Vemulawada Temple: తెలంగాణలో వేములవాడ రాజన్న టెంపుల్ అంటే మస్త్ ఫేమస్.. స్వామి వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే గాక చుట్టు పక్క రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. సిరిసిల్ల జిల్లాలో వెలసిన శ్రీ రాజరాజశ్వేర దేవస్థానం దక్షణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రధాన దైవం అయిన రాజరాజేశ్వర స్వామి స్వయంభూగా వెలిశారు. ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరీ దేవి, శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయకుడి విగ్రహాలు కూడా కొలువై ఉన్నాయి. ఆలయానికి ఉత్తరాన ఉన్న ఈ పవిత్ర కోనేరులో స్నానం చేసి స్వామిని దర్శిస్తే దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ కోడె మొక్కు ను భక్తులు ఎక్కువగా విశ్వసిస్తారు. సంతానం లేని వారు, కోరికలు నెరవేరాలని భక్తులు కోడెను ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించి.. ప్రాంగణంలో కట్టివేసే కోడె మొక్కు ఇక్కడి ప్రత్యేక ఆచారం. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో 400 ఏళ్ల నాటి మసీదు ఉండడం.. ఈ దేవాస్థాన క్షేత్ర మత సామరస్యాన్ని తెలుపుతుంది. వేములవాడ రాజన్నగా భక్తులు ఆప్యాయంగా పిలుచుకునే ఈ స్వామి, భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షంగా పూజలందుకుంటున్నారు.
⦿ దర్శనాల్లో తాత్కాలిక మార్పులు..
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల దృష్ట్యా భక్తుల దర్శనాలు, సేవల్లో కొన్ని తాత్కాలిక మార్పులు చోటు చేసుకున్నాయి. దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీమతి రమాదేవి ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని భక్తులకు తెలిపారు. అభివృద్ధి పనుల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, దర్శన భాగ్యాన్ని కొనసాగించడానికి ఈ తాత్కాలిక ఏర్పాట్లు చేశారు.
⦿ భీమేశ్వరాలయంలో తాత్కాలిక దర్శనాలు
శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనానికి నేటి నుంచి శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో తాత్కాలిక ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. సాధారణంగా రాజన్న ఆలయంలో జరిగే దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేసినట్టు పేర్కొన్నారు. స్వామివారి దర్శన భాగ్యం ఈ భీమేశ్వర స్వామి ఆలయంలో కల్పిస్తున్నట్టు వివరించారు. ఈ తాత్కాలిక మార్పు నేటి (11-10-2025) నుంచే అమలులోకి వచ్చిందని చెప్పారు. ఇక నుంచి కొన్ని రోజుల పాటు భక్తులంతా శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనాన్ని.. శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం నుండే చేసుకోవచ్చని అధికారులు వివరించారు.
⦿ రేపటి నుండి రాజన్న ఆలయం దర్శనాల నిలిపివేత
అక్టోబర్ 12 నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని సాధారణ దర్శనాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ఈవో స్పష్టం చేశారు. అయినప్పటికీ, భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. దర్శనాలను తాత్కాలికంగా భీమేశ్వర ఆలయానికి మార్చినప్పటికీ.. ఆలయంలో స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు, పూజా కార్యక్రమాలు మాత్రం యథావిధిగా, శాస్త్రోక్తంగా నిర్వహించినున్నట్టు చెప్పారు. ఆలయ అభివృద్ధి పనుల కారణంగా కేవలం భక్తుల సాధారణ దర్శనాలలో మాత్రమే తాత్కాలిక మార్పులు చేశారు.
⦿ భక్తులకు విజ్ఞప్తి
ఆలయాన్ని మరింత సుందరంగా, విశాలంగా తీర్చిదిద్దే ఈ ఆలయ అభివృద్ధిలో భాగంగా తీసుకున్న ఈ ముఖ్య నిర్ణయాన్ని భక్తులందరూ గమనించి సహకరించాలని దేవస్థానం తరపున ఈవో రమాదేవి విజ్ఞప్తి చేశారు.
⦿ కీలకమైన సమాచారం..
➼ అక్టోబర్ 12 నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సాధారణ దర్శనాలు నిలిపివేత
➼ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం నుండే స్వామివారి దర్శనం..
ALSO READ: Gold Capital of India: భారతదేశ గోల్డ్ రాజధాని ఏదో తెలుసా..? ఇక్కడ నుంచి భారీగా బంగారం ఉత్పత్తి..