Hyderabad Water Cut: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో.. రాబోయే రెండు, మూడు రోజులు మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్–3లో భాగంగా.. నిర్వహించాల్సిన అత్యవసర మరమ్మత్తు పనుల కారణంగా.. అంతరాయం ఏర్పడనుంది. నగరానికి నీటిని సరఫరా చేస్తున్న కోదండాపూర్ నుంచి గొడకొండ్ల వరకు ఉన్న ప్రధాన పైప్‌లైన్‌లో భారీ నీటి లీకేజీ గుర్తించడంతో.. మరమ్మత్తు పనులను చేపట్టనున్నారు.
ఈ పనులు అక్టోబర్ 13వ తేదీ సోమవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమై, అక్టోబర్ 14వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగుస్తాయని అధికారులు తెలిపారు. అంటే మొత్తం 36 గంటలపాటు ఈ పైప్‌లైన్‌పై నీటి సరఫరా నిలిపివేయబడనుంది. ఈ సమయంలో ఎయిర్ వాల్వ్‌లు, గేట్ వాల్వ్‌లు, అలాగే సరిగా పనిచేయని పాత వాల్వ్‌లను మార్చే పనులు కూడా నిర్వహించనున్నారు.
ఈ మరమ్మత్తు పనుల ప్రభావం కృష్ణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఫేజ్–3 రింగ్ మెయిన్–1 పరిధిలోని పలు రిజర్వాయర్లపై పడనుంది. దీంతో ఆ రిజర్వాయర్లకు అనుసంధానమైన పలు ప్రాంతాల్లో.. నీటి సరఫరా నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు.
నీటి సరఫరా అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
1. గచ్చిబౌలి, కొండాపూర్, మాధాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్.
2. ప్రశాసన్ నగర్, ఫిల్మ్‌నగర్, జూబ్లీ హిల్స్, తట్టి ఖానా, భోజగుట్ట, షేక్‌పేట్, హకీంపేట్, కర్వాన్, మెహిదీపట్నం, ఆసిఫ్‌నగర్, గోల్కొండ, లంగర్ హౌస్.
3. దుర్గా నగర్, బుద్వెల్, సులేమాన్ నగర్, గోల్డెన్ హైట్స్, 9 నంబర్, కిస్మత్‌పూర్, గంధంగూడ, బండ్లగూడ, శాస్త్రిపురం, అల్లబండ, మధుబన్, ధర్మసాయి (శంషాబాద్).
4. సాహేబ్‌నగర్, ఆటోనగర్, సరూర్‌నగర్, వాసవి నగర్, నాగోల్, ఎన్‌టీఆర్ నగర్, వనస్థలిపురం, దేవేందర్ నగర్, ఉప్పల్.
5. స్నేహపురి, భారతనగర్, రాంపల్లి, బోడుప్పల్, చెంగిచెర్ల, మానిక్ చంద్, మల్లికార్జున నగర్, పీర్జాదిగూడ, పెద్దఅంబర్‌పేట్ పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది.
ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలను ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా నీటిని నిల్వ చేసుకోవాలి, అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడాలి అని సూచించారు. నీటి వినియోగంలో పొదుపు పాటిస్తే ఇబ్బందులు తక్కువగా ఉంటాయని తెలిపారు. మరమ్మత్తు పనులు పూర్తయ్యాక సరఫరా పునరుద్ధరించబడుతుందని, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా తాత్కాలిక నీటి సరఫరా ఏర్పాటు చేయబడుతుందని అధికారులు వివరించారు.
Also Read: బీచ్‌లో విషాదం.. ఐదుగురు మృతి
హైదరాబాద్ నగర ప్రజలు ఈ రెండు రోజులు నీటి వినియోగంపై జాగ్రత్తగా ఉండాలని, అత్యవసర అవసరాలకే నీటిని వినియోగించుకోవాలని బోర్డు మరోసారి కోరింది.