CM Progress Report: ఈవారం సీఎం రేవంత్ ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో కొత్త పీఈటీ పోస్టుల భర్తీకి అడుగులు, గురుకులాల అవసరాల కోసం ఎమర్జెన్సీ ఫండ్ రిలీజ్, తెలంగాణ రైజింగ్ 2047పై సర్వేకు శ్రీకారం, అమెరికన్ ప్రతినిధులతో మీటింగ్, సరికొత్తగా హార్టికల్చర్ ప్రణాళికలు, రేట్లు పడిపోయిన మక్కలకు మార్క్ ఫెడ్ సపోర్ట్..
05-10-2025 ఆదివారం ( ప్రజారోగ్యమే కీలకం )
ప్రజారోగ్యం విషయంలో వెనక్కు తగ్గేది లేదని తెలంగాణ ప్రభుత్వం ప్రూవ్ చేసుకుంది. తెలంగాణలో రెండు దగ్గు మందుల అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రీలైఫ్, రెస్పీఫ్రెష్-టీఆర్ దగ్గు మందులను నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు దగ్గు మందులను విక్రయించొద్దని మెడికల్ షాపులకు, ఆసుపత్రులకు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రెండు దగ్గు మందుల్లోనూ కల్తీ జరిగినట్లు గుర్తించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కోల్డ్రిఫ్ దగ్గు మందుపై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు ఇప్పటికే కీలక హెచ్చరిక జారీ చేసింది కూడా. కోల్డ్రిఫ్ సిరప్ బ్యాచ్ నెంబర్ ఎస్ఆర్ 13 వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో దగ్గు మందు తాగిన చిన్నారులు మరణించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
06-10-2025 సోమవారం ( ఎలీ లిల్లీతో హైదరాబాద్ కు బూస్టప్ )
ఫార్మా రంగంలో దిగ్గజ సంస్థ ఎలి లిల్లీ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాల విస్తరణ కోసం 9 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈనెల 6న సమావేశమైన ఎలీ లిల్లీ ప్రతినిధి బృందం ఆ మేరకు అంగీకారం తెలిపింది. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎలీ లిల్లీ అండ్ కో ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్ సీఎంతో భేటీ అయ్యారు. ప్రపంచంలోనే పేరొందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎలి లిల్లీ. ఈ కంపెనీ తన కార్యకలాపాలను విస్తరించడానికి హైదరాబాద్ కేంద్రంగా కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. అందుకోసం ఒక బిలియన్ డాలర్లు అంటే సుమారు 9 వేల కోట్లు భారీ మొత్తాన్ని వెచ్చించనుంది. పెట్టుబడులతో వచ్చే కంపెనీలు, పరిశ్రమలకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తుందన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ ఇప్పటికే దేశంలోనే ఫార్మా హబ్‌గా ప్రఖ్యాతి పొందిందని, ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందన్నారు. 1965లో ఇందిరాగాంధీ ఐడీపీఎల్‌ను హైదరాబాద్‌కు తీసుకురావడంతో ఫార్మా రంగం విస్తరించిందని గుర్తుచేశారు. దేశంలో 40 శాతం బల్క్ డ్రగ్స్ హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. అమెరికాకు చెందిన ఎలి లిల్లీ కంపెనీకి 150 ఏళ్లుగా ప్రపంచ వ్యాపంగా మెడిసిన్స్ తయారీలో పెద్ద ఎత్తున పని చేస్తోంది. డయాబెటిస్, ఒబెసిటీ, ఆల్జీమర్, క్యాన్సర్, ఇమ్యూన్ వ్యాధులకు సంబంధించిన మెడిసిన్స్, కొత్త ఆవిష్కరణలపై R&Dని ఈ కంపెనీ చేస్తుంది. హైదరాబాద్‌లో ఈ ఏడాది ఆగస్ట్ లో గ్లోబల్ కెపాబులిటీ సెంటర్‌ను ఎలీలిల్లీ ప్రారంభించింది.
