HYDRA Prajavani: ప్రభుత్వ భూములపై కన్నేసిన కబ్జాదారులు, అక్రమార్కుల ఆగడాలు రోజురోజుకు పెచ్చరిల్లుతున్నాయి. ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంది? ఎక్కడ లిటిగేషన్‌లో ఉన్న స్థలాలు ఉన్నాయి? ఏ భూములపై వివాదాలు కొనసాగుతున్నాయన్న సమాచారాన్ని ముందుగానే సేకరించి, ఆపై వాటిని గుట్టుచప్పుడు కాకుండా కబ్జా చేసే వ్యవస్థబద్ధమైన ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పలువురు బాధితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కేసులు దశాబ్దాలుగా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా కొందరు కబ్జాదారులు అమ్మకాలు, నిర్మాణాలకు తెగబడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వానికి చెందిన స్థలాలు, పార్కులు, నాలాలు, రహదారుల పక్కన ఉన్న ఖాళీ భూములు కూడా అక్రమార్కుల లక్ష్యంగా మారుతున్నాయి. ప్లాట్లుగా విడగొట్టి అమ్మకాలు చేయడం, అనుమతులు లేకుండా ఇళ్లు, షాపులు, ఫంక్షన్ హాళ్లు నిర్మించడం వంటి అక్రమ వ్యవహారాలు విస్తృతంగా జరుగుతున్నాయని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ వంటి రెగ్యులరైజేషన్ అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం కబ్జా చేసిన భూములను సొంతం చేసుకోలేకపోతున్నా, అదే అవకాశం లభిస్తే నగరంలో ఖాళీ స్థలాలు కనపడేవే కావని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చెరువులు, నాలాలు, వర్షపు నీటి కాలువలు కూడా కబ్జాలకు గురవుతున్నాయని, ప్రజల అవసరాలకు ఉపయోగపడాల్సిన స్థలాలను కూడా వదలకుండా ఆక్రమిస్తున్నారని హైడ్రా ప్రజావాణిలో ఆవేదన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కరోజే హైడ్రా ప్రజావాణికి మొత్తం 47 ఫిర్యాదులు అందాయి. వీటిని హైడ్రా అడిషనల్ డైరెక్టర్ శ్రీ వర్ల పాపయ్య పరిశీలించి, సంబంధిత శాఖ అధికారులకు పరిష్కార బాధ్యతలు అప్పగించారు.
గండిమైసమ్మలో 353 ఎకరాల ప్రభుత్వ భూమిపై వివాదం
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా గండిమైసమ్మ మండలం బహదూర్‌పల్లి గ్రామంలోని సర్వే నంబర్ 227లో దాదాపు 353 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఈ భూమిని ఓ కంపెనీతో పాటు కొందరు సొసైటీ సభ్యులు కబ్జా చేశారంటూ గతంలో ప్రజాప్రతినిధిగా వ్యవహరించిన వ్యక్తి హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు చేశారు. ఈ భూమి ప్రభుత్వానిదేనని అప్పట్లో జాయింట్ కలెక్టర్ కూడా ధ్రువీకరించినప్పటికీ, హైకోర్టు సూచనల మేరకు మరోసారి సర్వే నిర్వహించి గత నెలలో మళ్లీ అదే నివేదికను కోర్టుకు సమర్పించారు. అయినప్పటికీ కోర్టు కేసు పెండింగ్‌లో ఉండగానే అక్కడ ఇళ్లు నిర్మించడం, ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసి భారీగా అద్దెలు వసూలు చేయడం జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాలాలు పూడ్చడంతో వరద నీటి సమస్య
కీసర మండలం నాగారం మున్సిపాలిటీలో వెస్ట్ గాంధీ నగర్‌తో పాటు పరిసర కాలనీల వర్షపు నీరు కోమటి కుంటకు వెళ్లే సహజ నాలాను కొందరు వ్యక్తులు పూడ్చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నాలా ఆనుకుని ఉన్న 4 వేల గజాల ప్లాట్‌ను కొనుగోలు చేసిన వారు గతంలో ఉన్న ఒప్పందాలను పట్టించుకోకుండా కాలువను ధ్వంసం చేయడంతో మొత్తం కాలనీలు ముంపునకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పాత నాలాను పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
సరూర్‌నగర్‌లో అక్రమ దుకాణాలు
రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం శ్రీ రమణ కాలనీ సర్వే నంబర్ 60లో ప్రభుత్వ భూమిలోకి చొరబడి ఎనిమిది దుకాణాలు నిర్మించి వ్యాపారాలు సాగిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే సంబంధిత శాఖలకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన సుమారు 700 గజాల స్థలాన్ని పూర్తిగా ప్రభుత్వ వినియోగానికి కేటాయించాలని వారు కోరుతున్నారు.
పోచారంలో ప్రజావసర స్థలాలపై కబ్జా
పోచారం మున్సిపాలిటీలోని ఏకశిలా నగర్ కాలనీలో పార్కులు, పోలీస్ స్టేషన్, పోస్టాఫీసు తదితర ప్రజావసర స్థలాలు అక్రమార్కుల చేతుల్లోకి వెళుతున్నాయని స్థానిక నివాసితులు ఫిర్యాదు చేశారు. 50 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డును సుమారు 15 అడుగుల మేర కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు.
ప్రభుత్వ భూముల రక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హైడ్రా అధికారులు సమగ్ర విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.