Telangana: నల్లగొండ జిల్లాలోని చందనపల్లి అనే ఒక చిన్న గ్రామం.. ఇప్పుడు మృత్యు భయంతో వణికిపోతోంది. అందుకు కారణం.. మనుషులు పిట్టల్లా రాలిపోవడమే. అవును, మీరు విన్నది నిజమే. కేవలం 45 రోజుల వ్యవధిలో… ఒకరు కాదు, ఇద్దరు కాదు… ఏకంగా 20 మందికిపైగా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
ఒకరి తర్వాత ఒకరు… అంతుచిక్కని కారణాలతో మృత్యువాతపడుతున్నారు. ఆరోగ్యంగా తిరిగిన వారే, గంటల వ్యవధిలో విగతజీవులుగా మారుతున్నారు. దీంతో ఆ పల్లె మొత్తం భయం గుప్పిట్లో చిక్కుకుంది. అసలేం జరుగుతోంది? ఎందుకీ వరుస మరణాలు? కారణం ఏంటి? అని ప్రశ్నిస్తే… సమాధానం లేదు. కానీ, గ్రామస్థుల నోట మాత్రం అమావాస్య ప్రభావం, కీడు సోకిందనే మాటలు వినిపిస్తున్నాయి.
చందనపల్లి గ్రామంలో వరుస మరణాలు భయం పుట్టిస్తున్నాయి. 45 రోజుల వ్యవధిలోనే 20మందికి పైగా చనిపోయారు. చనిపోయిన వారంతా వయసు పైబడిన వారే. కాని అవి సహజ మరణాలా.. లేక అసహజ మరణాలా అన్నది తెలియడం లేదు. ఒకరి దినం వెళ్లకముందే మరొకరు మృత్యువాతపడుతున్నారు. ఇలా వరుసగా ఎందుకు జరుగుతుందనే చర్చ గ్రామంలో మొదలైంది. అసలే గ్రామంలో మూఢనమ్మకాలకు తోడు వాట్సప్ గ్రూప్ లలో ఈ విషయం వైరల్ అవుతుండటంతో రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. గ్రామానికి కీడు వచ్చిందని కొంతమంది.. ఆదివారం అమావాస్య నాడు మొదటి చావు రావడంతో ఇలా అవుతుందని మరికొంతమంది చెబుతున్నారు. ఇంతకీ ఆ గ్రామంలో ఏం జరుగుతోంది. వరుస మరణాలకు కారణం ఏంటి.. గ్రామస్తులు చెబుతున్నదెంటి?
వరుస మరణాలతో ఆ గ్రామం భయం గుప్పిట్లోకి వెళ్లింది. ఎప్పుడు ఎవరి మరణవార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. కొందరు వనవాసం చేయాలని చెబితే.. మరికొందరు పూజలు చేయాలని చెబుతున్నారు. ఏ ఇద్దరు కలిసినా దీని గురించే చర్చించుకుంటున్నారు. ఇలా వరుస మరణాలతో గ్రామపెద్దలు అలర్ట్ అయ్యారు. పంతులు సూచనతో హోమం చేద్దామని అనుకుంటున్నట్టు గ్రామ పెద్దలు చెబుతున్నారు. గ్రామంలోని పతి వాడలో ఒక శ్రద్ధాంజలి ఫ్లెక్సీ దర్శనమిస్తుందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి.
చందనపల్లి గ్రామస్తులు.. ఉదయసముద్రం ప్రాజెక్టు భూనిర్వాసితులు. ప్రాజెక్టు కింద భూమి కోల్పోవడంతో ఇక్కడికి వచ్చి ఇళ్లు కట్టుకోని ఉంటున్నారు. ఇన్నేళ్లుగా గతంలో ఇలా ఎప్పుడు జరగలేదంటున్నారు. ఆదివారం అమవాస్య రోజు తొలి చావు గ్రామంలో జరిగిందని.. అప్పటి నుంచి చావులు ఆగడం లేదంటున్నారు గ్రామస్తులు.
Also Read: హమాస్ VS ఇజ్రాయెల్.. గాజాలో శాంతి నెలకొంటుందా?
గ్రామంలో వరుస మరణాలకు.. కీడు సోకిందని కొంతమంది అనుకుంటున్నారు. గ్రామానికి అనుకోని ఉన్న డంప్ యార్డ్ వల్లే వృద్ధులు చనిపోతున్నారని మరికొందరు చెబుతున్నారు. రాత్రి కాగానే డంప్ యార్డ్ మంటల నుంచి వెలువడే పొగతో రోగాల బారి పడి చనిపోతున్నారని అంటున్నారు. ఏదిఏమైనా చందనపల్లి చావుకేకలకు ప్రభుత్వ అధికారులు కారణం వెతకాల్సిన అవసరం ఉంది. గ్రామస్తుల డౌట్లను క్లారిఫై చేయాల్సిన ఆవశ్యకత ఉంది.