07-10-2025 మంగళవారం ( కొత్త రైల్వే లైన్ కు రెడీ )
తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త మార్గంలో రైల్వే లింక్ కోసం ప్రతిపాదిత కల్వకుర్తి – మాచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన చర్యలు స్పీడప్ అవుతున్నాయి. దీని ఫైనల్ లొకేషన్ సర్వేకు అనుమతివ్వాలని కోరుతూ రైల్వే బోర్డుకు దక్షిణ మధ్య రైల్వే లేఖ రాసింది. మొదట ఈ ప్రాజెక్టు దూరం 100 కిలోమీటర్లు, అంచనా వ్యయం 2 వేల కోట్లు కాగా.. తాజా అలైన్‌మెంట్‌తో దూరం 126 కిలోమీటర్లు అంచనా వ్యయం 2,520 కోట్లకు పెరిగింది. ఈ లెక్కన ఒక్కో కిలోమీటర్‌కు 20 కోట్లు అవుతుంది. తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ఏపీలోని మాచర్ల వరకు ఈ రైల్వే ప్రాజెక్టును మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి జులైలో రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే నుంచి రైల్వే బోర్డుకు లేఖ వెళ్లింది. కల్వకుర్తి-మాచర్ల ప్రతిపాదిత ప్రాజెక్టు మార్గంలో సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి కూడా ఉంది. దీంతో సర్వే కోసం ప్రాజెక్టు నిర్మాణ దిశగా కీలక ముందడుగుపడే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే 100 శాతం నిధులతో చేపట్టాలని సీఎం కోరారు. రెండు రాష్ట్రాలకు కలిపే లింక్ కావడంతో ఏపీతోనూ మాట్లాడాలని డిసైడ్ చేశారు.
08-10-2025 బుధవారం ( ఇంటింటికి ఫైబర్ నెట్ వర్క్ సక్సెస్ )
టీ-ఫైబర్ గ్రామాలు దేశానికే ఆదర్శమని కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రశంసించారు. టీ-ఫైబర్ మోడల్‌కు సంబంధించి లాస్ట్ మైల్ బ్రాడ్‌బాండ్ కనెక్టివిటీతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్-2025 కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలో సింధియా అధ్యక్షతన ఐటీ మంత్రుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కో ఛైర్మన్‌గా వ్యవహరించారు. తెలంగాణలో భారత్ నెట్‌ను మరింత వేగవంతంగా అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు శ్రీధర్ బాబు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా గ్రామీణ స్థాయిలో ప్రతీ ఇంటికి ఫైబర్ నెట్‌వర్కును తీసుకెళ్లడంలో తెలంగాణ ప్రభుత్వం విజయవంతమైందన్నారు. దీని ద్వారా గ్రామీణ ప్రజలకు ఈ గవర్నెన్స్, విద్య, వైద్యం, డిజిటల్ సేవలు మరింత అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
VO: 08-10-2025 బుధవారం ( సర్కార్ కు టుడేస్ ట్రావెలర్ అవార్డ్ )
ప్రతిష్ఠాత్మక ట్రావెల్ పబ్లికేషన్.. టుడేస్ ట్రావెలర్28వ వార్షిక అవార్డుల్లో తెలంగాణ ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని మరో మూడు ప్రైవేటు సంస్థలు పురస్కారాలను గెలుచుకున్నాయి. ఈనెల 8న ఢిల్లీలోని తాజ్ పాలెస్ హోటల్‌లో జరిగిన ఈ వేడుకలో పర్యాటక, ఆతిథ్య రంగాలకు సంబంధించి వివిధ కంపెనీలు, ప్రభుత్వాలకు దాదాపు 35 అవార్డులను ప్రదానం చేశారు. బతుకమ్మ పండుగను ప్రోత్సహించినందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఉత్తమ ప్రచార పురస్కారాన్ని పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ అందుకున్నారు. ఐటీసీ కోహినూర్, వెస్టిన్ హోటళ్లు, హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ తమ తమ విభాగాల్లో ఉత్తమ పనితీరు అవార్డులను సాధించాయి.
