Hyderabad Rains: నైరుతి రుతుపవనాలు చురుకుగా ముందుకు కదులుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో పాటు.. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలతో పాటు.. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఉదయం నుంచి వీస్తున్న చల్లని గాలులను హైదరాబాదీలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చెట్ల కింద ఉంటే పిడుగులు పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఇంట్లోనుంచి బయటికి రావొద్దని అధికారులు సూచించారు.
హైదరాబాద్, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, మెదక్, జోగులాంబ గద్వాల్ జిల్లాల అంతటా.. గాలి వేగం గంటకు 40-50 కిలోమీటర్లతో కూడిన వర్షాలు.. కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు సూచించారు.
వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో అకస్మాత్తుగా కురిసిన వర్షం రైతులను ఆగం చేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం వర్షార్పణమైంది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది.తాండూరు మండలంలోని అంతారం, దస్తగిరిపేట్, చెంగోల్, గోనూర్, వీరారెడ్డిపల్లి తదితర గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయానికి తీసుకవచ్చిన ధాన్యాన్ని ఆరబెట్టారు.
బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా వర్షం కురిసింది. కొద్దిపాటి వర్షానికే కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం, బస్తాలు తడిసిపోయాయి. ధాన్యం తడవకుండా ఉండేందుకు రైతులు అవస్థలు పడ్డారు.అయినప్పటికీ ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని విజ్ఙప్తి చేస్తున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రక్షణకు వసతులు, సౌకర్యాలు కల్పించలేదని విమర్శలు వెలువెత్తాయి.
మరోవైపు ఏపీలో ఎండలు, వానలు కుమ్మేస్తున్నాయి. టెంపరేచర్‌లు 44 డిగ్రీలకు చేరువలో నమోదవుతున్నాయి. నేడు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వడగాలులు, పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో నేడు అల్లూరి, మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో.. పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. అలాగే ఇవాళ 41-43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశం ఉంది.
Also Read: సరస్వతి పుష్కరాలకు సీఎం రేవంత్.. కాళేశ్వరంలో ఘనంగా ఏర్పాట్లు
ప్రస్తుతం అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు కాలువలు పొంగిపొర్లుతున్నాయి. అయితే అనంతపురం సిటీలో వాగుకు అడ్డంగా కాంపౌండ్ కట్టడంతో నీటి ప్రవాహం దారిమళ్లింది. పలు చోట్ల చెరువులకు, కాలువల ద్వారా వర్షం నీరు వెళ్తుంది. చెరువులు నిండే అవకాశం ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.