
Hyderabad Rain news today(Latest news in telangana):
కుండపోత వానతో హైదరాబాద్ అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా దంచికొట్టిన భారీ వర్షానికి భాగ్యనగరం చిగురుటాకులా వణికిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీలు నీట మునిగాయి. భారీగా చేరిన వరద నీరుతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడంలేదు.
జోరుగా కురుస్తున్న వానలతో నగరంలోని జంట జలాశయాలకు వరద పోటెత్తి నిండుకుండల్లా మారాయి. దీంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో మూసీ నది పరివాహక ప్రాంతం, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.
భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలతోపాటు ఇతర జిల్లాలకు కూడా విద్యాలయాలకు సెలవులు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఆయా జిల్లాల కలెక్టర్లు. ఇంకా నగరంలో అతి భారీవర్షం కురిసే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్. అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. డీఆర్‌ఎఫ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు.
అత్యధికంగా మియాపూర్‌లో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కూకట్‌పల్లిలో 12.3 సెంటీమీటర్లు, షేక్‌పేట లో 11.9 సెంటీమీటర్లు, ఖైరతాబాద్‌లో 11.6 సెంటీమీటర్లు, శేరిలింగంపల్లిలో 11.45 సెంటిమీటర్లు , బంజారాహిల్స్ లో 11.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గాజులరామారం 10.9 సెంటీమీటర్లు, మాదాపూర్ లో 10.7 సెంటీమీటర్లు, షాపూర్ 10.6 సెంటీమీటర్లు, జీడిమెట్ల 10.5 సెంటీమీటర్లు, గచ్చిబౌలిలో 10.1 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది.
మరోవైపు తెలంగాణలో భారీ వర్షాల ముప్పు ఇంకా పొంచి ఉంది. 7 జిల్లాలకు రెడ్ అలెర్ట్, 17 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, 9 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. హైదరాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు.
నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, మహబూబాబాద్, జగిత్యాల,పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్‌నగర్, ములుగు, నారాయణపేట, వికారాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు.
ఆదిలాబాద్, కుమురంభీం, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.