Substations: స్వేచ్చ బ్యూరో: హైదరాబాద్ నగరంలో కొత్త విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు స్థలాభావం తీవ్ర సమస్యగా మారిన నేపథ్యంలో ఎస్పీడీసీఎల్ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఫ్లైఓవర్ల కింద ఉన్న ఖాళీ ప్రదేశాలను వినియోగిస్తూ కాంపాక్ట్ (మోడ్రన్) సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులతో ఇప్పటికే చర్చలు పూర్తి చేసినట్లు సమాచారం. నగరంలో మొత్తం 10 ప్రాంతాలను గుర్తించిన అధికారులు, తొలి దశలో మూడు చోట్ల సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎక్కువ స్థలం అవసరం లేకుండా అత్యాధునిక సాంకేతికతతో నిర్మించే కాంపాక్ట్ సబ్‌స్టేషన్ల ద్వారా విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఎస్పీడీసీఎల్ భావిస్తోంది. భూసేకరణ అవసరం లేకుండా ఫ్లైఓవర్ల కింద ఖాళీగా ఉన్న స్థలాన్ని వినియోగించడం వల్ల సమయం, వ్యయం రెండూ తగ్గనున్నాయి.
మొదటి దశలో కొండాపూర్ ఆర్టీవో కార్యాలయ పరిధిలోని విద్యుత్ అవసరాల కోసం కొత్తగూడ ఫ్లైఓవర్ 59-61 పిల్లర్ల మధ్య ఒక సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే 8వ బెటాలియన్, కొండాపూర్ ప్రాంతానికి విద్యుత్ సరఫరాను మెరుగుపరిచేందుకు కొత్తగూడ ఫ్లైఓవర్ పిల్లర్ నంబర్ 2-3 మధ్య మరో సబ్‌స్టేషన్ నిర్మించనున్నారు. నల్లగండ్ల ప్రాంతానికి సంబంధించిన సబ్‌స్టేషన్‌ను గచ్చిబౌలి సమీపంలో ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మూడు సబ్‌స్టేషన్ల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు ఆహ్వానించే అవకాశం ఉంది. తొలి దశ విజయవంతమైతే, గుర్తించిన మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే తరహా కాంపాక్ట్ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఎస్పీడీసీఎల్ యోచిస్తోంది. నగరంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు.
Also Read: Water Tourism: ఇక గోవా వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో నీటిపై తేలియాడే రెస్టారెంట్.. ఎక్కడో తెలుసా..!
సాధారణ సబ్‌స్టేషన్లతో పోలిస్తే కాంపాక్ట్ సబ్‌స్టేషన్లు తక్కువ స్థలంలో ఏర్పాటు చేయవచ్చు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించే కాంపాక్ట్ సబ్‌స్టేషన్లు వర్షపు నీరు, దుమ్ము తదితరాల ప్రభావం చాలా వరకు ఉండదని అధికారులు చెబుతున్నారు. ఫ్లైఓవర్ కింద ఏర్పాటు చేయడం వల్ల వర్షంలో నేరుగా తడిసే అవకాశం ఉండదని, దీంతో విద్యుత్ పరికరాల భద్రత మరింత మెరుగుపడుతుందని పేర్కొంటున్నారు. అలాగే షార్ట్‌సర్క్యూట్లు, విద్యుత్ ప్రమాదాలు వంటి ఘటనలు తగ్గడంతో పాటు నిర్వహణ కూడా సులభతరం అవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. నగరంలో ఖాళీ స్థలాలు దొరకని పరిస్థితుల్లో ఫ్లైఓవర్ల కింద ఉన్న స్థలాలను వినియోగించడం ద్వారా భూసేకరణ సమస్యను అధిగమించడంతో పాటు విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే, గుర్తించిన మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే తరహా కాంపాక్ట్ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఎస్పీడీసీఎల్ యోచిస్తోంది.
Also read: Farmer DISCOM: రైతు డిస్కంకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బావుల వద్ద కరెంట్ మీటర్లపై కీలక ప్రకటన!