
YCP leaders comments on Chandrababu naidu(AP politics) :
వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. చంద్రబాబుపై విమర్శల దాడి పెంచారు. వంద కోట్ల సొమ్ముకు లెక్కలు చూపెట్టాలంటూ చంద్రబాబుకి ఐటీ నోటీసులు వచ్చాయంటూ జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఐటీ నోటీసులపై నోరు మెదపాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నాయి. అమరావతి పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తున్నారు.
అయితే, టీడీపీ అధినేత నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మాజీ మంత్రి కొడాలి నాని మరింత డోసు పెంచారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు అని.. లక్ష కోట్లు దోచుకున్నారని అన్నారు. సింగపూర్‌లో ఆయనకు హోటల్స్ ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో డబ్బు పంచడం నేర్పిన వ్యక్తి చంద్రబాబేనని.. 1999లోనే ఒక్కో అభ్యర్ధికి రూ.కోటి ఇచ్చారని ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో రూ.10వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమని పార్టీ నేతలకు ఇప్పటికే చంద్రబాబు చెప్పారని.. అంత డబ్బు ఆయనకు ఎక్కడిదని ప్రశ్నించారు. చట్టాలు, వ్యవస్థల్ని అడ్డుపెట్టుకొని దోచుకునే వ్యక్తి అంటూ మండిపడ్డారు కొడాలి నాని.
అటు, మంత్రి రోజా సైతం మరింత మంట రాజేశారు. అమరావతి పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని.. భువనేశ్వరి, బ్రహ్మణి సూట్‌కేసులు అందుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అండ్ గ్యాంగ్‌ని జైల్లో వేయాలన్నారు మంత్రి రోజా.