
Rain news today Telangana & AP(Telugu news updates):
తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. దంచికొడుతున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేకచోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. గంటల తరబడి ఆగకుండా.. మేఘాలు గర్జిస్తున్నాయి.
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో మరో రెండ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావారణ శాఖ హెచ్చరించింది. రాబోయే 24 గంటల్లో ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉండటంతో తెలంగాణలోని పలు జిల్లాలకు, కోస్తాంధ్రకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 11 నుంచి 20 సెం.మీ. వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇటీవల కాస్త గ్యాప్ ఇచ్చినా.. ఆ లోటంతా తీరేలా.. భారీ వాన కురిసింది. తెలంగాణ వ్యాప్తంగా వానాలే వానలు. తెల్లవారుజాము నుంచే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ ఆగమాగమైంది. ఉదయమే స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో రహదారులు చెరువులను తలపించాయి. భారీ ట్రాఫిక్ జామ్‌లతో భాగ్యనగరం బేజార్ అయింది.
నిజామాబాద్ జిల్లా నడిపల్లి దగ్గర ప్రధాన రహదారిని వరద ముంచెత్తింది. నిజామాబాద్-డిచ్‌పల్లి మధ్య రాకపోకలు స్తంభించాయి. నిజామాబాద్ వెళ్లేదారి మళ్లించారు.
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పేట్ సంఘం శివారులో వాగు పొంగి ప్రవహిస్తోంది. వ్యవసాయ పనుల కోసం వెళ్లిన ఇద్దరు రైతులు వరద నీటిలో చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్‌ను కలెక్టర్ జితేష్ పాటిల్, ఎలారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ పర్యవేక్షించారు.
వర్షాలకు జగిత్యాల మండలం తిప్పన్నపేట్‌లోని గచ్చుమాటు వాగు పొర్లింది. వాగులో చేపల వేటకు వెళ్లిన కొండ్ర విద్యాసాగర్ అనే మత్స్యకారుడు గల్లంతయ్యాడు. గల్లంతైన యువకుడు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వర్షానికి కోరుట్ల పట్టణంలోని ముత్యాల వాడ, ఆదర్శ నగర్ కాలనీలు జలమయమయ్యాయి. సిరిసిల్ల పాత బస్టాండ్‌లోని రోడ్డు పూర్తిగా బురద మట్టితో నిండిపోయింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టుకు భారీ వరద నీరు చేరింది. అప్రమత్తమైన అధికారులు.. ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు.
కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 696.250 అడుగుల వరకు నీరు చేరింది.