09-10-2025 గురువారం ( చైనా ప్లస్ 1 కేరాఫ్ తెలంగాణ )
పాలకులు మారినప్పుడల్లా ప్రభుత్వ విధానాలు మార్చుకోవాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 9న చెప్పారు. అమెరికా హడ్సన్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన 16 మంది ప్రతినిధులు సచివాలయంలో సీఎంతో సమావేశమయ్యారు. వివిధ రంగాలకు చెందిన మేధావులు, బిజినెస్ లీడర్లు ఈ బృందంలో ఉన్నారు. ఇండియా ఫౌండేషన్ సారథ్యంలో, భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార వాణిజ్య వ్యవహారాలు, విధానాలపై ఈ బృందం వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అభిప్రాయాలను స్వీకరిస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ అమెరికా తీసుకునే నిర్ణయాలు, అనుసరించే విధానాలన్నీ సానుకూల దృక్పథంతో, ఇండో-యూఎస్ సంబంధాలను మరింత పెంపొందించేలా ఉండాలని ఆకాంక్షించారు. హెచ్1-బీ వీసాలపై అమెరికా విధించిన కఠిన నిబంధనలపైన, సుంకాల పెంపుపైన సీఎం ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను ప్రభావం చే యడంతో పాటు అస్థిరతకు, అపార్థానికి దారి తీస్తాయన్నారు. అలాగే.. చైనా ప్లస్ వన్ వ్యూహానికి తెలంగాణ అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుందని రేవంత్ చెప్పారు.
09-10-2025 గురువారం (సరికొత్తగా హార్టికల్చర్)
కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన తెలంగాణ రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక–2035ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఉద్యాన పంటల ఉత్పత్తిని పెంచేందుకు 2035 వరకు అనుసరించాల్సిన లక్ష్యాలను ఈ ప్రణాళికలో నిర్ధేశించారు. సచివాలయంలో ఈనెల 9న సీఎం ఈ ప్రణాళికను ఆవిష్కరించారు. రాబోయే ఐదేళ్లలో 1.32 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు, 2.45 లక్షల ఎకరాల్లో కూరగాయల పంటల విస్తీర్ణం, దిగుబడులు, ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా ప్రణాళికలో పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో 921.40 కోట్లు సాగు పెట్టుబడిగా, అలాగే 942.50 కోట్లు డ్రిప్ కోసం పెట్టుబడిగా కేటాయిస్తే, ఒక్క రూపాయి పెట్టుబడికి నాలుగు రూపాయల లాభం పొందే అవకాశం ఉందని హార్టి కల్చర్ ప్రణాళికలో పేర్కొన్నారు.
09-10-2025 గురువారం ( మక్కలకు మార్క్ ఫెడ్ మద్దతు )
రైతులకు ప్రతి దశలో వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రజాప్రభుత్వం మక్క రైతుల కోసం ఈనెల 9న కీలక నిర్ణయాలు తీసుకుంది. బహిరంగ మార్కెట్లో మొక్కజొన్నల ధరలు పడిపోవడం, క్వింటాలుకు 500 రూపాయల దాకా నష్టపోతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరకు రైతుల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మక్కలు సేకరిస్తామని చెప్పారు. ఈనెల 9న సీఎం రేవంత్ తో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మక్కల ధరలు, కొనుగోళ్లపై చర్చించారు. దీంతో సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణలో మొత్తం 6,24,544 ఎకరాల్లో మొక్కజొన్న సాగైందని, సాగు పరిస్థితులు మెరుగవటంతో సగటున ఎకరానికి 18.50 క్వింటాళ్ల దిగుబడితో మొత్తం 11.56 లక్షల మెట్రిక్ టన్నుల పంట రానుందన్నారు. ప్రస్తుత మార్కెట్ ధరలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎమ్మెస్పీ 2,400 కంటే తక్కువగా ఉన్నాయన్నారు. అందుకే ఈ సీజన్‌లో మక్కల కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం 2,400 కోట్ల నిధులు సమకూరుస్తోంది.
