Telangana: ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడా?.. ఉంటే ఆయన మార్క్ పార్టీపై ఏ మాత్రం ప్రభావం చూపుతోంది? జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ తాతా మధు అసలు జిల్లాలో క్యాడర్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారా? లేక తన వ్యాపారాలను చక్కబెట్టుకొనేందుకే పరిమితం అవుతున్నారా? .. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఉన్నా పార్టీ శ్రేణులకు ప్రయోజనం ఏంటి అన్న చర్చ గట్టిగానే నడుస్తోంది.? ఆ పదవితో ఎవరికి లాభం? పార్టీకా? తాతా మధు వ్యాపారాభివృద్ధికా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఖమ్మం జిల్లా గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది?
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ తాతా మధు ఉన్నా లేనట్టుగానే ఉందని పార్టీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుంచి ఆయన పెద్దగా జిల్లాలో పర్యటించిన దాఖలాలు కూడా లేవంట. మరోవైపు చెల్లాచెదురు అవుతున్న క్యాడర్‌ను కాపాడుకోలేక పోతున్నారనే అపవాదును ముటకట్టుకుంటున్నారు.. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత జిల్లా అధ్యక్షుడు పెద్దగా పార్టీ కార్యక్రమాలను నిర్వహించకపోవడం , కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడంతో.. అసలు జిల్లాకు బీఆర్ఎస్ అధ్యక్షుడు ఉన్నాడా?. ఉంటే ఆయన మార్క్ ఏది అనే చర్చ నడుస్తోంది.
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ వర్సెస్ తాతా మధు విభేదాలు
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ వర్సెస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు నడుమ కొన్నాళ్ళు సైలెంట్ వార్ నడిచి అ కాస్తా రానురాను వైలెంట్ గా మారిందట.. దీంతో గడిచిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జరగాల్సిన నష్టమంతా జరిగిపోయిందట.. అయిన కానీ అధ్యక్షుడు తీరులో ఏలాంటి మార్పు లేదంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఐదు నియోజక వర్గాలు ఉంటే .. 2023 సవంత్సరం నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవలేక ఘోరంగా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆఖరికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కూడా పరాజయం పాలయ్యారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ కొట్టిన జిల్లా ఓటర్లు
గతేడాది జరిగిని పార్లమెంటు ఎన్నికల్లో కూడా కారు పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టి విలక్షణ తీర్పు చెప్పారు జిల్లా ప్రజలు.. దీంతో ఆ పార్టీ క్యాడర్ అంతా చల్లచెదురైపోతోంది. ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ హోదాలో ఉన్న తాత మధు నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో వైఫల్యం చెందినట్లు సొంత పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. మధు వ్యవహార శైలితో కొన్ని చోట్ల గ్రూపులుగా ఏర్పడడం వలనే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి కారణమని గుర్తించి, తాత మధు వ్యవహార శైలి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికి నేతలు అప్పుడే పార్టీ అధినేతకు ఫిర్యాదు చేశారట.
మధుపై ఫిర్యాదులను పట్టించుకోని అధిష్టానం
అ సమయంలో రాష్ట్రం లో కారుపార్టీకి బ్రేకులు వేసిన రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి పట్టం కట్టారు. దీంతో షాక్ లో ఉన్న గులాబీ పార్టీ అధిష్టానం ఖమ్మం జిల్లా పార్టీ నేతలు చేసిన ఫిర్యాదును పెద్దగా పట్టించుకోలేదట. ఇక దాన్నే అవకాశంగా మార్చుకున్న తాత మధు.. ఇంకేముంది నాకు పార్టీ బాస్ ఫాం హౌస్ లో మంచి పలుకుబడి ఉంది.. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన డోంట్ కేర్ అంటూ తన ఒంటెద్దు పోకడలను కొనసాగిస్తున్నారట .. జిల్లా అధ్యక్షుడు ప్రవర్తనలో ఎలాంటి మార్పులు లేకపోవడం, పైగా జిల్లాకు నేనే సుప్రీం అన్నట్లు ద్వంద వైఖరి నిర్ణయాలతో పార్టీ పరిస్థితిని మరింత డ్యామేజ్ చేస్తున్నారంట
