:48 నుంచి రాత్రి 07:23 గంటల వరకు బంగారం, వెండి వస్తువులు కొనేందుకు మంచి సమయం.
ఒకవేళ అక్టోబర్ 18న కొనుగోలు చేయలేకపోతే.. త్రయోదశి తిథి ముగిసే వరకు.. అంటే అక్టోబర్ 19 మధ్యాహ్నం 01:51 గంటల లోపు కొనుగోలు చేయడం కూడా శుభప్రదమే.
ధన త్రయోదశి రోజు కొనుగోలు చేసిన బంగారం, వెండి లేదా కొత్త వస్తువులను లక్ష్మీదేవి పూజ సమయంలో ఆమె ముందు ఉంచి పూజ చేయడం వల్ల అవి పవిత్రమై, శుభ ఫలితాలను ఇస్తాయని నమ్మకం. కాబట్టి.. శుభ ముహూర్తాన్ని చూసుకుని, పవిత్రమైన మనసుతో కొనుగోలు చేసి.. దీపావళి వేడుకలను అత్యంత ఆనందోత్సాహాలతో ప్రారంభించండి.