Big Stories

Telangana: ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాయా? పదేళ్ల తెలంగాణం ఏం చెబుతోంది?

jai telangana

Telangana: స్వరాష్ట్ర కాంక్షతో కొందరు.. వలస దోపిడీని సహించక మరికొందరు. భవిష్యతు దొరుకుతుందని విద్యార్థి, నిరుద్యోగులు. ఇలా ఒక్కటేమిటి..? వందల్లో మొదలైన ఆకాంక్ష.. మూడున్నర కోట్లకు చేరింది. అయితే, వారందరి లక్ష్యాలు దరి చేరాయా? సబ్బండ వర్గాల సమస్యలు పరిష్కారమయ్యాయా??

- Advertisement -

ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో వచ్చిన తెలంగాణ ఆగమైందన్న విమర్శలు మూటగట్టుకుంది. నీళ్లూ, నిధులు, నియామకాలు.. కొందరికీ దక్కాయన్న భావన నెలకొంది. ఉద్యమ ద్రోహులే అందలం ఎక్కి ఉద్యమకారుల తలలపై నాట్యమాడుతున్నారనే విమర్శలు లేకపోలేదు.

- Advertisement -

ప్రత్యేక రాష్ట్రం వచ్చి తొమ్మిదేళ్లు పూరైంది. ఇప్పటికీ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు. నీళ్ల పేరుతో సర్కారు పెద్దలు జేబులు నింపుకున్నారన్నది ప్రధాన విమర్శ. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన దానికంటే వేల కోట్ల రూపాయల అంచనాలు పెంచుతూ నిధులన్నీ దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక స్టూడెంట్లు, నిరుద్యోగులు తమ చదువులు, జీవితాలను త్యాగం చేసి ఉద్యమంలో పాల్గొన్నారు. సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని, తమ జీవితాలు బాగుపడతాయని ఆశపడ్డారు. ఇప్పుడు వారి గోస ఎవరికీ పట్టడం లేదు. గులాబీ బాస్ కు వారు అసలు కనిపించడం లేదు.

ఇక నియామకాలన్నది తెలంగాణ నిరుద్యోగులకు అందని ద్రాక్షే అయ్యింది. కేసీఆర్‌ తన కుటుంబంలో అందరికీ మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా, ఎంపీగా ఓడితే ఎమ్మెల్సీగా ఉద్యోగం ఇచ్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరి దాకా కొట్లాడిన ఉద్యమకారుల సంక్షేమం గురించి ఊసేలేదు.. అసలు ఉద్యమ ఆకాంక్షలే పాలకులకు గుర్తులేవు అనే టాక్‌ జోరుగా నడుస్తోంది.

తెలంగాణ ఉద్యమ సమయంలో 3,500 మంది జైలుకు వెళ్లారు. 2,890 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిని కనీసం ఉద్యమకారులుగా గుర్తించే పరిస్థితి లేదు. ఉద్యమం సమయంలో ఆత్మ బలిదానాలు చేసుకున్న వారి సంఖ్య 1,230. ఇందులో 1,089 మంది అమరులు ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చనిపోయారో పూర్తి వివరాలతో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ హైదరాబాద్ వారు ఒక నివేదిక తయారు చేశారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది 419 మందినే. అమరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. 80 మంది అమరుల కుటుంబాలకు 10 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకుంది.

తెలంగాణ రాష్ట్రం కోసం 42 రోజులు సకల జనుల సమ్మె చేసి ఉమ్మడి సర్కార్ మెడలు వంచిన ప్రభుత్వ ఉద్యోగుల త్యాగాలు ఇప్పుడు సీఎంకు కనిపించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచుతామన్న సీఎం కేసీఆర్.. ఆ హామీనే మర్చిపోయారు. తెలంగాణను వ్యతిరేకించిన ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు కట్టబెట్టారు. రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన సబ్బండ వర్గాలు ఇప్పుడు సీఎంకు కనిపించడం లేదు. సర్వం కోల్పోయిన ఉద్యమకారులను సొంత రాష్ట్రంలో కూడా గుర్తించలేని దౌర్భాగ్య స్థితిలో ఉండడం బాధాకరం.

తెలంగాణ పోరాటంలో విశేష కృషి చేసి ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి సర్వశక్తులొడ్డి కష్టపడి, నష్టపోయిన నాయకులు, అనేక మంది ఉద్యమకారుల గుండెల్లో ఏర్పడ్డ గాయాలు.. చేదు అనుభవాలు ఎన్నటికీ సమసిపోవు. తెలంగాణ వచ్చాక వైభోగాలు అనుభవించింది ఇంకా అనుభవిస్తుంది కేసీఆర్ కుటుంబమే అంటున్నారు. ఉద్యమ సమహంలోను అప్పటి ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి లని కలిసే అవకాశం ఉండేదని.. కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కుక్కిన పేనులా పడి ఉంటున్నామనే ఆవేదన చాలామందిది. ప్రత్యేక రాష్ట్రంలో హక్కుల కోసం గొంతెత్తే పరిస్థితే లేదనే విమర్శ ఉంది.

తెలంగాణ ఎవరిపాలైందనేది పదేళ్ల తర్వాత చర్చకి వచ్చిందన్నారు సీనియర్‌ జర్నలిస్ట్‌ పాశం యాదగిరి. ఇప్పుడున్న పత్రికలు అన్నీ ముఖ్యమంత్రి చుట్టే తిరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిజం రాసే పరిస్థితి లేదని.. ఎవరైనా నిజం రాస్తే జైల్ కి వెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు.

పదేళ్ల తెలంగాణలో దండుకున్నది ఎవరు? దగా పడ్డది ఎవరు? తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటున్నారు మేధావులు. తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణ సమగ్ర అభివృద్ధికి మరో పోరాటం అవసరమవుతున్నదని గుర్తు చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News