10-10-2025 శుక్రవారం ( తెలంగాణ రైజింగ్ సర్వే )
తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ఎలా ఉండాలో జనం నుంచే సూచనలు సలహాలు కోరుతోంది రేవంత్ ప్రభుత్వం. తెలంగాణలో అభివృద్ధి ఎలా ఉండాలన్న విషయాలపై ప్రజా ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ రైజింగ్ విజన్–2047 పేరుతో మొత్తం 8 అంశాలపై ఈ సర్వే చేస్తోంది. ఈనెల 10వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ సర్వే అక్టోబర్ 25వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రజలు తమ విలువైన అభిప్రాయాలను ఆన్‌లైన్ ద్వారా ఇవ్వాలన్నది సర్కార్. తెలంగాణలోని ప్రతి పౌరుడి జీవన ప్రమాణాలను మెరుగుç³ర్చడమే ఎజెండాగా ఈ రైజింగ్ కాన్సెప్ట్‌ను ముందుకు తీసుకెళ్తోంది. భవిష్యత్ తెలంగాణ కోసం ఈ విజన్ అవసరమంటోంది. సర్వేలో భాగంగా 8 ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రతి ప్రశ్నకు కొన్ని సమాధానాలిచ్చి వాటిలో ఎలా వెళితే బాగుంటుందో సూచించాలంటోంది సర్కారు. 2047 నాటికి త్రీ ట్రిలియన్ ఎకనామీ సాధించడంలో భాగంగా ఉద్యోగాలకు అవసరమైన రంగాల్లో కోర్సులు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో నూతన ఆవిష్కరణలు, పారిశ్రామిక వాతావరణం కల్పనలో భాగంగా విధానాల్లో సంస్కరణల అమలు, యువత నాయకత్వంలో వ్యాపారాలు ఇలాంటివాటిపై సర్వేలో అడుగుతున్నారు. www.telangana.gov.in/telanganarising అన్న ప్రభుత్వ వెబ్ లింక్ లో ఈ ప్రశ్నలు ఉన్నాయి
11-10-2025 శనివారం ( పీఈటీ పోస్టుల భర్తీకి రెడీ )
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు స్పోర్ట్స్ ట్రైనింగ్ ఇచ్చేందుకు మరింత చొరవ తీసుకుంటోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పాఠశాలల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ నియామకానికి అధికారులు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలోని 4,641 హైస్కూళ్లలో 2,800కు పైగా స్కూళ్లల్లో పీఈటీలు ఉన్నారు. మిగిలిన బడుల్లో స్పోర్ట్స్ బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో కొత్తగా 1,803 పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం డిసైడైంది. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలను విద్యాశాఖ.. ప్రభుత్వానికి పంపింది. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన స్కూళ్లల్లో 261 హెడ్మాస్టర్ పోస్టులను కూడా భర్తీ చేయడానికి ప్రపోజల్ సిద్ధం చేశారు. ఈ పోస్టులను రాబోయే DSC నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఛాన్స్ ఉంది.
Also Read: ఈనెల 14న తెలంగాణ రాష్ట్రా బంద్.. ఎందుకంటే..?
11-10-2025 శనివారం ( గురుకులాలకు ఎమర్జెన్సీ ఫండ్ )
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పన కోసం ఎమర్జెన్సీ ఖర్చుల కింద ప్రభుత్వం కొంత నిధిని అందించింది. ఎస్సీ, బీసీ గురుకులాలకు 20 కోట్ల చొప్పున, ఎస్టీ, మైనార్టీ గురుకులాలకు 10 కోట్ల చొప్పున.. మొత్తం 60 కోట్లను సీఎంఆర్‌ఎఫ్ నుంచి కేటాయించింది. 2025-26 బడ్జెట్‌లో చేసిన కేటాయింపులకు ఈ నిధులు అదనం. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కలిపి 851 గురుకుల స్కూళ్లు, కాలేజీలు ఉండగా వాటిలో 4,89,916 మంది స్టూడెంట్స్, అలాగే 86 డిగ్రీ కాలేజీల్లో 68,500 మంది చదువుతున్నారు. పలుచోట్ల గురుకుల భవనాల్లో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతుండటం, టాయిలెట్ల రిపేర్లు చేయాల్సి వస్తుండటం ఇబ్బందిగా మారింది. ఈ అంశం సీఎం దృష్టికి వెళ్లడంతో ఇలాంటి చిన్న చిన్న సమస్యలతో పిల్లలకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. అందుకే వెంటనే ప్రస్తుత అవసరాల కోసం ఎమర్జెన్సీ ఫండ్ రిలీజ్ చేశారు.
Story By Vidya Sagar, Bigtv