వరుసగా కాంగ్రెస్‌లో క్యూ కడుతున్న జిల్లా గులాబీ నేతలు
ఇంకో వైపున ఇప్పటికే జిల్లాలో డీసీసీబీ, డీసీఎంఎస్, పీఏసీఎస్ చైర్మన్‌లతో పాటు ఖమ్మం కార్పొరేషన్ చైర్మన్ కూడా గులాబీ పార్టీని వీడి అధికార పార్టీలోకి క్యూ కట్టారు. ఆ సమయంలో కూడా పార్టీ అధ్యక్షుడు ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టక పోవడం తీవ్ర విమర్శల పాలవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లో కి వచ్చి 19 నెలలు గడుస్తున్న నేపధ్యంలో.. ప్రజా సమస్యలపై దృష్టి సారించి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నా, మధు తనకేమి పట్టనట్టు ఉండడం తో అసలు ఆయన వ్యహర తీరుపై.. పార్టీలో దిగువ శ్రేణినేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధిష్టానం ఆశీస్సులున్నాయని చెలరేగిపోతున్న మధు
ఎవరు ఏమైపోతే నాకేంటి.. నాకు జిల్లా అధ్యక్షుని హోదాతో పాటు ఎమ్మెల్సీ ఉంది? పైగా అధిష్టానం ఆశీస్సులు కూడా ఉన్నాయని తాతా మధు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారంట. తనపై వ్యతిరేక రాగాలు వినిపిస్తున్నా నో ప్రాబ్లెమ్ అనే విధంగా ఆయన తీరుందట. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఓటమి చెందిన తర్వాత… జిల్లా అధ్యక్షుడు నియోజకవర్గాలకు వస్తున్నాడాంటేనే మాజీలు కన్నెర్ర జేస్తూ అందుబాటులో ఉండకపోవడమే కాకుండా, కనీసం దిగువ స్థాయి కేడర్ను కూడా ఆయన ప్రోగ్రాంకు వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తున్నారట.. ఖమ్మం జిల్లా అంటేనే ఉద్యమాలకు పుట్టినిల్లు లాంటిది.. రాష్ట్రంలో ఏదైనా ఉద్యమం లేదా కొత్తగా వచ్చిన పార్టీకి ఆదరణ కల్పించాలన్నా, ఓ వ్యక్తిని అందలం ఏక్కించాలన్నా, దింపాలన్నా.. రాజకీయ ఉనికే లేకుండా చేయాలన్నా ఖమ్మం జిల్లా ప్రజలకే సాధ్యం. ఒక్కసారి కమిట్ అయ్యారంటే చాలు ఎందాకైనా వెళ్తుంటారు.. అలాంటి చరిత్ర ఉన్న జిల్లాలో ఓ పార్టీకి, అందులోనూ పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌కి అధ్యక్షుడిగా కొనసాగాలంటే వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, కార్యకర్తలతో ఇతర పార్టీ నేతల తో మంచి సంబంధాలు, ఓర్పు నేర్పు అవసరం. కానీ ఈ క్వాలిటీస్‌లో ఏవీ కూడా తాతా మధుకి లేకపోవడంతోతో ఇంకా ఎన్నాళ్లు భరించాలి.. ఈ నేతను పల్లకిలో పెట్టీ ఇంకా మోయాల్సిందేనా? అని గులాబీ క్యాడర్ భగ్గుమంటోంది. మండల, జిల్లా నేతల వరకు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారంట.
వలస నేతకు సముచిత స్థానం కల్పించిన గులాబీ అధిష్టానం
ఆ క్రమంలో జిల్లా బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు మధుని మార్చాలన్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ప్రజాదరణ, రాజకీయ అనుభవం లేకపోయినా కానీ వలస వచ్చిన నేతకు పార్టీ సముచిత స్థానం కల్పించింది.. కానీ వారి ఆశలకు ఆశయాలకు గండి కొట్టడంలో తాతా మధు మొదటి వరుసలో ఉన్నారట. ఆ పార్టీ లో కానీ జిల్లాలో తనకంటూ సొంతగా క్యాడర్ ఏర్పాటు చేసుకోవడంలో విఫలం చెందారట..పైగా ప్రజల్లో ఆదరణ కూడా అంతంత మాత్రంగానే ఉందని ఆ పార్టీ లో టాక్. మరి కొన్ని రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయన సారథ్యంలో అసలు బోణీ చేయగలుగుతామా అని గులాబీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
తాతా మధుతో ఎవరికి ఉపయోగం అంటున్న క్యాడర్
ఒకవైపున మాజీ ఎమ్మెల్యేలతో వైరం, మరోవైపున మాజీ మంత్రితో కయ్యం, ఇంకో వైపున పార్టీ క్యాడర్ తో ఆంటీ ముట్టనట్లుగానే ఉండడంతో అసలు ఈయన వల్ల ఉపయోగం ఎవరికి పార్టీకా లేదా ఆయనకా?..అనే సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారట గులాబీ నేతలు. ఇకనైనా అధిష్టానం…జిల్లా అధ్యక్షుని మార్పుపై నిర్ణయం తీసుకుంటే తప్ప జిల్లాలో బిఆర్ఎస్‌కి మనుగడ ఉండదని.. ఆయన్నే కొనసాగిస్తే దిగువ స్థాయి కేడర్ కూడా అధికార పార్టీ వైపే వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నారని చెప్పుకుంటున్నారట. చూడాలి మరి కారు పార్టీ ఓనరు ఏలాంటి నిర్ణయం తీసుకుంటారో.
Story By Venkatesh, Bigtv