రైల్వేలో ఫస్ట్ ఏసీ కోచ్ లో ప్రయాణం అంటే మధ్యతరగతి వారు సాహసించరు. ఉన్నత ఆదాయ వర్గాల వారే ఏసీలో, అందులోనూ ఫస్ట్ ఏసీని ఎంపిక చేసుకుంటారు. మరి అలాంటి వారి ప్రవర్తన ఎంత హుందాగా ఉండాలి. కానీ హుందాగా ఉండటం, డబ్బులు సంపాదించినంత సులభం కాదని ఓ కుటుంబం నిరూపించింది. పురుషోత్తమ్ ఎక్స్ ప్రెస్ లో బెడ్ షీట్లు, టవళ్లు దొంగతనం చేసి ఇలా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది.
రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు..
పూరీ నుంచి ఢిల్లీ వెళ్లై పురుషోత్తం ఎక్స్ ప్రెస్ లో ఈ ఘటన జరిగింది. ఈ ఎక్స్ ప్రెస్ లో ఫస్ట్ ఏసీ కంపార్ట్ మెంట్ లో ఓ కుటుంబం ప్రయాణించింది. వారు తమ స్టేషన్లో దిగే సమయంలో రైలులోని దుప్పట్లు, టవళ్లను బ్యాగుల్లో సర్దేసుకున్నారు. ఈ విషయాన్ని ఒక అటెండెంట్ గమనించాడు. ఆ కుటుంబం ప్లాట్ ఫామ్ పైకి రాగా టీటీఈతో విషయం చెప్పాడు. దీంతో టీటీడీ వారి బ్యాగుల్ని తనిఖీ చేశాడు. ఇంకేముంది. అందులో రైల్వే ముద్ర వేసిన టవళ్లు, దుప్పట్లు బయటపడ్డాయి. ఏంటిదని అడిగితే ఆ కుటుంబం తెల్లమొఖం వేసింది. ఆ తర్వాత తన తల్లిపై నింద వేసి తప్పించుకోవాలనుకున్నాడు కొడుకు. తన తల్లి తెలియక ఆ దుప్పట్లను బ్యాగుల్లో సర్దేసిందని అన్నాడు. మొత్తానికి రైల్వేకి చెందిన దుప్పట్లు, టవళ్లను ఆ కుటుంబం తిరిగిచ్చేసింది.
వైరల్ వీడియో..
ఈ సంఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక ఆ వీడియో కింద కామెంట్లు మరింత వైరల్ గా మారాయి. చాలామంది ధనవంతులకు ఇలాంటి చీప్ బుద్ధులు ఉంటాయని ఒకరు కామెంట్ చేశారు. తాను కూడా చాలామందిని చూశానని, వారు హోటల్ రూమ్స్ అద్దెకు తీసుకుని తిరిగి వచ్చేటప్పుడు సామాన్లు, దొంగతతనం చేస్తుంటారని మరొకరు బదులిచ్చారు. డబ్బుతో సంబంధం లేకుండా చాలామంది తమ స్వభావాన్ని ఇలా బయటపెట్టుకుంటారని అంటున్నారు. మరికొందరు ఆ కుటుంబంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారినుంచి దుప్పట్లు, టవళ్లను తిరిగి తీసుకోవడంతోపాటు జరిమానా కూడా విధించాల్సిందని, అప్పుడే అలాంటి వారికి బుద్ధి వస్తుందని అన్నారు.
Traveling in 1st AC of Purushottam express is a matter of pride itself.
But still people are there who don't hesitate to steal and take home those bedsheets supplied for additional comfort during travel. pic.twitter.com/0LgbXPQ2Uj
— ଦେବବ୍ରତ Sahoo 🇮🇳 (@bapisahoo) September 19, 2025
ఎందుకిలా?
రైల్వే ఆస్తి ప్రజలది. దాన్ని దుర్వినియోగం చేయడం, నష్టపరచడం, దొంగతనం చేయడం సరికాదు. ఈ విషయం అందరికీ తెలుసు. చదువుకున్నవారికి ఇది మరింతబాగా తెలుసు. ఒకవేళ తప్పుచేస్తే జరిగే పరిణామాలు కూడా తెలుసు. కానీ ఏసీ కోచ్ లలో ప్రయాణించేవారు చాలామంది ఇలాంటి పనులకు అలవాటు పడుతుంటారు. రైల్వే దుప్పట్లను ఇంటికి తెచ్చుకుంటారు. పోనీ వారు పేదవారా, ఇంట్లో దుప్పట్లు కూడా లేనివారా అంటే కాదు. లక్షాధికారులు కూడా ఇలాంటి పనులు చేస్తుంటారు. అయితే ఇక్కడ ఈ కుటుంబం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడే సరికి విషయం బయటకొచ్చింది. ఇలాంటివారు చాలామందే ఉంటారని, వారంతా బయటపడకుండా దొంగతనాలు చేస్తుంటారని అంటున్నారు. ఇక్కడ రైల్వే కూడా జాగ్రత్తగా వ్యహరించాల్సి ఉంటుంది. కానీ అన్ని సందర్భాల్లో రైల్వే సిబ్బంది ఇలా దొంగల్ని పట్టుకోలేరు. అందుకే ఇలాంటి దొంగతనాలు సైలెంట్ గా జరిగిపోతుంటాయి.