China Rocket : చైనాకు చెందిన ఓ భారీ రాకెట్ శకలాలు భూమిపై పడతాయన్న శాస్త్రవేత్తల హెచ్చరికలతో అనేక దేశాల్లో ఆందోళనలు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో స్పెయిన్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. దేశంలోని అన్ని విమానాశ్రయాలను మూసివేసింది.చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ శకలాలు స్పెయిన్ గగనతలాన్ని దాటుకుంటూ వెళ్లే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. అందువల్లే విమానాల రాకపోకలను నిలిపివేశామని స్పెయిన్ ప్రభుత్వం ప్రకటించింది.
తియాంగాంగ్ పేరుతో చైనా అంతరిక్ష కేంద్రం నిర్మిస్తోంది.దీని కోసం గత సోమవారం 23 టన్నుల బరువున్న చివరి మాడ్యూల్‌ను లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ ద్వారా భూమి నుంచి అంతరిక్షంలోకి పంపింది. ఈ మాడ్యూల్‌ను సురక్షితంగా లక్షిత స్థానానికి చేర్చిన లాంగ్ మార్చ్ 5బీ..తిరిగి భూ వాతావరణంలో ప్రవేశిస్తుంది. ఈ రాకెట్ భూ వాతావరణంలోకి చేరుకున్న తర్వాత కొంతభాగం కాలిపోతుందని అంచనా వేస్తున్నారు. ఈ శకలాలు భూమిపై పడతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.