Ponguleti Srinivas Reddy: ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి సంబంధించి గణనీయమైన, చారిత్రాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యను అత్యున్నత ప్రాధాన్యత అంశంగా తీసుకుని.. విప్లవాత్మక నిర్ణయాలకు శ్రీకారం చుట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థను ఆధునికీకరించడమే లక్ష్యంగా.. ప్రభుత్వం ముందుకెళ్తోందని ఆయన తెలిపారు.
గడిచిన రెండేళ్లుగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అనే ధ్యేయంతో.. తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధి నుంచి ఉపాధ్యాయుల నియామకం, డిజిటల్ లెర్నింగ్, నైపుణ్యాధారిత విద్య వరకు విద్యారంగంలోని ప్రతి విభాగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివరించారు. విద్య అనేది కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, జీవిత నైపుణ్యాలను అందించే విధంగా ఉండాలనే దిశగా పాలన సాగుతోందన్నారు.
బ్రెయిన్ ఫీడ్ గ్రూప్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హైటెక్స్‌లో నిర్వహించిన.. ET TECH X – 6వ ఎడిషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేటి వేగంగా మారుతున్న విద్యా ప్రపంచంలో టెక్నాలజీ పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ET TECH X వంటి వేదికలు టెక్నాలజీ, విద్య సమన్వయంతో భవిష్యత్తును ఎలా నిర్మించాలో దిశానిర్దేశం చేస్తున్నాయని ఆయన ప్రశంసించారు.
సామాజిక సమానత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులందరూ కుల, మత భేదాలకు అతీతంగా ఒకే క్యాంపస్‌లో అన్ని సౌకర్యాలతో కలిసి చదువుకునేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 105 యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.21,000 కోట్ల భారీ పెట్టుబడిని కేటాయించింది. ప్రతి పాఠశాలను సుమారు 25 ఎకరాల విశాల ప్రాంగణంలో, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో నిర్మించనున్నట్లు వెల్లడించారు.
ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టితో.. 2024 డీఎస్సీ ద్వారా పది వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం జరిగిందని మంత్రి గుర్తుచేశారు. అలాగే 2024 సెప్టెంబర్ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని అమలు చేస్తున్నామని, దీనికోసం ప్రభుత్వం సంవత్సరానికి సుమారు రూ.140 కోట్ల వ్యయాన్ని భరిస్తోందని తెలిపారు.
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల (AAPCs) ద్వారా రాష్ట్రవ్యాప్తంగా.. రూ.642 కోట్ల వ్యయంతో 59 వేల మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేసినట్లు చెప్పారు. పాఠశాలల పరిశుభ్రత, తరగతి గదుల మరమ్మతులు, నిర్వహణ బాధ్యతలను కూడా AAPCsకి అప్పగిస్తూ సుమారు రూ.146 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించిందన్నారు. దీని వల్ల పాఠశాలల నిర్వహణలో పారదర్శకత పెరిగిందని తెలిపారు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని.. ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి వెల్లడించారు. ఈ యూనివర్సిటీ ఈ సంవత్సరం నుంచే స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను ప్రారంభించనుందని, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చి యువతకు తక్షణ ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. అదే విధంగా ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: ఝాన్సీ రెడ్డిపై తిరగబడ్డ సొంత నేతలు.. అయోమయంలో యశస్విని రెడ్డి
విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా తెలంగాణను క్రీడల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఇది చారిత్రాత్మక ముందడుగుగా ఆయన అభివర్ణించారు. ఈ అన్ని చర్యల వల్ల విద్యార్థులకు విస్తృత అవకాశాలు, యువతకు బలమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రాష్ట్రంలో వృత్తి ఆధారిత విద్యకు పటిష్టమైన పునాది పడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.