Munugode by poll : ఉప ఎన్నిక ఏదైనా సరే.. బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగిపోతారు. కాయ్ రాజా కాయ్ అంటూ కోట్లలో పందేలకు తెరతీస్తారు. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న మునుగోడుపైనా పెద్ద మొత్తంలో బెట్టింగ్ చేస్తున్నారని సమాచారం. ఐపీఎల్ తరహాలో నెట్ వర్క్ సెటప్ చేసి.. భారీగా డబ్బులు పెడుతున్నారని తెలుస్తోంది.
ఓటింగ్ సరళి అంతుచిక్కకపోవడంతో మునుగోడు ఫలితంపై హైటెన్షన్ నెలకొంది. ఇలాంటి సమయంలోనే బెట్టింగ్ కు మరింత స్కోప్. రేసులో కాంగ్రెస్ వెనకే ఉందని అంటున్నారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచినట్టు అంచనా వేస్తున్నారు. ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. బీఎస్పీకి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటింగ్ జరిగిందని అంటుండటంతో.. ఏనుగు గుర్తు ఏ పార్టీ ఓట్లను చీల్చిందనే టెన్షన్ ప్రధాన పార్టీల్లో ఉంది. దళిత ఓట్లు పెద్ద మొత్తంలో బీఎస్పీకి పడుంటే.. ఆ మేరకు టీఆర్ఎస్ కు పెద్ద డ్యామేజీనే జరిగే అవకాశం ఉంది. రాజగోపాల్ రెడ్డి ఓటు బ్యాంకుకు సైతం గండి పడనుంది.
ఇక కీలకమైన చివరి గంటలో భారీగా ఓటింగ్ జరగడంతో.. ఆ ఓట్లన్నీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లా? అనుకూల ఓట్లా? అనేది తేలటం లేదంటున్నారు. అయితే, అనేక ఎగ్జిట్ పోల్స్ లో టీఆర్ఎస్ పార్టీకే ఎడ్జ్ ఉన్నా.. అవి సాయంత్రం 5-6 వరకే సర్వే చేశాయి. ఆ తర్వాత కూడా చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నడిచింది. ఆ ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపారో ఎగ్జిట్ పోల్స్ కు చిక్కే అవకాశమే లేదు. సో.. సర్వేలు ఏం చెబుతున్నా.. గెలుస్తామనే నమ్మకం మాత్రం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లకు లేదంటున్నారు. అంతటి ఉత్కంఠ ఉంది కాబట్టే పందెం రాయుళ్లు రెచ్చిపోతున్నారు. కాయ్ రాజా కాయ్ అంటూ టెంప్ట్ చేస్తున్నారు.
మునుగోడు ఎన్నిక అటు ఏపీ వాసులనూ ఆకర్షిస్తోంది. బెట్టింగ్ గ్రూపులు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఉండటంతో.. ఇక్కడి ఫలితంపై అక్కడ జోరుగా పందేలు కాస్తున్నారు. గతంలో దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలోనూ కోట్లలో బెట్టింగ్ జరగ్గా.. అంతకుమించి ఈసారి మునుగోడు బెట్టింగ్ గప్ చుప్ గా సాగుతోందని సమాచారం. పోలీసులు గట్టి నిఘా పెట్టామని చెబుతున్నా.. తెర వెనుక జరగాల్సింది జరిగిపోతోందని అంటున్నారు.