బీఆర్ఎస్ పార్టీకి త్వరలోనే భారీ షాక్ తగలనున్నట్టు తెలుస్తున్నది. గతంలో పదేండ్ల పాటు మంత్రిగా పనిచేసి ఆ పార్టీకి నగరంలో కీలక నేతగా ఉన్న ఆయన పార్టీని వీడుతారనే ప్రచారం జోరుందుకుంది. గతంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చినా మాజీ మంత్రి పెద్దగా స్పందించలేదు. కానీ, ఈసారి ఆయన కుటుంబీకులు సైతం బీఆర్ఎస్ పార్టీని కాకుండా ఓ జాతీయ పార్టీ గురించి పాజిటివ్‌గా ప్రస్తావించడంతో దీనిపై మరోమారు ఊహగానాలు ప్రారంభం అయ్యాయి.కానీ, ఇవి కేవలం స్పెక్యులేషన్ అని కొట్టిపారేయడానికి వీల్లేదని సైతం టాక్ వినిపిస్తోంది. అందుకు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులే అని ప్రచారం జరుగుతోంది.
గతంలో సదరు నేత తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన గులాబీ పార్టీలో చేరారు. ఆ తర్వాత కేసీఆర్ మొదటి సారి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రెండోసారి కారుపార్టీ అధకారంలోకి రాగా.. అప్పుడు సైతం కేసీఆర్ ఆయనకు మరోసారి మంత్రి పదవి కట్టబెట్టారు.ఇలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉన్నది. అంతేకాకుండా, వ్యాపార సామ్రాజ్యంలోనూ ఆయన కింగ్.. ఎన్నో ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు ఆయన సొంతం.దీనికి తోడు ఓటమి ఎరుగని మాస్ లీడర్.. ఇలాంటి బడా లీడర్ పార్టీని వీడితే గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్‌కు భారీ షాక్ తప్పదని తెలుస్తున్నది.
మాజీ మంత్రి అల్లుడు సైతం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం పార్టీ అధికారంలో లేనందున ఇద్దరూ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఒకరేమో మేడ్చల్, మరొకరు మల్కాజిగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారెవరో కాదు.. మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రిరాజశేఖర్ రెడ్డి. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మల్లారెడ్డి పార్టీ మారే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆయన రిటైర్మెంట్ తీసుకుంటారని సైతం టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన కోడలు త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని కూడా టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఆమె తరచూ మీడియా ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం మల్లారెడ్డి వ్యాపార లావాదేవీలను ఆమె చక్కదిద్దుతున్నట్టు తెలుస్తుండగా..పొలిటికల్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.
Hyderabad: నార్సింగిలో దారుణం.. చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం, ఆపై హత్య
ఇటీవల ఆమె ఓ సందర్భంలో మాట్లాడుతూ.. కేంద్రంలో ప్రధాని మోడీ పాలన, పథకాలను మెచ్చుకున్నారు.జాతీయ విద్యావిధానంపై ప్రశంసలు కురిపించారు.. ఆ మధ్యకాలంలో మల్లారెడ్డి సైతం బీజేపీ పెద్దలతో టచ్‌లోకి వెళ్లినట్టు టాక్ వచ్చింది. ప్రస్తుతం మామ అల్లుళ్లు ఒకే పార్టీలో ఉన్నందున కోడలిని జాతీయ స్థాయిలో పలుకుబడి ఉన్న బీజేపీలోకి పంపిస్తారా? అన్న చర్చ జరుగుతున్నది.లేదా ఫ్యామిలీ మొత్తం ఒకే పార్టీలోకి వెళితే పదవుల దగ్గర క్లాష్ వస్తుందని ఆలోచిస్తున్నారా? అనే టాక్ సైతం పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్నది. ఏదేమైనా మల్లారెడ్డి పార్టీ మారుతాయరని ప్రచారం జరుగుతుండగా..దాన్ని ఆయన ఖండించినట్టు సైతం కథనాలు వచ్చాయి.