ED raids on BRS Leaders(Latest news in telangana): పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి.. వీరిద్దరూ మైనింగ్ వ్యవహారంలో ప్రభుత్వానికి రూ. 39 కోట్ల వరకు నష్టం చేకూర్చినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గుర్తించింది. ఈ వ్యవహారంలో మొత్తం రూ. 300 కోట్ల వరకు మైనింగ్ అక్రమాలు జరిగినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. సంతోష్ శాండ్, సంతోష్ గ్రానైట్ కంపెనీల ద్వారా ఈ అక్రమాలు జరిగాయని ఈడీ తెలిపింది.
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుల నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సమయంలో రూ. 19 లక్షల నగదును గుర్తించింది. సోదాలకు సంబంధించి శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. మనీలాండరింగ్, హవాలా నేపథ్యంలో సోదాలు నిర్వహించినట్టు అందులో తెలిపింది. బ్యాంకు ఖాతాల్లో కూడా అక్రమ లావాదేవీలను గుర్తించినట్లు పేర్కొన్నది. అక్రమ మార్గంలో వీరు డబ్బు మొత్తాన్ని స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టారంటూ ఈడీ వివరించింది. బినామీ పేర్లతో లావాదేవీలను గుర్తించామని, మరికొన్ని బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉందంటూ అధికారులు తెలిపారు. మహిపాల్ రెడ్డి సోదరులకు పలువురు బినామీలుగా ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ అధికారులు తెలిపారు.
Also Read: బీఆర్ఎస్‌కు మరో షాక్.. హస్తం గూటికి మరో ఎమ్మెల్యే..!
ఇదిలా ఉంటే.. ఈడీ సోదాల నేపథ్యంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే కక్ష పూరితంగా ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఈడీ సోదాలు ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈడీ సోదాలకు తాను, తన కుటుంబ సభ్యులు పూర్తిగా సహకరించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తాము ఎటువంటి వ్యాపారాలు నిర్వహించలేదని ఆయన పేర్కొన్నారు.